టైఫాయిడ్ జ్వరం లక్షణాలు, నిర్దారణ, ఆహార నియమాలు, చికిత్స

టైఫాయిడ్ అంటే ఏమిటి?
టైఫాయిడ్ అంటే సాల్మొనెల్లా టైఫీ అనే బాక్టీరియా వలన కలిగే వ్యాధి, ఈ వ్యాధి సాధారణంగా రెండు నుండి మూడు వారాలపాటు ఉంటుంది. టైఫాయిడ్ సోకిన వారికి జ్వరం మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. మొదటి నాలుగైదు రోజుల పాటు సాధారణ జ్వరం లక్షణాలే కనిపిస్తాయి కానీ సరైన సమయానికి చికిత్స అందకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. చాలామంది పేషేంట్లు టైఫాయిడ్ ను కూడా మాములు జ్వరంగానే భావించి వైద్యులను సంప్రదించకుండా జ్వరానికి మందులు తీసుకుంటుంటారు, ఇలా సొంత వైద్యాన్ని పాటించడం వలన టైఫాయిడ్ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అసలు టైఫాయిడ్ ఎలా సోకుతుంది? దాని లక్షణాలు ఏంటి? ఎలా నిర్దారిస్తారు మరియు చికిత్స విధానం ఏంటి? మొదలైన అన్ని విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
టైఫాయిడ్ జ్వరం యొక్క లక్షణాలు
టైఫాయిడ్ కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీ బాక్టీరియా కేవలం మానవులలో మాత్రమే జీవిస్తుంది, ఈ వ్యాధి సోకిన వారికి దీర్ఘకాలిక జ్వరంతో పాటుగా ఒళ్లునొప్పులు మొదలైన లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
- దీర్ఘకాలిక జ్వరం : టైఫాయిడ్ సోకిన వారికి జ్వరం ఎక్కువగా మరియు దీర్ఘకాలికంగా ఉంటుంది. కొంతమందిలో రాత్రంతా జ్వరం ఉంటూ ఉదయానికి తగ్గుతుంది. సాధారణంగా రెండు లేదా మూడు రోజులకంటే ఎక్కువగా జ్వరం ఉంటే టైఫాయిడ్ పరీక్ష అవసరమవుతుంది.
- తలనొప్పి : రోజంతా తలనొప్పిగా మరియు తల అంతా బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
- అలసట: టైఫాయిడ్ సోకినవారు త్వరగా అలసిపోతుంటారు, రోజువారీ పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తి ఉండదు. ఎక్కువగా నడిచినా ఇతరత్రా పనులు చేసినా వెంటనే అలసిపోతుంటారు.
- కడుపునొప్పి : టైఫాయిడ్ లక్షణాలలో కడుపునొప్పి కూడా ఒకటి, కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండినట్లు అనిపించడం, ఆకలి లేకపోవడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.కొన్నిసార్లు కడుపునొప్పి తీవ్రమైన స్థాయిలో ఉంటుంది.
- వికారం మరియు వాంతులు : టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుడు కొంతమందిలో కొద్దిగా ఆహారం తీసుకున్నా కూడా వాంతులు అవుతాయి, అంతేకాకుండా కడుపులో వికారంగా అనిపిస్తూ ఉంటుంది.
- విరేచనాలు : సాల్మొనెల్లా టైఫీ బాక్టీరియా కారణంగా ఆహారం జీర్ణం అవ్వడంలో సమస్యలు ఏర్పడతాయి.దీని వలన కడుపునొప్పితో పాటు విరేచనాలు అవుతుంటాయి.
- శరీరంపై దద్దుర్లు: టైఫాయిడ్ వలన కొంతమందిలో శరీరంపైన గులాబీ రంగులో దద్దుర్లు ఏర్పడతాయి. సాధారణంగా ఈ లక్షణం అతి తక్కువ మందిలో మాత్రమే కనిపిస్తుంది.
టైఫాయిడ్ జ్వరం ఎందుకు వస్తుంది?
టైఫాయిడ్ కలుషిత నీరు, కలుషిత ఆహారం వలన ఎక్కువగా వ్యాపిస్తుంది. ఒకవ్యక్తి నుండి మరొకరికి వ్యాపించే అవకాశం కూడా ఉంది.
