నరాల బలహీనత: లక్షణాలు, కారణాలు, చికిత్స & నివారణ చర్యలు
ప్రస్తుత సమాజంలో అనారోగ్యకరమైన జీవనశైలి మరియు విపరీతమైన పని ఒత్తిడి కారణంగా చాలామంది నరాల సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి ఇవి సహాయపడతాయి. నరాలు మెదడు మరియు వెన్నుపాము నుంచి ఉద్భవించే సన్నటి దారపు లాంటి నిర్మాణాలుగా ఉంటాయి. ఈ నరాల బలహీనత శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. నరాలు బలహీనం కావడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక పోవడంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఎముకలు ఎంత గట్టిగా ఉన్న నరాల్లో శక్తి లేకపోతే వారు ఎటువంటి పనులు చేసుకోలేరు.
ఈ నరాల వ్యాధి వయస్సు, లింగం, జాతి వంటి తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపుతుంది. ఈ నరాల బలహీనత కారణంగా రోజు గడవడం కష్టంగా ఉండడమే కాక ఏ పని చేసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. నరాల బలహీనత అనేది చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఒక అతిపెద్ద సమస్యగా సైతం చెప్పవచ్చు.
నరాల బలహీనతకు గల కారణాలు
నరాల బలహీనత రావడానికి ప్రధాన కారణాలు
విటమిన్లు మరియు పోషకాల లోపం: రాగి, B1, B6, B9, B12, ఫోలిక్ ఆమ్లం మరియు E విటమిన్ లోపాల వల్ల నరాల దెబ్బతినే అవకాశం ఉంటుంది.
డయాబెటిస్: ఇది నరాల బలహీనతకు అత్యంత సాధారణ కారణం
నాడీ సంబంధ వ్యాధులు: పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్ మరియు స్ట్రోక్ వంటి కొన్ని నాడీ సంబంధ వ్యాధులు నాడీ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేయడం ద్వారా కూడా నరాలు బలహీనమవుతాయి
పలు రకాల అంటువ్యాధులు: HIV వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, లైమ్ వ్యాధి వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరియు మూత్రపిండాలు, లివర్ సంబంధ వ్యాధులతో బాధపడే వారిలో కూడా నరాలు దెబ్బతింటాయి
ఆటో ఇమ్యూన్ వ్యాధులు: జోగ్రెన్ సిండ్రోమ్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గ్విలియన్-బారే సిండ్రోమ్, క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ డీమిలినేటింగ్ పాలీన్యూరోపతి మరియు వాస్కులైటిస్ వంటి ఆటో-ఇమ్యూన్ వ్యాధుల బారిన పడిన వారిలో కూడా నరాలు బలహీనమవుతాయి.
వాస్కులర్ డిజార్డర్స్: రక్తనాళాల్లో వాపు, రక్తం గడ్డకట్టడం వంటి రక్తప్రసరణ సమస్యలు కూడా నరాల వ్యాధికి దారితీయవచ్చు
మందులు మరియు టాక్సిన్స్: కొన్ని మందులు (యాంటీబయాటిక్స్, అరిథ్మియా మరియు గౌట్) రసాయనాలకు గురికావడం మరియు శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయినా కూడా నరాలు బలహీనం అయ్యే అవకాశం ఉంటుంది.
ఒత్తిడి: పలు రకాల పనుల వల్ల దైనందిన జీవితంలో చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి శారీరకంగా నరాల పనితీరుపై ప్రభావం చూపడం ద్వారా కుడా చాలా మంది నరాల బలహీనతకు గురవుతుంటారు.
ట్యూమర్స్: ప్రాణాంతక మరియు నిరపాయమైన ట్యూమర్స్ పరిధీయ నాడీ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి, పై లక్షణాలతో పాటుగా:
- న్యూట్రీషన్ లోపం లేదా ధూమపానం మరియు మద్యపానం ఎక్కువగా చేయడం వల్ల కూడా నరాలు దెబ్బతింటాయి.
- హర్మోనల్ సమతుల్యత సరిగా లేకపోవడం & యాక్సిడెంట్ లేదా గాయాలు అయినా ఆ ప్రత్యేకమైన చోట కూడా నరాలు పాడవుతుంటాయి
నరాల బలహీనత యొక్క లక్షణాలు
ముఖ్యంగా నరాలు దెబ్బతిన్నప్పుడు, వాపుకు గురైనప్పుడు మరియు ఒత్తిడికి గురైనప్పుడు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి.
- నరాల నొప్పి & వాపు
- నరాలు తిమ్మిరి
- కండరాల నొప్పి & బలహీనత
- నీరసం మరియు అలసట
- కళ్లు తిరగడం
- కాళ్ళు, చేతులు వణకడం
- జ్ణాపక శక్తి తగ్గడం
- మాట తడబడడం
- అనుభూతి జ్ఞానాన్నికోల్పోవడం
- గుండె వేగం పెరగడం
- చెమట ఎక్కువగా పట్టడం
- పనిపై శ్రద్ధ లేకపోవడం
- తేలికపాటి బరువులను కూడా మోయలేక పోవడం
అంతే కాకుండా నరాలు దెబ్బతింటే B,P ఎక్కువవుతుంది. దీనివలన మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా దరిచేరుతుంటాయి.
నరాల బలహీనత చికిత్స విధానాలు
నరాల బలహీనతకు సంబంధించిన సమస్యలు మరియు చికిత్సలు శరీరంలో నరాలు ఎక్కడ ప్రభావితమయ్యాయి మరియు నరాలలో వచ్చే నొప్పిపై ఆధారపడి ఉంటుంది.
