భుజం నొప్పి: లక్షణాలు, కారణాలు & నివారణ చర్యలు
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల ప్రస్తుతం చాలా మంది భుజం నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నిజ జీవితంలో ఏ పని చేయాలన్నా భుజములోని కీలు కదలికలతోనే చేయాల్సి ఉంటుంది. భుజము కీళ్లులో మార్పు రావడంతో నొప్పి ఆరంభమై పనులు చేసుకోవడం కష్టంగా మారుతుంది. మోకాళ్ల నొప్పి వయోధికులలో ఎక్కువగా కనిపిస్తుండగా, భుజానికి సంబంధించిన సమస్యలు మాత్రం అన్ని వయసుల వారినీ ఇబ్బంది పెడుతున్నాయి. భుజం నొప్పితో బాధపడే వారిలో కనీసం పక్కకు కూడా కదలలేని పరిస్థితి తలెత్తుతుంది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా అందరిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ భుజం యొక్క అసాధారణతల వల్ల కొన్ని సార్లు కండరాలు బిగుసుకుపోమే స్థితి ఏర్పడుతుంది.
ఈ భుజం సమస్యలు ప్రధానంగా 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో కనిపిస్తుంది.
భుజం నొప్పికీ కారణాలు
ఫ్రోజెన్ షోల్డర్: సాధారణంగా ఈ సమస్య మెడ, భుజాల కండరాలు, కీళ్లను ప్రభావితం చేస్తుంది. చేయి, భుజాన్ని కలిపే ఎముకలు, స్నాయువులు కణజాలంతో కప్పబడి ఉంటాయి. ఈ కణజాలంలో వాపు సంభవించినప్పుడు లేదా గట్టిగా మారినప్పుడు భుజం బిగుసుకుపోయి నొప్పి తలెత్తుతుంది. ఈ సమస్య ఎక్కువగా 40 ఏళ్లు పైబడిన వారిలో మరియు మధుమేహం వంటి కొన్ని వైద్య పరిస్థితులు ఉన్నవారిలో కనిపిస్తుంది.
షోల్డర్ డిస్‌లొకేషన్ (భుజం జారడం): ఈ సమస్య ఉన్న పేషంట్ లలో (భుజంలోని బంతిని పోలిన ఓ భాగం) దాని యొక్క స్ధానం నుంచి పక్కకు జరుగుతుంది. దీంతో భుజాన్ని కదిపినప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ సమస్య ఎక్కువగా 15-40 ఏండ్ల వారిలో కనిపిస్తుంది. చేతిని పైకెత్తినప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు, నిద్రలో బరువంతా ఒకేవైపు వేసిన పరిస్థితుల్లో ఈ విధంగా జరగవచ్చు..
షోల్డర్ ఆర్థరైటిస్: షోల్డర్ ఆర్థరైటిస్ (భుజం కీళ్ల అరుగుదల) కూడా తీవ్రమైన సమస్యే. మోకీళ్లు అరిగినట్టే, భుజం కీళ్లు కూడా అరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ షోల్డర్ ఆర్థరైటిస్ సమస్య ఎక్కువగా వృద్ధాప్యంలో గమనించవచ్చు.
రొటేటర్ కఫ్ టేర్స్ (భుజం కండరాల చీలిక): షోల్డర్ రొటేటర్ కఫ్ టేర్స్ లేదా భుజం కండరాల చీలికలు అనేవి ప్రమాదాల్లో దెబ్బతగిలినప్పుడు మరియు వయసురీత్యా వచ్చే కండరాల బలహీనత వల్ల కూడా రావొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు చేయి పైకెత్తినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. ఈ సమస్య వల్ల బరువులు మోయాలంటే నొప్పితో విలవిల్లాడి పోతారు.
పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్: ఈ ఆర్థరైటిస్ భుజానికి ఏదైనా గాయం అయినప్పుడు కనిపిస్తుంది. ఇది కీళ్లలో మంటను కలిగిస్తుంది. పగుళ్లు , స్నాయువు దెబ్బతినడం (బెణుకులు), కండరాలు లేదా స్నాయువుకు దెబ్బ తగిలినప్పుడు (జాతులు) లేదా మృదులాస్థికి గాయాలు అయినప్పుడు ఈ ఆర్థరైటిస్ సంభవించవచ్చు.
అధిక బరువు: అధిక బరువు వల్ల చేతుల కదలిక పరిమితమైపోతుంది. దాంతో భుజం కీళ్ల అరుగుదల మొదలవుతుంది.
దెబ్బలు, గాయాలు: ఫ్రాక్చర్లు, దెబ్బలు, ఒత్తిడిలు అనేవి క్రమేపి భుజం ఆర్థ్రయిటిస్‌కు దారి తీసి భుజం నొప్పికి కారణమవుతాయి.
ఆటో ఇమ్యూన్ డిజార్డర్: శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మృదులాస్థిని దెబ్బతీయడం ద్వారా ఆర్థ్రయిటిస్ తలెత్తవచ్చు. ఇది క్రమేణ భుజం నొప్పికి దారితీయవచ్చు
అవసరానికి మించి చేతులను ఉపయోగించడం: క్రీడల్లో ఒకే చేతిని ఉపయోగించినా ఆర్థ్రయిటిస్ సమస్య తలెత్తవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే, క్రీడల్లో సరైన పరికరాలు ఉపయోగించాలి. తరచూ విరామాలు తీసుకుంటూ ఉండాలి.
