ఒత్తిడి రకాలు, లక్షణాలు, కారణాలు & నివారణ చర్యలు

ఒత్తిడి రకాలు, లక్షణాలు, కారణాలు & నివారణ చర్యలు

పరిచయం

ఇటీవల కాలంలో మారిన జీవనశైలి మరియు పని వేళల వల్ల ప్రస్తుతం చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి అయినా ఒత్తిడికి గురయ్యే ఉంటారు. బాధ‌, కోపం, ఒత్తిడి వంటివి శారీరక వ్యాధుల కంటే తక్కువ ప్రమాదకరం అని అనుకున్న కూడా నిజానికి అవే ఎక్కువ సమస్యలను కలుగజేస్తాయి. ఈ సమస్య వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఏవ‌రికైనా రావొచ్చు. ఒత్తిడి ఎక్కువగా యుక్తవయసు గల వారిలో ప్రారంభమవుతుంది. ఈ సమస్య ఎక్కువ దగ్గర వారిని కోల్పోవ‌డం మరియు దూరం కావ‌డం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో గమనించవచ్చు. అంతే కాకుండా మన మనస్తత్వం, ఆలోచనా ధోరణి, జీవితంలో జరిగే పెనుమార్పులు, సంఘటనలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, కలహాలు, మితిమీరిన అంచనాలు, ప్రతీది పక్కాగా జరగాలని అనుకోవడం లాంటి పరిస్థితులు కూడా మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి.

ఒత్తిడికి లోనవటం వల్ల మనకు తెలియకుండానే రకరకాల ఆరోగ్య సమస్యలు బారిన పడుతుంటారు. ఒత్తిడి సమస్య ఉన్న వారు కడుపు నిండా తినడం, సమయానుకులంగా పడుకోలేకపోవడం వంటివి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి వల్ల అన్నింటి కంటే ముందు ప్రభావితమయ్యేది మన వ్యాధి నిరోధక వ్యవస్థ. దాంతో అది అనేక జబ్బులకూ, శారీరక సమస్యలకు కారణం అవుతుంది.

ఒత్తిడి రకాలు

ఒత్తిడి సమస్య ప్రధానంగా 2 రకాలు అవి:

1. తీవ్రమైన ఒత్తిడి: తీవ్రమైన ఒత్తిడి స్వల్పకాలికం. ఒక వ్యక్తికి భయానకమైన లేదా ప్రమాదకరమైన సంఘటన లేదా పరిస్థితికి గురైనప్పుడు లేదా ఒక నిర్దిష్ట సంఘటన జరిగినప్పుడు ఈ రకమైన ఒత్తిడి కలుగుతుంది.

2. దీర్ఘకాలిక ఒత్తిడి: దీర్ఘకాలిక ఒత్తిడి చాలా కాలం పాటు ఉంటుంది. నిరంతర సవాళ్లు లేదా ఒత్తిళ్ల వల్ల మరియు ఆర్థిక సమస్యలు, పనిలో ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు వంటివి ఏమైనా ఉంటే వారిలో ఈ దీర్ఘకాలిక ఒత్తిడి కలుగుతుంది.

తీవ్రమైన ఒత్తిడి మరియు దీర్ఘకాలిక ఒత్తిడి రెండూ మన రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఒత్తిడి యొక్క లక్షణాలు

Types of Stress

కొందరు వ్యక్తులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాళ్లలో తీవ్రమైన ఒత్తిడి ఉన్న విషయమే వారికి తెలియకపోవచ్చు. కానీ ఈ క్రింది శారీరక లక్షణాలతో వారు ఒత్తిడి బారిన పడినట్లు నిర్ధారించవచ్చు.

• మాటి మాటికీ తలనొప్పి వస్తూ ఉండడం

• మెడ నొప్పి మరియు వెన్ను నొప్పి

• తరచుగా కండరాలు పట్టేస్తుండడం మరియు ఒంటి నొప్పులు వంటివి ఒత్తిడి సమస్యకు ప్రాథమిక లక్షణాలు.

వీటితో పాటుగా :

• విపరీతమైన అలసట

• అజీర్తి (అజీర్ణం)

• బీపీ పెరిగి ఎక్కువగా కోపం రావడం

• చిన్న వాటికే చిరాకు పడుతూ ఉండటం

• పనిపై ఏకాగ్రత లేకపోవడం

• బాగా అలస్యంగా నిద్రపట్టడం లేదా అసలు నిద్ర పట్టకపోవడం

• ఆకలి లేకపోవడం

• నలుగురిలోకి వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడం

• ఉన్నట్లుండి ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడడం

• గతంలో జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు రావడం

• ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండడం

• తరచూ ఛాతీలో నొప్పి, గుండె దడగా ఉండటం కూడా ఒత్తిడి యొక్క లక్షణాలుగానే అభివర్ణించాల్సి ఉంటుంది.

