Mpox (మంకీపాక్స్): కారణాలు, లక్షణాలు, చికిత్స & నివారణ

మంకీపాక్స్ అనేది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తున్న వైరస్, మొదటగా ఈ వైరస్ కోతులలో గుర్తించబడింది. మంకీపాక్స్ వైరస్ ముఖ్యంగా మధ్య , పశ్చిమ ఆఫ్రికా ప్రజలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మంకీపాక్స్ ఒక అంటువ్యాధి, ఈ వ్యాధి లక్షణాలున్న వ్యక్తుల ద్వారా భారతదేశంలో కూడా వ్యాప్తి చెందింది. మంకీపాక్స్ ను మొదటి దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే మూడు నుండి నాలుగు వారాల్లో నయం అవుతుంది, ఈ వైరస్ గుర్తించడంలో ఆలస్యం చేస్తే ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కొంతమందిలో చూపు మందగించడానికి కూడా మంకీపాక్స్ కారణమవుతుంది. మంకీపాక్స్ వైరస్ మొదటిగా కోతుల నుండి మనుషులకు వ్యాపించింది, ఆ తర్వాత మనుషుల నుండి మనుషులకు వ్యాప్తిచెందుతూ వచ్చింది. మంకీపాక్స్ సోకినవారికి వ్యాధి లక్షణాలు సాధారణంగా మూడు వారాలలోపు కనిపిస్తాయి. మొదటి నాలుగు రోజుల వరకూ ఈ వైరస్ లక్షణాలు సాధారణమైన జ్వరంలా ఉంటాయి, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స మారుతూ ఉంటుంది.
మంకీపాక్స్ వ్యాపించడానికి గల కారణాలు
మంకీపాక్స్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయి, వీటిని ముందుగానే గుర్తిస్తే మంకీపాక్స్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు.
జంతువుల నుండి: మంకీపాక్స్ లక్షణాలున్న జంతువులు మనుషులను కరవడం, గీకడం, గోర్లతో రక్కడం వంటివి జరిగినప్పుడు కూడా ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్ సోకిన జంతువుల మాంసం తీసుకోవడం మరియు జంతు వ్యర్ధాలను తాకడం వలన మంకీపాక్స్ జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది.
మనుషుల నుండి: మంకీపాక్స్ సోకిన వ్యక్తుల నుండి సాధారణ వ్యక్తులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. మంకీపాక్స్ సోకిన వ్యక్తితో మాట్లాడడం వలన కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. మంకీపాక్స్ సోకిన వ్యక్తితో పాటుగా ఒకే ఇంట్లో ఉండేవారికి కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
లైంగిక చర్యల వలన: మంకీపాక్స్ సోకిన వ్యక్తులను తాకడం, వారితో లైంగికచర్యల్లో పాల్గొనడం వలన ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.
గర్భిణీ స్త్రీల నుండి: ఒకవేళ గర్భిణీ స్త్రీకు మంకీపాక్స్ సోకినట్లయితే ఆమెకు పుట్టిన శిశువుకు కూడా మంకీపాక్స్ వ్యాపిస్తుంది.
ఇతర కారణాలు: మంకీపాక్స్ వైరస్ కలిగి ఉన్న వారు వాడుతున్న దుస్తులను తాకడం వలన వారు భోజనం చేసిన ప్లేట్లలో భోజనం చేయడం వలన కూడా మంకీపాక్స్ వ్యాపిస్తుంది.
మంకీపాక్స్ వైరస్ యొక్క లక్షణాలు
మంకీపాక్స్ వైరస్ లక్షణాలు అనేక విధాలుగా ఉంటాయి, కొంతమందిలో ఈ లక్షణాలు నాలుగు నుండి ఐదు రోజుల్లో కనిపిస్తే మరికొంతమందికి 20 రోజుల సమయం పట్టవచ్చు.