• మెనోపాజ్ వల్ల వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు
• డయాబెటిస్ మరియు కార్టిలేజ్ అరిగిపోవడం వంటి సమస్యలు కూడా భుజం నొప్పిని ప్రేరేపిస్తాయి.
భుజం నొప్పి యొక్క లక్షణాలు
- భుజంలో తీవ్రమైన నొప్పి
- భుజం బిగుసుకుపోవడం
- చేతులు కదిలించలేని పరిస్థితి
- చెయ్యి పైకెత్తలేక పోవడం
- చేతుల్లో తిమ్మిరి రావడం
- బరువులు లేపలేకపోవడం
- వ్యాయామం చేయలేకపోవడం
- బట్టలు వేసుకుంటున్నప్పుడు ఇబ్బంది కలగడం
- ఆటలు ఆడలేకపోవడం
- రాయలేకపోవడం
- భుజం కదులుతున్నప్పుడు ఒక రకమైన శబ్దం రావడం
అయితే కొన్ని సార్లు భుజం నొప్పి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు రాత్రుళ్లు కూడా ఈ నొప్పి వేధిస్తుంది.
భుజం నొప్పి యొక్క నివారణ చర్యలు
- ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుంటే హెడ్‌సెట్ ఉపయోగించాలి
- భుజం నొప్పి ఉన్న వారు భుజానికి హ్యాండ్ బ్యాగ్స్ వేయడం వంటివి చేయకూడదు
- రోజువారీ వ్యాయామాల్లో భుజాల కదలికలకు సంబంధించిన కసరత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి
పోషకాహారం: భుజాల నొప్పి రావడానికి కండరాల బలహీనత కూడా ఒక కారణం కావున కండరాలను దృఢంగా మార్చేందుకు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలి.
విశ్రాంతి: భుజం నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. విరామం లేకుండా పనిచేయడంతో భుజం నొప్పి ఎక్కువ అవుతుంది కావున, పనులు చేసేటప్పుడు మధ్య మధ్యలో విరామాలు తీసుకోవడం ఉత్తమం.
స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం: స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడంతో కండరాలు ఆరోగ్యంగా మారడమే కాక భుజం నొప్పిని సైతం తగ్గిస్తుంది. స్ట్రెచింగ్ వ్యాయామాలు శరీర పెక్ల్సీబిలిటిని మరింత పెంచుతాయి.
కుషన్ ను ఉపయోగించడం: కూర్చునే టప్పుడు ప్రతిసారి వీపుకు మద్దతుగా కుషన్ ను ఉపయోగించడం ద్వారా భుజాలపై భారం తగ్గుతుంది.
ఐస్ థెరపీ: ఐస్ థెరపీ కూడా భుజం నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
హీటింగ్ ఫ్యాడ్: భుజం నొప్పిని తగ్గించడంలో హీటింగ్ ఫ్యాడ్ కుడా చాలా బాగా పనిచేస్తుంది. భుజాలకు వేడిని అందించడం ద్వారా భుజం నొప్పి నుంచి బయటపడవచ్చు
• మరీ ముఖ్యంగా క్రీడాకారులు, వ్యాయామం చేసేవారు ప్రారంభంలో భుజాలకు సంబంధించిన వ్యాయమాలు చేయడం ద్వారా కూడా భుజాలను మరింత ఆరోగ్య వంతంగానూ మరియు దడంగాను తయారుచేసుకోవచ్చు.
భుజం నొప్పి చికిత్సలు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా పద్ధతుల్లో భుజం నొప్పికి శాశ్వత పరిష్కారాలు అందుబాటులో కలవు. భుజం నొప్పిని ప్రారంభదశలోనే గుర్తించినా లేదా భుజం కండరాల్లో చీలిక చిన్నగా ఉన్నప్పుడు గుర్తించినా నయం చేయవచ్చు. కొన్నిరకాల వ్యాయామాల (ఫిజియోథెరపీ) తో పాటు ఇంజెక్షన్ లు, మందులను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రణలోకి తీసుకురావచ్చు. అయితే సమస్య తీవ్రమైపోయి భుజం కీళ్లు ఎక్కువ అరుగుదలకు గురైనప్పుడు షోల్డర్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవసరం అవ్వొచ్చు.
అతిగా శ్రమించడం, ఒత్తిడి వంటి కారణాలతో పాటు పరుపులు, దిండ్లు సరైనవి వాడకపోవడం, పడుకునే భంగిమలు సరిగ్గా లేకపోవడం, బరువైన బ్యాగుల్ని భుజానికి వేసుకోవడం కూడా మెడ & భుజం నొప్పికి దారితీస్తాయి. అయితే ఇవి ఒకటి రెండు రోజుల్లో తగ్గితే పర్వాలేదు కానీ వారాలతరబడి భుజం నొప్పి వెంటాడు తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించడం ఉత్తమం.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681మాకు కాల్ చేయగలరు.
Dr. Krishna Subramanyam
About Author –
Sr. Consultant Orthopedic Surgeon, Yashoda Hospitals, Hyderabad