రేడియోథెరపీ చికిత్స, రకాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

రేడియోథెరపీ చికిత్స, రకాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

రేడియోథెరపీ అంటే ఏమిటి ?

క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన వ్యాధి, ఐతే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్సల ద్వారా క్యాన్సర్ నయం చేయవచ్చు, క్యాన్సర్ నయం చేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి రేడియోథెరపీ. మానవ శరీరంలోని క్యాన్సర్ కణాల డిఎన్ఏను రేడియేషన్ ద్వారా విచ్చిన్నం చేయడానికి అనుసరించే పద్దతిని రేడియోథెరపీ అని అంటారు. ఈ పద్దతిని రేడియేషన్ థెరపీ, ఎక్స్ – రే థెరపీ , రేడియేషన్ ట్రీట్మెంట్ అని కూడా పిలుస్తారు. క్యాన్సర్ చికిత్సలో రేడియోథెరపీ చాలా ముఖ్యమైనది, శరీరంలో క్యాన్సర్ కణాలు, ఆరోగ్యకరమైన కణాలకు విస్తరించకుండా చేయడంలో రేడియోథెరపీ చికిత్స ప్రముఖమైనది.

రేడియోథెరపీ ఎలా పనిచేస్తుంది?

శరీరంలో క్యాన్సర్ సోకిన భాగాన్ని బట్టి ఆ క్యాన్సర్ కణాలను విచ్చిన్నం చేయడానికి రేడియోథెరపీ చికిత్సను ఉపయోగిస్తారు. ఈ చికిత్సలో భాగంగా అత్యధిక శక్తి కలిగిన రేడియేషన్ కిరణాలను శరీరంలో క్యాన్సర్ ఉన్న ప్రాంతం మీద ప్రయోగిస్తారు, వాటి ప్రభావం వలన క్యాన్సర్ డిఎన్ఏ విచ్చిన్నం అవుతుంది. క్యాన్సర్ డిఎన్ఏ కణాలు విచ్చిన్నమైతే అవి కొత్త కణాలను సృష్టించుకోలేవు. ఈ పద్దతిలో క్యాన్సర్ కణాలు తిరిగి సృష్టించుకోలేనంతగా విచ్చిన్నం చేయడం వలన విచ్చిన్నమైన క్యాన్సర్ కణాలు కొంతకాలానికి పూర్తిగా నశిస్తాయి.

రేడియోథెరపీ యొక్క రకాలు

చికిత్స విధానాన్ని బట్టి రేడియోథెరపీ సాధారణంగా రెండు రకాలుగా విభజించారు.

  1. ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ (External Beam Radiotherapy)
  2. ఇంటర్నల్ రేడియోథెరపీ (Internal Radiotherapy)

ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ : ఈ విధానాన్ని బాహ్య రేడియోథెరపీగా వివరించవచ్చు, ఈ విధానంలో శరీరంలో క్యాన్సర్ కణాల తీవ్రతను బట్టి గామా కిరణాలు లేదా ఎక్స్ – రే కిరణాలు లేదా రేడియేషన్ కిరణాల ద్వారా క్యాన్సర్ కణాలను విచ్చిన్నం చేస్తారు. ఉదాహరణకు పేషేంట్ ఛాతీ భాగంలో క్యాన్సర్ ఉంటే ఆ ప్రదేశంలో మాత్రమే అత్యధిక శక్తి కలిగిన రేడియేషన్ కిరణాల ద్వారా క్యాన్సర్ విచ్చిన్నం చేస్తారు, శరీరంలోని మిగతా భాగాలను రేడియేషన్ కిరణాలు తాకవు. రేడియోథెరపీ చికిత్స విధానం ఎలా ఉంటుందో వివరంగా చెప్పాలంటే ముందుగా పేషేంట్ ను ఒక బెడ్ మీద పడుకోబెడతారు, ఆ బెడ్ ను రేడియేషన్ కిరణాలు పంపించే అధునాతనమైన మెషీన్ లోపలికి పంపిస్తారు. ఈ మెషీన్ ను రేడియేషన్ గది బయటనుండి అనుభవజ్ఞులైన డాక్టర్ ఆపరేట్ చేస్తారు. ఒకవేళ మెషీన్ లోపలికి వెళ్లిన తర్వాత, ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే పేషేంట్ కి ముందుగానే అమర్చబడిన మైక్ ద్వారా డాక్టర్ కి తెలియజేయవచ్చు. క్యాన్సర్ లోని అన్ని కణాలను ఒకేసారి విచ్చిన్నం చేయడానికి అవకాశం లేనందున పేషేంట్ కి ఉన్న క్యాన్సర్ ను బట్టి ఎన్ని సెషన్స్ రేడియోథెరపీ నిర్వహించాలని అని డాక్టర్లు నిర్ణయిస్తారు . రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను విచ్చిన్నం చేసిన తర్వాత కొన్ని నెలల్లో అవి పూర్తిగా నశిస్తాయి.