ఒత్తిడికి గల కారణాలు

ఒత్తిడికి సంబంధించిన కొన్ని సాధారణ కారణాలు:

  • పని భారం: వారు చేసే పనుల వల్ల దైనందిన జీవితంలో చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి మానసికంగాను మరియు శారీరకంగాను జీవితంపై ప్రభావం చూపుతుంది.
    ఎక్కువగా ఆలోచించడం: కొందరు ప్రతి విషయాన్ని ఎక్కువగా అలోచించి భవిష్యత్తు మరియు గతం గురించి తలచుకొని బాధపడుతుంటారు. అయితే ఇలా చిన్న చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా ఒత్తిడికి గురవుతుంటారు.
  • ఆరోగ్య సమస్యలు: కొంతమందికి ఈ ఒత్తిడి సమస్య అనేది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుంది. అంతే కాకుండా గుండెవ్యాధి, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు కలిగి ఉన్నవారు సైతం ఒత్తిడి గురయ్యే ప్రమాదం ఉంది.
  • మద్యపాన వినియోగం: చాలా మంది నొప్పి, దుఃఖం, నిరాశ, విచారం మరియు బాధలను మరచిపోవడానికి మద్యం మరియు ఇతర మత్తుపదార్థాల వైపు మొగ్గు చూపుతారు. అవి మానలేక, వాటికి పూర్తి గా వ్యసనమై,ఒత్తిడికి లోనవుతారు
  • దగ్గరి వారిని కోల్పోవడం: బాగా దగ్గరైన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తీవ్రంగా అనారోగ్యానికి గురైన మరియు చనిపోయిన ఆ పరిస్థితి విస్తృతమైన ఒత్తిడి మరియు భావోద్వేగ ప్రతిచర్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితి కారణంగా చాలా మంది అనేక సంవత్సరాలుగా ఒత్తిడిలో ఉంటారు.
  • కుటుంబ పరిస్థితులు: కుటుంబంలో జరిగే పరిస్థితుల వల్ల కూడా కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. బాల్యం, యుక్తవయసులో జరిగిన పలు విషయాలను గుర్తుచేసుకుని కూడా కొందరు ఒత్తిడికి గురవుతుంటారు.
  • సరైన నిద్ర లేకపోవడం: ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి కార‌ణంగా నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. ఇది కూడా ఒత్తిడి సమస్యను ప్రేరేపిస్తుంది.
    వ్యక్తిత్వ క్రమరాహిత్యం (పర్సనాలిటీ డిజార్డర్‌): కొంతమందికి పరిపూర్ణతతో పని చేసే అలవాటు ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఈ మొండితనం వల్ల కూడా ఒత్తిడి కలుగవచ్చు.ఈ ఒత్తిడి కారణంగా డిప్రెషన్ లేదా అనేక రకాల ఇతర మానసిక ఆరోగ్య రుగ్మతలు కూడా కలుగే అవకాశం ఉంటుంది.

ఒత్తిడి యొక్క నివారణ చర్యలు

సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులు ఒత్తిడి ఉంటే పెద్దగా ప్రభావం ఉండదు. దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం పలు సమస్యలు ఎదురువుతాయి కావున, ఈ క్రింది పద్దతుల ద్వారా ఒత్తిడిని నివారించుకోవచ్చు.

• ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి కార‌ణంగా స‌రిగ్గా నిద్ర పోవ‌డం లేదు. ఒత్తిడిని అధిగమించడానికి తగినంతగా అంటే కనీసం 7-8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి

• ఆరోగ్యకరమైన, సమతుల్య, పోషకాలు కలిగిన ఆహారాలను ప్రతి రోజు సరైన సమయానికి తీసుకోవడం

• కెఫిన్, నికోటిన్ మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడం

• రాత్రి వేళలో మొబైల్ ,టీవీ ,లాప్టాప్ లకు దూరంగా ఉండడం

• పడుకునే ముందు మధురమైన సంగీతం వినడం

• పని చేస్తూనే మధ్యలో ప్రాణాయామ శ్వాస వ్యాయామం వంటివి చేయడం

• ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు సూర్యకాంతిలో గడపండి

• ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలి

• అనవసరమైన ఆలోచనలు చేయడం మానేయాలి

• పాత విషయాలను గుర్తు చేసుకొని బాధపడడం మానేయాలి

• భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని సానుకూలతతో ఉండడం నేర్చుకోవాలి

• మనకు ఇష్టమైన వ్యక్తుల ఫోటోలు లేదా బొమ్మలను డెస్క్‌ మీద పెట్టుకుని వాటిని చూసినప్పుడల్లా మన ఆలోచనలు మారి కాస్త ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు

• సమయం చిక్కినప్పుడు కుటుంబ సభ్యులతోను,స్నేహితులతోను ఫోన్‌లో మంచి సంభాషణ చేయాలి

• ఏధైనా అంశం తీవ్రంగా బాధపెడుతుంటే లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాతాపానికి వస్తుంటే మరో వ్యాపకంలో పడిపోయి దాన్ని మరిచిపోవాలి.

• పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడాలి, అంతేకాకుండా సమస్యలను అదిగమించాల్సిన పరిస్థితుల్లో ఏ మార్గం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి

• దేహానికి అవసరమైన వ్యాయమాలు చేయాలి, దీని వల్ల మెదడును ప్రశాంతంగా చేసే రసాయానాలు విడుదలవడంతో ఒత్తిడి తగ్గుతుంది.

కొన్నీ రకాల మానసిక వ్యాధుల్ని మందులతో నయం చెయలేము. అయితే ఏ వయస్సు వారిలోనైనా ఈ ఒత్తిడి వంటి సమస్యను గుర్తించినప్పుడు దానిని ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్సలు తీసుకోవడం ఉత్తమం. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఈ ఒత్తిడి సమస్య నుంచి వీలైనంత త్వరగా కోలుకుని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Bharath Kumar Surisetti is a Consultant Neurologist at Yashoda Hospitals, Malakpet.

About Author

Dr. Bharath Kumar Surisetti | yashoda hospitals

Dr. Bharath Kumar Surisetti

MD, DM (Neurology), PDF Movement Disorders (NIMHANS)

Consultant Neuro Physician