- కలుషిత నీరు: సాల్మొనెల్లా టైఫీ బాక్టీరియా వ్యాప్తికి కలుషిత నీరు ప్రధాన కారణమవుతుంది. మలమూత్రాలు కలిసిన నీటిని త్రాగడానికి లేదా వంట చేయడానికి ఉపయోగించడం వలన టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
- కలుషిత ఆహారం : కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన కూడా టైఫాయిడ్ వ్యాప్తి చెందుతుంది. తినే ఆహారం మీద ఈగలు వాలడం, అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో చేసిన చిరుతిళ్ళు తినడం వలన టైఫాయిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.
- టైఫాయిడ్ సోకిన వ్యక్తుల నుండి : సాల్మొనెల్లా టైఫీ బాక్టీరియా కేవలం మనుషుల్లో మాత్రమే ప్రభావం చూపించగలదు కాబట్టి టైఫాయిడ్ సోకిన వారే ఈ బాక్టీరియా వ్యాప్తికి కారణమవుతారు. ఒక వ్యక్తి టైఫాయిడ్ చికిత్స తీసుకున్న తర్వాత కూడా అతని ద్వారా ఇతరులకు టైఫాయిడ్ వ్యాపించే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి టైఫాయిడ్ చికిత్స తీసుకుని కోలుకున్నా కూడా అతనిలో బాక్టీరియా పూర్తిగా పోదు, ఆ వ్యక్తి సాల్మొనెల్లా టైఫీ బాక్టీరియాకు క్యారీయర్ గా ఉంటాడు, అపరిశుభ్రంగా ఉన్న క్యారియర్ చేసిన వంటలను తినడం ద్వారా కానీ, అతన్ని తాకిన చేతులతో ఆహారాన్ని తినడం కానీ చేసినప్పుడు అతని నుండి టైఫాయిడ్ వ్యాపిస్తుంది.
టైఫాయిడ్ జ్వరాన్ని ఎలా నిర్దారిస్తారు?
టైఫాయిడ్ జ్వరాన్ని నిర్దారించడానికి సాధారణంగా రక్త పరీక్షను నిర్వహిస్తారు. రక్త పరీక్ష ద్వారా బాక్టీరియా నిరోధకతను గమనించి తగిన యాంటీబయాటిక్స్ ను సూచిస్తారు. కొన్ని సందర్భాలలో మూత్రం, మల పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో పేషేంట్ ఎముక మజ్జ నుండి కణజాలాన్ని తీసుకుని పరీక్ష చేస్తారు. పేషేంట్ కు ఉన్న లక్షణాలను బట్టి ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది.
టైఫాయిడ్ జ్వరం ఉన్న సమయంలో పాటించవలసిన ఆహార నియమాలు
సాధారణంగా టైఫాయిడ్ జ్వరం సోకిన పేషేంట్లకు ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు, పైగా ఈ సమయంలో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, అజీర్తి మొదలైన లక్షణాలు ఉండడం వలన పేషేంట్ తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తలు పాటించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి, నూనె పదార్ధాలు, మసాలాలకు దూరంగా ఉండాలి. టైఫాయిడ్ ఉన్నవారు పాటించవలసిన ఆహార నియమాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
పండ్లు : పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది మరియు విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన పేషేంట్ నీరసపడకుండా ఉండగలరు. పుచ్చకాయ, ద్రాక్ష, అరటి పండ్లు, బొప్పాయి, ఆపిల్, జామ మొదలైన పండ్లను తగినంత మోతాదులో తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా మార్కెట్ లో లభ్యమయ్యే పండ్లు దుమ్ము, ధూళికి గురవుతూ ఉంటాయి కాబట్టి వాటిని నీటితో పరిశుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.
సూప్ లేదా తేలికపాటి ద్రావణాలు: టైఫాయిడ్ ఉన్నవారు వేడిగా ఉండే సూప్ లను ఆహారంగా తీసుకోవచ్చు. చికెన్ సూప్, మష్రూమ్ సూప్, వెజిటేబుల్ సూప్, టమాటో సూప్ మొదలైన వాటి ద్వారా పేషేంట్ కు కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
ఉడికించిన కూరగాయలు : టైఫాయిడ్ జ్వరం కలిగిఉన్నవారు ఉడికించిన కూరగాయలను వారి ఆహారంలో చేర్చుకోవాలి. నూనె లేదా నెయ్యి వంటి వాటిలో వేపకుండా నీటిలో ఉడికించిన వాటికి మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకోవచ్చు. రుచి కోసం ఉప్పు, కారం ఎక్కువగా వేసుకోకూడదు. బంగాళాదుంపలు, క్యారెట్స్, బీన్స్, బీట్రూట్, పచ్చి బఠానీ, బేబీ కార్న్ మొదలైన వాటిని తీసుకోవచ్చు.