ఇంటర్నల్ రేడియోథెరపీ : ఈ విధానాన్ని అంతర్గత రేడియోథెరపీగా వివరించవచ్చు, దీనిని బ్రాకీథెరపీ అని కూడా అంటారు. ఈ పద్దతిలో శరీరంలో ఉన్న క్యాన్సర్ ను విచ్చిన్నం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఇంప్లాంట్లు (వైర్, సీడ్, క్యాప్స్యూల్ మొదలైనవి) ఉపయోగిస్తారు. శరీరంలో క్యాన్సర్ ఉన్న భాగంలో ఇంప్లాంట్లను అమర్చుతారు, శరీరంలోని కొన్ని భాగాలకు ఇంప్లాంట్లను అమర్చడానికి సర్జరీ చేయవలసిన అవసరం ఉంటుంది. సీడ్ లేదా క్యాప్స్యూల్ లో ఉన్న రేడియేషన్ శక్తి వలన క్యాన్సర్ విచ్చిన్నమవుతుంది. శరీరంలోకి అమర్చిన ఇంప్లాంట్ల రకాన్ని బట్టి పేషేంట్ కొన్ని రోజులపాటు హాస్పిటల్ లోనే ఉండాల్సి వస్తుంది, నిర్ణీత సమయం తర్వాత ఈ ఇంప్లాంట్లను శరీరం నుండి తొలగిస్తారు. పేషేంట్ శరీరంలో అమర్చిన ఇంప్లాంట్లు అత్యధిక రేడియేషన్ కలిగి ఉండడం వలన వారు ఇతరులకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాలలో ఇంప్లాంట్లను శాశ్వతంగా శరీరంలో ఉండేలాగా అమర్చుతారు, ఈ విధానంలో నిర్ణీత సమయం తర్వాత ఆ ఇంప్లాంట్లు వాటి రేడియేషన్ ను కోల్పోతాయి కాబట్టి రేడియేషన్ గురించి పేషేంట్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 మీ శరీరంలో క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయా?

 

Radiotherapy treatment Telugu

 

రేడియోథెరపీకి ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు

రేడియోథెరపీ చికిత్స తీసుకునే పేషేంట్లు ట్రీట్మెంట్ కు హాజరయ్యే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి అనగానే చాలామంది పేషేంట్లు అనవసరమైన ఆందోళన పడుతుంటారు, ప్రస్తుతమున్న అత్యాధునిక పద్దతుల ద్వారా క్యాన్సర్ ను నయం చేయవచ్చని వారు గుర్తుంచుకోవాలి.

క్యాన్సర్ స్పెషలిస్ట్ ( ఆంకాలజిస్ట్) తో మాట్లాడండి : రేడియోథెరపీ ట్రీట్మెంట్ కు హాజరయ్యే ముందు రేడియోథెరపీ ఆంకాలజిస్ట్ తో మాట్లాడండి, పేషేంట్ కు అందించే చికిత్స గురించి, ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకోండి.

అలర్జీలు లేదా ఇతర సమస్యలు ఉంటే తెలియజేయండి: శరీరంలో ఏదైనా అలర్జీలు ఉన్నా క్యాన్సర్ కాకుండా మరేదైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా ఆ వివరాలను ఆంకాలజిస్ట్ కు తెలియజేయడం చాలా ముఖ్యం.

వాడుతున్న మందుల జాబితాను తెలియజేయండి: రేడియోథెరపీ ట్రీట్మెంట్ కు హాజరయ్యే ముందు పేషేంట్ వేరే ఏదైనా అనారోగ్యానికి సంబంధించిన మందులను వాడుతున్నట్లయితే వాటి గురించి ఆంకాలజిస్ట్ కు తప్పనిసరిగా తెలియజేయాలి.

ఆంకాలజిస్ట్ సూచించిన స్కానింగ్ రిపోర్ట్ లను సిద్ధం చేసుకోండి: శరీరంలో క్యాన్సర్ ఏ భాగంలో ఉందని నిర్దారించడం కోసం పేషేంట్ కు  MRI, CT స్కాన్, PET స్కాన్  చేయాల్సి ఉంటుంది, ఈ స్కానింగ్ ల ద్వారా పేషేంట్ శరీరంలో క్యాన్సర్ ఉన్న భాగాన్ని నిర్దారిస్తారు.

