క్షయ (TB) వ్యాధికి గల కారణాలు, లక్షణాలు, చికిత్సలు మరియు నివారణ చర్యలు
క్షయ వ్యాధి పరిచయం
వాడుక భాషలో TBగా పిలిచే క్షయ వ్యాధి (ట్యుబర్‌కులోసిస్) వల్ల ప్రతి సంవత్సరం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యుబర్‌కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. కానీ మెదడు, మూత్రపిండాలు మరియు వెన్నెముక వంటి శరీరంలోని ఇతర భాగాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. క్రియాశీల పల్మనరీ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులే TB వ్యాప్తికి మూలం.
2016లో 10 లక్షల మంది చిన్నారులకు టీబీ సోకగా 2.5 లక్షల మంది పసివాళ్లు ప్రాణాలు కోల్పోయారంటే నమ్మశక్యం కాని విషయం. ప్రపంచంలోనే వందలో 4వ వంతు జనాభాలో క్షయ బ్యాక్టీరియా ఉందంటే ఈ వ్యాధి ప్రభావం ఏ మేర వ్యాపించి ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ TB వ్యాధిగ్రస్తులు మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ.
క్షయ వ్యాధికి గల కారణాలు
భారత్ లో విస్తరిస్తున్న అనేక వ్యాధుల్లో ఈ క్షయ వ్యాధి ఒకటి. ఇది మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మజీవి (బ్యాక్టీరియా) ద్వారా సంభవించే అంటువ్యాధి. ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించినదే అయిన చర్మం నుంచి మెదడు వరకు శరీరంలోని ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంది. క్షయ వ్యాధి ముఖ్యంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది.
ఈ వ్యాధి బారినపడి ఇప్పటికీ ప్రతి సంవత్సరం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి (యాక్టివ్ TB) నుంచి గాలిలోకి విడుదలయ్యే సూక్ష్మ చుక్కల
ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది.
క్షయ వ్యాధి లక్షణాలు మరియు సంకేతాలు
క్షయ వ్యాధి శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. ఈ వ్యాధిగ్రస్తుల్లో ఈ కింది లక్షణాలు అగుపిస్తాయి.
- క్షయ వ్యాధి సోకిన వారిలో దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రక్తంతో కూడిన దగ్గు, రాత్రిపూట చెమటలు పడుతుండడం మరియు కఫంలో రక్తం వంటి లక్షణాలు 2 వారాలకు మించి ఉంటాయి.
- ఎల్లప్పుడూ అలసిపోయినట్లు అనిపించడమే కాక, నొప్పి మరియు ప్రభావిత ప్రాంతాల్లో వాపు వస్తుంది.
- ఈ వ్యాధిగ్రస్తుల్లో శ్వాస ఆడకపోవడం, ఛాతి నొప్పి వంటి సమస్యలు కూడా సంభవిస్తాయి.
క్షయ వ్యాధి ఎవరిలో ఎక్కువగా వస్తుంది?
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లలు మరియు వృద్ధులకు TB వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- మధుమేహం, కిడ్నీ వ్యాధులు మరియు HIVతో బాధపడుతున్న వారిలో TB వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
- పోషకాహారలోపం మరియు సిలికోసిస్ ఉన్నవారి లోనూ ఈ వ్యాధి సోకుతుంది.
- ఆర్థరైటిస్, సోరియాసిస్ వ్యాధిగ్రస్తుల్లోనూ TB వ్యాధి సోకుతుంది.
క్షయ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దగ్గేటప్పుడు మరియు తుమ్మేటప్పుడు గాలి బిందువుల ద్వారా TB వ్యాధి వేరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మాస్క్‌ను ధరించవలెను.
- ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువ వెలుతురున్న గదుల్లో జీవించాలి. ఎందుకంటే TB సూక్ష్మజీవి (బ్యాక్టీరియా) అనేది మూసి ఉన్న గదుల్లో మరింత సులభంగా వ్యాప్తి చెందుతుంది.
- ఈ వ్యాధి సోకిన మొదటి కొన్ని వారాల్లోనే వేగంగా విస్తరిస్తుంది కావున, ఆ సమయంలో రోగితో ఇతర వ్యక్తులు కలిసి ఉండడం లేదా నిద్రించడం వంటివి చేయకూడదు.