మజ్జిగ, పండ్ల రసాలు, ORS : టైఫాయిడ్ జ్వరం ఉన్నవారు ఎక్కువగా వాంతులు లేదా విరేచనాల వలన నిర్జలీకరణం (డీహైడ్రేషన్) కు గురవుతారు. ఇలా జరగకుండా పేషేంట్ తరచుగా మజ్జిగ, చక్కెర లేకుండా పండ్లరసాలు మరియు ORS ద్రావణాలను తీసుకోవాలి.
టైఫాయిడ్ జ్వరం ఎన్ని రోజులు ఉంటుంది?
టైఫాయిడ్ జ్వరం యొక్క ప్రభావం ఒకొక్క పేషేంట్ కు ఒకొక్క విధంగా ఉంటుంది, టైఫాయిడ్ లక్షణాలను మొదట్లోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే వారం నుండి పది రోజుల్లో తగ్గిపోతుంది. కొన్నిసార్లు టైఫాయిడ్ ప్రభావం రెండు వారాల వరకూ మరికొన్ని సందర్భాలలో నాలుగు వారాల వరకూ ఉండవచ్చు. పేషేంట్ కు జ్వరం రెండు లేదా మూడు రోజులకు మించి తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి, ఎందుకంటే చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ టైఫాయిడ్ ప్రాణాంతకంగా మారుతుంది. పది సంవత్సరాల లోపు పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వలన వారికి టైఫాయిడ్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
టైఫాయిడ్ జ్వరానికి ఎలాంటి చికిత్స చేస్తారు?
టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి డాక్టర్స్ యాంటీబయాటిక్ మందులను సూచిస్తారు, అయితే టైఫాయిడ్ కు కారణమయ్యే బాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్ ను కూడా తట్టుకునే సామర్ధ్యాన్ని రూపొందిచుకుంటున్నాయి. అందుకని పేషేంట్ లక్షణాలను బట్టి వారికి యాంటీబయాటిక్స్ లో మార్పు చేయాల్సి ఉంటుంది. వ్యక్తీగతీకరించిన చికిత్స చేయడానికి పేషేంట్ యొక్క రక్తపరీక్ష, మూత్ర పరీక్ష రిపోర్టులు అవసరమవుతాయి. చాలామంది పేషేంట్స్ కొద్దిగా జ్వరం తగ్గగానే మందులను వాడడం మానేస్తారు, అలాంటి సమయంలో టైఫాయిడ్ జ్వరానికి కారణమయ్యే బాక్టీరియా పూర్తిగా అంతం అవ్వదు, పేషేంట్ లో యాంటీబయాటిక్ శక్తి తగ్గగానే టైఫాయిడ్ మళ్ళీ వస్తుంది, కాబట్టి డాక్టర్ సూచించిన మందుల కోర్సును పూర్తిగా వాడాలి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.
FAQ’s
నాకు టైఫాయిడ్ జ్వరం ఉందని అనుమానంగా ఉంది, నేను మెడికల్ షాప్ నుండి యాంటీబయాటిక్స్ తీసుకుని వాడవచ్చా?
లేదు, టైఫాయిడ్ నిర్దారణ కోసం రక్తపరీక్ష చేసిన తర్వాత బాక్టీరియా వ్యాప్తి మరియు లక్షణాలను బట్టి పేషేంట్ కు అవసరమైన యాంటీబయాటిక్స్ ను డాక్టర్ సూచ్చిస్తారు. సొంత వైద్యం తీసుకోవడం వలన పేషేంట్ కి ఉన్న టైఫాయిడ్ ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది.
టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా?
లేదు, టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుడు పేషేంట్ జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది ఇలాంటి సమయంలో అధిక మసాలా, కారం ఉన్న వంటలను తీసుకోకూడదు. పేషేంట్ నీరసపడకుండా చికెన్ సూప్ తీసుకోవచ్చు.