నరాల బలహీనత సమస్యకు మీరు వైద్యులను సంప్రదించగానే అతను ఇంతకు ముందు మీ వైద్య రికార్డులను గమనిస్తాడు మరియు సున్నితత్వం, తిమ్మిరి మరియు కండరాల బలహీనతను తనిఖీ చేయడానికి శారీరక పరీక్ష చేస్తారు. వీటితో పాటుగా:
రక్త పరీక్షలు: నరాల బలహీనత లేదా పక్షవాతం కలిగించే ఇన్ఫెక్షన్లు లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ద్వారా వచ్చే సమస్యలను గుర్తించడంలో రక్త పరీక్షలు సహాయపడతాయి.
ఇమేజింగ్ పరీక్షలు: ఏవైనా కంప్రెస్డ్ నరాలు లేదా పక్షవాతం వల్ల కలిగే ట్యూమర్ పెరగుదల లేదా హెర్నియేటెడ్ వెన్నుపాము గాయాలను గుర్తించడంలో X- ray, MRI మరియు CT స్కాన్‌లు సహాయపడతాయి.
కండరాల బయాప్సీ: కండరాలు మరియు నరాల బలహీనతలను ప్రభావితం చేసే పరిస్థితులను నిర్ధారించడం కోసం కండరాల బయాప్సీ పరీక్షను చేస్తారు.
నరాల ప్రసరణ అధ్యయనం (NCS): శరీరంలోని నరాల గాయం యొక్క ఉనికి మరియు తీవ్రతను గుర్తించడానికి నరాల ప్రసరణ అధ్యయన పరీక్ష సహాయపడుతుంది.
ఎలక్ట్రోమియోగ్రఫీ (EMG): కండరాలు మరియు నరాల యొక్క విద్యుత్ కార్యకలాపాలను కొలవడానికి మరియు కండరాల బలహీనత, ఏ రకమైన కండరాల పక్షవాతం, మెలితిప్పినట్లు, తిమ్మిరి లేదా కండరాల నొప్పులు, కండరాల సమస్య వల్ల బలహీనత లేదా పక్షవాతం వచ్చిందా అని నిర్ధారించడానికి ఈ పరీక్ష చేస్తారు.
లంబార్ పంక్చర్ (స్పైనల్ ట్యాప్): సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ (CSF) నమూనాను సేకరించేందుకు ఒక సూదిని చొప్పించడం కటి పంక్చర్‌లో ఉంటుంది. ఈ పరీక్ష బలహీనత లేదా పక్షవాతం కలిగించే మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్ధారించడంలో సహాయపడుతుంది.
నరాల బలహీనత యొక్క నివారణ చర్యలు
ఆకుపచ్చని కూరగాయలను తీసుకోవడం: వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవడం రక్తనాళాలకు చాలా మంచివి. ఇందులో విటమిన్ బి, సి, ఇ, మెగ్నీషియం, రాగి, ఫోలేట్, కాల్షియం ఆకుపచ్చ కూరగాయలలో కనిపిస్తాయి, ఇవి నరాల బలహీనతను దరిచేరకుండా చేస్తుంది. ఆకుకూరల్లో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు రక్త ప్రసరణను మరింతగా మెరుగుపరుస్తాయి.
పండ్లను ఎక్కువగా తీసుకోవడం: ఆరంజ్, లెమన్, జామ, బెర్రీలు, పీచెస్, చెర్రీస్, ఎర్ర ద్రాక్ష, నారింజ మరియు పుచ్చకాయ వంటి పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కావున ఇవి నరాలు దెబ్బతినకుండ కాపాడడమే కాక నరాల వాపు మరియు నరాల నొప్పిని తగ్గించడంలోనూ సహాయపడుతాయి.
మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం: నరాలు, నాడీ వ్యవస్థ శక్తివంతంగా & ఉత్తేజంగా పని చేయాలంటే మెగ్నీషియం ఉన్న ఆహారాలు (డార్క్ చాకెట్లు, బాదం, జీడిపప్పు, అవకాడో, ఆరటి పండ్లు, పాలకూర, బొప్పాయి అవకాడో, టోఫు, పాలకూర, క్వినోవా) ఎక్కువగా తీసుకోవాలి.
విశ్రాంతి మరియు మంచి నిద్ర: నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఉద్దీపనలు, జ్ఞాపకశక్తి సమస్యలు, నిరాశ మరియు ఒత్తిడి వంటివి పెరిగి నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
- శారీరక శ్రమ మరియు వ్యాయామం చేయడం వల్ల నరాల పనితీరు మెరుగుపడి నరాల బలహీనతకు గురికాకుండా ఉంటాయి.
- నాడీ వ్యవస్థ శక్తిమంతంగా ఉండేందుకు విటమిన్-డి చాలా అవసరం. దీని కోసం ప్రతి రోజూ తగినంత సేపు ఎండలో తప్పనిసరిగా నడవాలి.
- నరాలను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఆహారంలో సోడియం స్థాయిని అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండే చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా నరాలకు బలం చేకూరుతుంది.
- జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉండడమే కాక అధికంగా నూనెతో తయారుచేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.
- వేపుళ్ళు మరియు తీపి పదార్థాలకు, స్వీట్ లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి (ఇవి నరాల ఆరోగ్యానికి మరింత హానిని కలుగజేస్తాయి)
నరాల బలహీనత సమస్యను సరైన సమయంలో గుర్తించి న్యూరాలజిస్ట్ ను సంప్రదించినట్లు అయితే చికిత్సతో మెరుగవుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకుని, సరైన నిద్ర, పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే నరాల బలహీనత సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
About Author –
Dr. Mohan Krishna Narasimha Kumar Jonnalagadda, Consultant Neurologist, Yashoda Hospitals - Hyderabad
MBBS, MD (Internal Medicine), DM (Neurology)