పిల్లలకు నిద్ర పట్టకపోవడానికి కారణాలు & త‌ల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లలకు నిద్ర పట్టకపోవడానికి కారణాలు & త‌ల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నేటి డిజిటల్‌ యుగంలో జోల పాటలు పాడితే నిద్రపోయే పిల్లలు చాలా అరుదు. కొంతమంది పిల్లలు ఇలా పడుకోగానే అలా నిద్రలోకి జారుకుంటారు. కానీ, మరికొంత మంది అయితే అస్సలు నిద్రపోరు. వారిని నిద్రపుచ్చడానికి త‌ల్లిదండ్రులు నానా అవ‌స్థలు ప‌డుతుంటారు. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులు అందరిలోనూ నిద్ర గంటలను తగ్గటానికి కారణాలు అవుతున్నాయి. పిల్లల ఎదుగుదలలో తిండి తరువాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల మరియు మెదడు వికసించటం రెండూ నిద్రలోనే జరుగుతాయి. 

కారణం లేకుండా ఏ చంటి బిడ్డ అయినా ఇబ్బంది పెడుతున్నాడంటే ముందుగా పిల్లలకు నిద్ర లేదని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఎదిగే పిల్లలకు రోజుల తరబడి నిద్ర తక్కువ అయినప్పుడు శరీర పెరుగుదల కూడా మందగిస్తుంది. నిద్ర విషయంలో పెద్ద వారి లాగే పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకంగానే ఉంటారు. నిద్ర తగినంతగా లేని పిల్లల్లో ఎదుగుదల సమస్యలతో పాటు ప్రవర్తనలో కూడా మార్పులు కనబడతాయి.

ఏ ఏ వయస్సు పిల్లలకు ఎంత నిద్ర అవసరం?

Reasons for children not sleeping1

పిల్లల ఎదుగుదలలో తిండి తరువాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, మెదడు వికసించటం రెండూ నిద్రలోనే జరుగుతాయి. కావున ఏఏ వయస్సు లోపు చిన్నారులు ఎంతసేపు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్న విషయాలను చూస్తే.!

  • 4-12 నెలల లోపు ఉండే పసిపిల్లలకు రోజుకు 12 నుంచి 16 గంటలు నిద్ర అవసరం.
  • 12-24 నెలల వయస్సున్న పిల్లలు రోజుకీ 11 నుంచి 14 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది.
  • 3-5 సంవత్సరాల వయసు కల్గిన చిన్నారులకు రోజు 10 నుంచి 13 గంటలు నిద్ర అవసరం.
  • స్కూల్‌కు వెళ్లే 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులకు రోజుకు 9 నుంచి 12 గంటలు అలాగే యుక్త వయస్సున్న 13-18 సంవత్సరాలు గల వారికి ప్రతిరోజు 8 నుంచి 10 గంటల నిద్ర తప్పక అవసరం.

పిల్లల నిద్ర విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నిద్ర తక్కువైతే పిల్లల మనసు నిలకడగా ఉండదు. దీంతో వారు ఏ పని మీదా ధ్యాస పెట్టలేరు. నిద్ర తక్కువైన పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గటం, నిర్ణయాత్మక శక్తి లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  • వయస్సుకు తగ్గట్టు పిల్లల్ని నిద్రపోయేటట్టు అలవాటు చేయాలి.
  • ప్రతిరోజూ పిల్లలు పడుకునే, లేచే సమయంలో సమయపాలనను పాటించేలా చూడాలి.
  • సెలవుల్లో చిన్నారుల నిద్ర వేళలు క్రమం మారకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • పడుకునే గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేమ్‌లు వంటి వస్తువులను ఉంచొద్దు.
  • పిల్లలు పడుకునే అరగంట ముందుగా చదవటం, హోం వర్కు చేయటం వంటి పనులను  నిలిపేయాలి.
  • పిల్లలు తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. సాయంకాలం తరువాత చాకోలేట్లు, కోలా  డ్రింకులు తాగకుండా చూడాలి.

పిల్లలకు నిద్రపట్టకపోవడానికి గల కారణాలు

Reasons for children not sleeping2

పిల్లలకు సరిగ్గా నిద్రపోలేకపోవడానికి గల ప్రధాన కారణాలు:

  • కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు తరచూ ఇళ్లు మారడం మరియు ఇంట్లో సమస్యల వలన చిన్నారులకు నిద్ర పట్టదు.
  • పిల్లలు మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా వినియోగం కూడా ఒక ప్రధాన సమస్యే.
  • కుటుంబంలోని వారు పిల్లలను అతిగా గారాభం చేయడం కూడా పిల్లలకు నిద్రపట్టకపోవడానికి గల కారణాల్లో ఒకటి.
  • హర్రర్‌ కథలు చదవడం, హర్రర్‌ సినిమాలు చూపించడం వంటివి పిల్లలకు చేయకూడదు.
  • పిల్లలు రాత్రుళ్లు సరిగా నిద్ర పోకపోవడానికి అనారోగ్యం కూడా కారణం కావచ్చు కనుక తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.
  • చాలామంది (5 ఏళ్ల లోపు) పిల్లలు పగలు నిద్రపోవడంతో రాత్రి నిద్రపట్టక ఇబ్బందులు పడుతుంటారు.
  • టాన్సిల్‌ సమస్యతో (ముక్కు ద్వారా శ్వాస తీసుకునే బదులు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం) బాధపడుతున్న చిన్నారులు కూడా సరిగా నిద్రపోరు

పిల్లలను త్వరగా నిద్రపుచ్చడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి?

  • వారి వారి వయస్సుకు తగ్గట్లు పిల్లలు నిద్రపోయేటట్లు తల్లిద్రండులు అలవాటు చేయాలి. 
  • పడుకునే మందు రిలాక్స్ కావటాన్ని నేర్పించాలి. అలాగే ‘బెడ్ రొటీన్స్’ అలవాటు చేయాలి.
  • పిల్లలు త్వరగా నిద్రపోవాలంటే ఒకే సమయంలో అందరూ నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
  • రాత్రి భోజనాన్ని పిల్లలు త్వరగా తినేలా చూడాలి. అలాగే రాత్రి సమయంలో పిల్లలకు హెవీ డిన్నర్ వంటివి పెట్టకూడదు.  
  • పిల్లలకు పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం వల్ల త్వరగా నిద్రపోతారు.
  • పిల్లలు నిద్రపోయేటప్పుడు గది పూర్తి చీకటిగా ఉండకుండా నైట్​లైట్లు వినియోగించాలి.
  • ఒకవేళ అదే పనిగా నిద్రపోని పిల్లల్లో పెరుగన్నం, అరటిపండును తినిపిస్తే వారు త్వరగా పడుకునే వీలుంటుంది.
  • పిల్లలను ఎక్కువ సేపు ఆటపాటల్లో పాల్గొనేలా చూడడం వల్ల వారి శరీరం అలిసిపోయి త్వరగా నిద్రపోవడానికి అస్కారం ఉంటుంది.

ఏవరిలోనైనా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి ముఖ్యంగా చిన్నారుల్లో మరియు యుక్తవయస్సున్న వారిలో మానసిక పెరుగుదల, వికాసం రెండు నిద్రతోనే ముడిపడి ఉంటాయి కావున తల్లితండ్రులు పైన తెలిపిన నియమాలను పాటించి వారు తగినంత సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. నిద్ర విషయంలో చిన్నారులు సమయపాలనను పాటించినట్లు అయితే వారిలో ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉండడమే కాక అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.