ప్రపంచ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన దినోత్సవము: నవంబర్ 21, 2024
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి సాధారణ ప్రశ్నలు
- డాక్టర్ గారు, మా నాన్న గారి కళ్ళు రెండు నెలల నుండి పసుపు రంగులో ఉన్నాయి. మా RMP గారు చూసి ఇది కామెర్లు అని చెప్పి రెండు నెలల నుండి అతనికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం ప్రారంభించాడు. కానీ మెరుగుపడలేదు. ఇప్పుడు అతని బిలిరుబిన్ స్థాయిలు 30 యూనిట్ల కంటే ఎక్కువ ఉంది. అర్జంటుగా ఏదైనా చేయండి, వచ్చే వారం అమర్‌నాథ్ యాత్రకి సిద్ధపడి ఉన్నాము. దయచేసి మా నాన్న గారి సమస్యను నయం చేయండి, లేదంటే మా ప్రయాణం రద్దు చేసుకోవలసి వస్తుంది.
- డాక్టర్ గారు నా భర్త 10 సంవత్సరాల నుండి మధుమేహంతో బాధపడుతున్నారు. అతని చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ నియంత్రణలోనే ఉండేవి. కానీ ఒక నెల నుండి నియంత్రణలో లేవు. ఆయన సాధారణంగా కూడా ఎక్కువగా తినరు. క్రమేపి బరువు కూడా తగ్గుతున్నారు మరియు ఎప్పటికప్పుడు అలసిపోతున్నారు. ఈ పరిస్థితికి కారణం అతని చక్కెర స్థాయిలా??
- డాక్టర్, మా కుటుంబంలో క్యాన్సర్ కలిగిన చరిత్ర ఉంది. నాకు కూడా అది వస్తుందేమో అనే సందేహం ఉంది. నేను ఏమి చేయాలి? నేను పూర్తి శరీర స్కాన్ చేయించుకోవాలా లేదా క్యాన్సర్‌ని గుర్తించడానికి ఏవైనా మార్గదర్శక పరీక్షలు ఉన్నాయా?
ఇవి మన రోజు వారి వైద్య సాధనలో ఎదుర్కొనే కొన్ని పరిస్థితులు. ప్రతి పేషెంటు అలాగే పేషెంటు యొక్క స్థితి అనేది వైద్యుల దృక్కోణంలో బిన్నంగా ఉంటుంది. మొదటి ప్రశ్నలో మనం నిర్లక్ష్యంగా ఉండే కుటుంబం మరియు పేషెంటును చూడవచ్చు, రెండవ సన్నివేశంలో ప్యాంక్రియాస్ క్యాన్సర్ గురించి తెలియని ఒక నిబద్దత కలిగిన భాగస్వామిని చూడవచ్చు మరియు మూడువ ప్రశ్నలో బాధ్యతాయుతమైన, అప్రమత్తమైన మరియు విద్యావంతులైన వ్యక్తి వైద్యుల యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుతున్నారు. ఒక్కొక్కరితో మన విధానం అనేది వారి యొక్క ఆసక్తిని బట్టి మారుతుంది. నవంబర్ నెల అనేది ప్రపంచ క్యాన్సర్ అవగాహన నెలగా మాత్రమే కాకుండా ప్యాంక్రియాస్ క్యాన్సర్ అవగాహన నెలగా కూడా గుర్తించబడింది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి క్లుప్తంగా వివరణ
ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి) అనేది ఉదరం ఎగువ భాగంలో, కడుపు వెనుక ఉంది. ప్యాంక్రియాస్ పొత్తికడుపులో ఒక ముఖ్యమైన అవయవం, జీర్ణశయాంతర ప్రేగు మరియు ఇతర అవయవాలకు సరఫరా చేసే ప్రధాన రక్త నాళాలు మరియు నరాలకు దగ్గరగా ఉంటుంది. ఇది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది (ఎక్సోక్రైన్ భాగం) మరియు రక్తంలోని చక్కెరలను (ఎండోక్రైన్ భాగం) సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే క్లోమ గ్రంథి కూడా కణితులను అభివృద్ధి చేస్తుంది. కణితులు అంటే క్యాన్సర్ కణితులు అని అర్థం కాదు. వాటిలో చాలా వరకు క్యాన్సర్ లేనివి. ఇతర క్యాన్సర్‌లతో పోలిస్తే ప్యాంక్రియాటిక్ (క్లోమ గ్రంథి) క్యాన్సర్ సంభవం భారతదేశంలో తక్కువగా ఉంటుంది.