శరీరం మీద దద్దుర్లు: శరీరమంతా దద్దుర్లు వస్తాయి, దద్దుర్ల చుట్టూ శరీరం కందిపోతుంది, ఈ దద్దుర్లు నొప్పితో పాటుగా ఎక్కువ దురదను కలిగిస్తాయి.
జ్వరం: ఈ వైరస్ సోకినవారికి జ్వరం ఎక్కువ రోజులపాటు ఉంటుంది.
గొంతునొప్పి: తీవ్రమైన గొంతునొప్పి, గొంతుమంట ఉంటాయి, ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. వైరస్ తీవ్రతను బట్టి ఒకొక్కసారి ఆహారం తీసుకోవడం కూడా సాధ్యం కాదు.
తలనొప్పి: మంకీపాక్స్ వలన ఎక్కువసేపు తలనొప్పిగా ఉంటుంది.
వెన్నునొప్పి: మంకీపాక్స్ వైరస్ వలన వెన్ను నొప్పి వస్తుంది, ఎక్కువ సమయం కూర్చోవడానికి లేదా పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.
ఒళ్ళు నొప్పులు: మంకీపాక్స్ వైరస్ వలన కాళ్ళు, చేతులు మరియు కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి.
నీరసం: మంకీపాక్స్ వైరస్ సోకినవారు చాలా నీరసంగా మరియు బలహీనంగా అవుతారు.
చూపు మందగించడం: మంకీపాక్స్ వైరస్ వలన కొంతమంది వ్యక్తుల్లో చూపు మందగిస్తుంది.
మంకీపాక్స్ ను నివారించడానికి మార్గాలు
మంకీపాక్స్ సరైన సమయంలో గుర్తించకపోతే అది ప్రాణాంతకమైన వ్యాధిగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి మంకీపాక్స్ సోకకుండా ముందే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
- మంకీపాక్స్ సోకినవారికి దూరంగా ఉండాలి, ఈ వైరస్ సోకినవారిని కానీ, వారి వస్తువులను కానీ తాకకూడదు.
- మంకీపాక్స్ కలిగిన వ్యక్తులతో మాట్లాడాల్సి వస్తే ఇరువురూ మాస్క్ ధరించి దూరం నుండి మాట్లాడాలి.
- ఎట్టిపరిస్థితుల్లోనూ మంకీపాక్స్ కలిగి ఉన్న వ్యక్తులతో లైంగిక చర్యల్లో పాల్గొనకూడదు.
- మంకీపాక్స్ వైరస్ కలిగిన వ్యక్తులు ఉన్న గదిలో ఉండకూడదు.
- వారికి భోజనం అందించవలసి వస్తే ముందు మరియు తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
- మంకీపాక్స్ కలిగిన వ్యక్తులను నయం అయ్యే వరకూ హాస్పిటల్ లో ఉంచాలి.
మంకీపాక్స్ సోకినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మంకీపాక్స్ వైరస్ సోకినవారికి వారి లక్షణాలు మరియు తీవ్రతను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ముందుగా వైరస్ నిర్ధారణ కోసం పరీక్షలు చేపించుకోవాలి. వైరస్ నిర్దారణ ఐతే పేషేంట్ కి ఉన్న లక్షణాలను బట్టి డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. శరీరం మీద ఉన్న దద్దుర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ గీరడం కానీ పగలకొట్టడం కానీ చేయకూడదు. అలా చేస్తే వ్యాధి తీవ్రత ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. పేషేంట్ ప్రత్యేక గదిలో పరిశుభ్రంగా ఉండాలి, ఆహారం తీసుకునే సమయంలో చేతులను సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. దద్దుర్లు నుండి రక్తం లేదా చీము కారుతుంటే వాటిని ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా జాగ్రత్త పడాలి. గాయాల మీద కీటకాలు వాలకుండా చూసుకోవాలి. దద్దుర్లు పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే డాక్టర్ సలహా మేరకు బయటకు వెళ్ళాలి.