మద్యపానం, ధూమపానం చేయకూడదు: అనేక రకాలైన క్యాన్సర్లు రావడానికి మద్యపానం, ధూమపానం కారణమవుతున్నాయి, రేడియోథెరపీ చికిత్స తీసుకునే సమయంలో మద్యపానం లేదా ధూమపానం చేస్తే అవి క్యాన్సర్ ను మరింత పెంచే అవకాశం ఉంది మరియు ఈ అలవాట్లు చికిత్సకు అవరోధంగా మారతాయి. కాబట్టి చికిత్స సమయంలో మరియు చికిత్స తర్వాత కూడా మద్యపానం, ధూమపానం చేయకూడదు.

భయం, ఆందోళన చెందవద్దు: సాధారణంగా క్యాన్సర్ అనగానే అది ప్రాణాంతకమైన వ్యాధి అని, క్యాన్సర్ వస్తే మరణం తప్పదని చాలామంది భయపడుతూ ఉంటారు, అంతేకాకుండా రేడియోథెరపీ చికిత్స నొప్పిగా ఉంటుందని అనుకుంటారు. ఇవన్నీ కేవలం అపోహలే అని ట్రీట్మెంట్ సమయంలో ఎటువంటి నొప్పి ఉండదని పేషేంట్ తెలుసుకోవాలి.

కదలకుండా ఉండడం సాధన చేయండి: రేడియోథెరపీ చికిత్స శరీరంలో క్యాన్సర్ ఉన్న భాగానికి మాత్రమే అందిస్తారు, రేడియోథెరపీ మెషీన్ తో క్యాన్సర్ ఉన్న భాగానికి మాత్రమే అత్యధిక శక్తి కలిగిన కిరణాలను పంపిస్తారు, ఆ కిరణాలు అత్యధిక రేడియేషన్ కలిగి ఉంటాయి కాబట్టి శరీరంలో ఇతర భాగాల్లో తాకితే సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. అందుకని ట్రీట్మెంట్ జరిగే సమయంలో పేషేంట్ కదలకుండా ఉండాలి, దీనికోసం ముందునుండే సాధన చేయడం మంచిది.

రేడియోథెరపీ చికిత్స

అనేక రకాలైన క్యాన్సర్లను నయం చేయడానికి రేడియోథెరపీ చికిత్సను ఉపయోగిస్తారు. బ్రెయిన్ క్యాన్సర్, మెడ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ లను నయం చేయడానికి బ్రాకీథెరపీ ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో రేడియోథెరపీ తో పాటుగా కీమోథెరపీ లేదా ఇమ్మ్యూనోథెరపీ పద్ధతి కూడా అవలంబించాల్సి ఉంటుంది. పేషేంట్ శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను బట్టి రేడియోథెరపీ తో పాటు ఏ థెరపీ అందించాలనే విషయం ఆంకాలజిస్ట్ పేషేంట్ కు వివరిస్తారు. క్యాన్సర్ ప్రారంభ దశలో రేడియోథెరపీ చికిత్సను పేషేంట్లకు అందిస్తారు. రేడియోథెరపీ చికిత్స జరుగుతున్న సమయంలో పేషేంట్లు వారు తీసుకునే ఆహారం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ఈ సమయంలో పేషేంట్లకు అధికంగా ప్రోటీన్ కలిగిన ఆహారం అవసరం. రేడియోథెరపీ చికిత్స పేషేంట్ కు ఉన్న క్యాన్సర్ పరిమాణాన్ని బట్టి వివిధ సెషన్లలో నిర్వహిస్తారు. ఎక్స్టర్నల్ రేడియోథెరపీ విధానంలో ఒక సెషన్ పూర్తయిన తర్వాత పేషేంట్ సాధారణంగా ఇంటికి వెళ్ళవచ్చు, ఇంటర్నల్ రేడియోథెరపీ విధానంలో డాక్టర్ సూచించిన సమయం పాటు హాస్పిటల్ లో ఉండాలి.

అనుభవజ్ఞులైన ఆంకాలజిస్టుల బృందం మరియు అత్యాధునిక సౌకర్యాలతో, యశోద హాస్పిటల్స్ క్యాన్సర్ రోగులకు అత్యున్నత నాణ్యత గల చికిత్సను అందిస్తుంది. క్యానర్స్ చికిత్సలో అత్యున్నత ప్రమాణాలు అందించడంలో యశోద హాస్పిటల్స్ ముందంజలో ఉంది. ఒకవేళ మీరు క్యాన్సర్ లక్షణాలతో బాధ పడుతుంటే క్యాన్సర్ నిర్దారణ మరియు అత్యాధునిక చికిత్స కోసం వెంటనే యశోద హాస్పిటల్స్ ను సంప్రదించండి.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Sandeep Kumar Tula, Consultant Radiation Oncologist

About Author

Dr. Sandeep Kumar Tula | yashoda hospitals

Dr. Sandeep Kumar Tula

MD Radiation Oncology, PGIMER, (National Institutional Ranking Framework-Rank 2)

Consultant Radiation Oncologist