ప్యాంక్రియాస్ క్యాన్సర్ యొక్క స్వభావం వల్ల, అదేవిధంగా దాని మీద అవగాహన లేకపోవడం వల్ల తరచూ ఇది ఆలస్యంగా నిర్ధారణ అవుతుంది, 80% కంటే ఎక్కువ మంది పేషెంట్లు రోగనిర్ధారణ సమయానికి శస్త్రచికిత్సకు అనుకూలించరు. ప్రారంభ రోగనిర్ధారణ మెరుగైన నివారణ రేట్లు కలిగి ఉంది, అయితే 50% మంది రోగులు తీవ్రమైన దశలో ఉన్నప్పుడు 3 నెలల్లోనే మరణిస్తారు మరియు 98% మంది చివరి వరకు పోరాడి మరణిస్తారు. చికిత్స తీసుకున్న తర్వాత 10%-15% మంది 5 సంవత్సరాల మనుగడతో జీవిస్తారు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలలో రెండవ అత్యంత సాధారణ కారణంగా పరిగణించబడింది మరియు ఐదవ అత్యంత సాధారణ క్యాన్సర్ గా గుర్తించబడింది.
ముందస్తు స్కానింగ్ పద్ధతులు మరియు ఇతర రోగనిర్ధారణ చికిత్సా విధానాలతో కూడా, కొన్ని సార్లు నిర్దారణ మరియు చికిత్స చేయడం చాలా కష్టం. క్యాన్సర్ యొక్క స్థానం కనుగొనలేకపోవడం, అవగాహన లేకపోవడం, రోగ నిర్ధారణలో ఇబ్బంది రావడం, క్యాన్సర్ తీవ్రత, చికిత్సకు నిరోధకత, పరిమిత చికిత్స ఎంపికలు మరియు నైపుణ్యత కారణంగా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స అనేది ఈ రోజులలో సవాలుగా ఉంది.
ప్రజలలో అవగాహన పెంచి హై రిస్క్ ఉన్న రోగులను పరీక్షించడం అనేది మనుగడను మెరుగుపరచడానికి ఏకైక మార్గం. కమ్యూనిటీ స్థాయిలో ప్రారంభ దశలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లను గుర్తించడానికి ప్రస్తుతం నిర్వహించబడే స్క్రీనింగ్ ప్రోటోకాల్‌లు అందుబాటులో లేవు. అయినప్పటికీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కొన్ని ప్రమాద కారకాలు గుర్తించబడ్డాయి మరియు ఈ ప్రమాద కారకాలు ఉన్న రోగులు సాధారణ వైద్య పరీక్షలు మరియు రోగనిర్ధారణ పరీక్షల నుండి ప్రయోజనం పొందవచ్చు.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు
ప్యాంక్రియాటిక్ (క్లోమ గ్రంథి) క్యాన్సర్ అనేది వయస్సు, ధూమపానం, మద్యం, మధుమేహం, ఊబకాయం, GI క్యాన్సర్ల కుటుంబ చరిత్ర, మాంసం మరియు కొవ్వు ఆహారాలు, దీర్ఘకాలిక మరియు వంశపారంపర్య ప్యాంక్రియాటైటిస్ అదేవిధంగా కొన్ని రుగ్మతల వంటి కారకాలతో ముడిపడి ఉంటుంది. కెమికల్స్ కి బహిర్గతం కావడం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది, అయితే ఫైబర్ అధికంగా ఉండే ఆహారం, పండ్లు మరియు కూరగాయలు దీని యొక్క సంభావ్యతను తగ్గిస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లలో 5%-10% వంశపారంపర్యంగా సంబంధించినవి కావడంతో కుటుంబ సభ్యులకు జన్యుపరమైన సలహాలు మరియు పరీక్షలు సూచించబడతాయి.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క నిర్దారణ
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ సాధారణంగా అనేక దశలను కలిగి ఉంటుంది. మొదట ప్యాంక్రియాటిక్ సర్జన్ పేషెంట్ యొక్క వైద్య చరిత్రను తీసుకుంటాడు మరియు ఏవైనా అనుమానాస్పద లక్షణాలు లేదా సంకేతాల కోసం పరిశీలిస్తాడు. లక్షణాలు అభివృద్ధి చెందే సమయానికి చాలా మంది పేషెంట్లు చికిత్సకు అనుకూలించరు, నివారణ రేటు తగ్గుతుంది. ఎందుకంటే అనేక లక్షణాలు అస్పష్టంగా ఉండటంతో తరచుగా నిర్లక్ష్యం చేయబడతాయి. మీరు ఈ క్రింది లక్షణాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను ఎదుర్కొంటుంటే, మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి:
- పొత్తికడుపులో నొప్పి లేదా మధ్య భాగంనుండి ఎగువ వరకు వెన్నునొప్పి
- వికారం/ ఆకలి లేకపోవడం/ అలసట/ బరువు తగ్గడం
- కామెర్లు / చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారడం
- మలంలో మార్పులు – జిగురుగాను, పల్చగాను ఉండి, నీటిపై తేలుతుంది
- అకస్మాత్తుగా మధుమేహనికి గురికావడం / చికిత్స చేయడానికి కష్టతరంగా ఉండే అనియంత్రిత మధుమేహం.