- TB వ్యాప్తి చెందకుండా సంక్రమణ నియంత్రణ నిపుణులను సంప్రదించాలి.
క్షయ వ్యాధి సోకడం ద్వారా వచ్చే సమస్యలు
ఈ వ్యాధి సోకిన వ్యక్తులకు సాధారణంగా వెన్నునొప్పి మరియు దృఢత్వం లోపించడం వంటి సమస్యలు వస్తాయి.
- క్షయవ్యాధి వల్ల వచ్చే ఆర్థరైటిస్ సాధారణంగా తుంటి మరియు మోకాళ్ల నొప్పులను ప్రభావితం చేస్తుంది.
- ఈ వ్యాధిగ్రస్తుల్లో మెదడును కప్పి ఉంచే పొరలు వాపుకు (మెనింజైటిస్) గురి కావడంతో శాశ్వతమైన మరియు అడపాదడపా తలనొప్పి మరియు అనేక మానసిక మార్పులకు గురవుతారు.
క్షయ వ్యాధి వ్యాప్తికి గల ప్రమాద కారకాలు
- TB వ్యాధి రోగి శరీరాన్ని మరింతగా హాని చేస్తుంది. అంతేకాక, ఈ వ్యాధి నిర్మూలనలో బాగంగా వాడే మందులు పేషంట్‌లో రోగనిరోధక వ్యవస్థను మరింత బలహీనపరుస్తాయి.
- పొగాకు అతిగా వాడటం వల్ల TB వ్యాధి బారినపడటమే కాకుండా వారు చనిపోయే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
- జైళ్లు, నిరాశ్రయులైన ఆశ్రయాలు, మానసిక ఆసుపత్రులు మరియు నర్సింగ్‌హోమ్‌లలో నివసించే లేదా పనిచేసే వ్యక్తులు సరైన వెలుతురు లేని కారణంగా కూడా ఈ వ్యాధికి గురవుతారు.
క్షయ వ్యాధి నిర్దారణ ఎలా చేస్తారు?
- చర్మ పరీక్ష: చర్మ పరీక్షను మాంటౌక్స్ ట్యూబర్‌క్యులిన్ చర్మ పరీక్ష (PPD test) అని పిలుస్తారు.
- ఛాతీ ఎక్స్-రే: మీ PPD పరీక్ష పాజిటివ్ అని డాక్టర్ తెలుసుకుంటే అతను ఛాతీ ఎక్స్-రే చేయమని మీకు సిఫార్సు చేయవచ్చు.
- కఫం పరీక్ష: TB బాక్టీరియా కోసం పరిశీలించడానికి మీ ఊపిరితిత్తుల లోతు నుంచి కఫాన్ని సేకరించి పలు పరీక్షలు చేసి ఈ వ్యాధి సోకిందా లేదా అని నిర్దారణ చేయవచ్చు.
పైన ఉన్న అనేక రకాల పరీక్షలను చేసిన అనంతరం వైద్యులు ఆ వ్యక్తికి ఉన్న TB రకం ఆధారంగా యాంటీబయాటిక్స్ ఐసోనియాజిడ్, రిఫాంపిన్, ఇతాంబుటోల్ మరియు పిరజినామైడ్ మందులు వాడమని సూచిస్తారు. ఈ వ్యాధికి గురైన సగటు వ్యక్తి అతనిలో ఉన్న వ్యాధి దశను బట్టి ఆ వ్యాధికి మందులు వాడాల్సి ఉంటుంది.
TB బారినపడిన వారు కనీసం 6-9 నెలల వరకు వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా TB మందులను తీసుకుంటూ ఉండాలి. ఈ వ్యాధి పూర్తిగా నయం కావాలంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ తగు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.
మా అనుభవంతులైన వైద్య నిపుణుల కొరకు +919513262676 కు కాల్ చేసి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోగలరు
About Author –
Dr. V Pratibh Prasad, Consultant Clinical and Interventional Pulmonologist , Yashoda Hospital, Hyderabad
MBBS, DNB (Pulmonary Medicine), SCE-Resp Medicine (UK), Fellowship in Interventional Pulmonology