మంకీపాక్స్ చికిత్సా విధానం
మంకీపాక్స్ సోకినవారికి జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, గొంతునొప్పి, శరీరం మీద దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. వీటిని నయం చేయడానికి ప్రత్యేకమైన చికిత్స అవసరం.
వ్యాక్సిన్: మంకీపాక్స్ వైరస్ లక్షణాలు కలిగిన వ్యక్తిని కలిసినప్పుడు నాలుగు రోజుల్లోగా వ్యాక్సిన్ తీసుకోవాలి. అప్పుడు మంకీపాక్స్ రాకుండా నివారించవచ్చు.
సెలైన్ :మంకీపాక్స్ వైరస్ ఉన్న పేషేంట్లకు గొంతునొప్పి లేదా గొంతులో పుండ్లు ఏర్పడడం వలన ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది ఐతే వారి సిరల్లోకి సెలైన్ పెట్టాల్సి ఉంటుంది.
జ్వరం తగ్గించడానికి మందులు: మంకీపాక్స్ వైరస్ ఉన్నవారికి తరచుగా జ్వరం వస్తుంది, జ్వరం తీవ్రతను తగ్గించడానికి పారాసిటమాల్ లాంటి మందులను డాక్టర్లు సూచిస్తారు.
విశ్రాంతి : మంకీపాక్స్ వలన పేషేంట్ ఎక్కువగా నీరసానికి గురవుతారు, డీహైడ్రేషన్ అవ్వకుండా తరచూ ORS ద్రావణం, పండ్ల రసాలు తీసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
గాయాలను శుభ్రపరచడం : వైరస్ వలన ఏర్పడిన దద్దుర్ల నుండి కారిన రక్తం లేదా చీమును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
ముగింపు
మంకీపాక్స్ వైరస్ సోకిన పేషేంట్ రోగ నిరోధక శక్తిని బట్టి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ సోకకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా డాక్టర్ ను సంప్రదించాలి. ఎల్లప్పుడూ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ వైరస్ సోకకుండా నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మంకీపాక్స్ వైరస్ సోకినవారికి యశోద హాస్పిటల్స్ చికిత్స అందిస్తుంది, అడ్వాన్స్డ్ డిఎన్ఏ పరీక్షల ద్వారా వ్యాధి నిర్దారణ చేసి పేషేంట్లకు అవసరమైన చికిత్సను అనుభవజ్ఞులైన యశోద డాక్టర్లు అందిస్తారు. పేషేంట్ వ్యక్తిగత లక్షణాలను బట్టి వారికి తగిన చికిత్స ప్రణాళిక రూపొందిస్తారు. ఒకవేళ మీరు మంకీపాక్స్ వైరస్ తో బాధపడుతున్నట్లు ఐతే చికిత్స కోసం యశోద హాస్పిటల్స్ ను సంప్రదించండి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవజ్ఞులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.
FAQ’s
మంకీపాక్స్ వైరస్ ప్రాణాంతకమైనదా?
మంకీపాక్స్ వైరస్ అన్ని సందర్భాలలో ప్రాణాంతకమైనది కాదు. సాధారణంగా మంకీపాక్స్ రెండు నుండి నాలుగు వారాల్లో నయం అవుతుంది. సరైన సమయానికి వైద్యం అందకపోతే మాత్రం మంకీపాక్స్ ప్రాణాంతకంగా మారుతుంది.
పెంపుడు జంతువుల వల్ల మంకీపాక్స్ వ్యాపిస్తుందా?
లేదు, పెంపుడు జంతువుల వల్ల మంకీపాక్స్ వ్యాపించదు. కానీ జంతువులకు మంకీపాక్స్ వైరస్ సోకితే అప్పుడు పెంపుడు జంతువుల నుండి మనకు వైరస్ వ్యాపిస్తుంది.
About Author –
Dr. L. Sudarshan Reddy is a Sr. Consultant Physician at Yashoda Hospitals, Hitec City.