పేషెంటు యొక్క వైద్య చరిత్ర తెలుసుకుని పరీక్షించిన తర్వాత కొన్ని రక్త పరీక్షలు, ఇమేజింగ్ (స్కానింగ్) మరియు అవసరమైతే బయాప్సీ చేస్తారు. రోగులకు తరచుగా ఎండోస్కోపీ లేదా ERCP అవసరమవుతుంది, వీటి వల్ల కొన్ని సందర్భాల్లో వారికి కామెర్లు ఉన్నట్లు నిర్ధారణ చేయబడటంతో చికిత్స చేయడం జరుగుతుంది. CECT మరియు MRI స్కాన్ కణితి యొక్క దశ మరియు కార్యాచరణ గురించి మరిన్ని వివరాలను అందిస్తాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ తరచుగా క్యాన్సర్ ఉనికిని నిర్ధారించడానికి, వ్యాధి యొక్క దశను నిర్ణయించడానికి మరియు తగిన చికిత్సను ప్రణాళిక చేయడానికి చేయడం జరుగుతుంది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి అందుబాటులో ఉన్న చికిత్స ఎంపికలు
చికిత్స ఎంపికలలో – శస్త్రచికిత్స (విప్పుల్స్ విధానం, ప్యాంక్రియాటెక్టమీ), కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ మరియు ఇమ్యునోథెరపీ అనేవి ఉన్నాయి. కణితి వ్యాప్తి ఉన్నవారికి మరియు చికిత్సకు అనుకూలించనివారికి ఉపశమన చికిత్స (పాలియేటివ్) మరియు సహాయక సంరక్షణ అందించబడుతుంది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నివారణ
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నివారించడం అనేది జీవనశైలి ఎంపికలలో మార్పు చేసుకోవడం మరియు ఈ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాద కారకాలని తగ్గించే అలవాట్లను అవలంబించడం వంటివి చేయాలి. అన్ని ప్రమాద కారకాలు సవరించబడనప్పటికీ, కొన్ని వ్యూహాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు:
- ధూమపానం మానివేయడం.
- మద్యపానాన్ని తగ్గించడం.
- ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైన ఆహారాలను స్వీకరించండి. అదేవిధంగా సంతృప్త కొవ్వులు, ప్రాసెస్ చేసిన మాంసాహారాలు మరియు అధిక చక్కెరలతో కూడిన ఆహారాన్ని నివారించండి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం మరియు పోషకమైన ఆహారం తీసుకోవడంతో ఈ వ్యాధి యొక్క ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
- క్రమం తప్పకుండా వ్యాయామాలను చేయడం.
- దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్ లేదా మధుమేహం వంటి పరిస్థితులకు చికిత్సను తీసుకొవడం.
- ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కుటుంబ చరిత్ర కలిగిన వారికి చికిత్సాపరంగాను మరియు వ్యాధి గురించి జన్యుపరమైన సలహాలు ఇవ్వడం.
- వృత్తి భద్రత: పరిశ్రమలలో హానికరమైన పదార్థాలకు గురికావడాన్ని పరిమితం చేయడం
- ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు: ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను చేర్చడం, సాధారణ ఆరోగ్య పరీక్షలు, మంచి పరిశుభ్రతను నిర్వహించడం మరియు సిఫార్సు చేయబడిన ఆరోగ్య మార్గదర్శకాలను అనుసరించడం వంటివి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 కి కాల్ చేయగలరు.
About Author –
MS (General Surgery), DNB (Surgical Gastroenterology), FALS (Oncology)