మెనోపాజ్ పరివర్తన, దశలు మరియు లక్షణాలు
రుతువిరతి (మెనోపాజ్) అనేది స్త్రీ జీవితంలో సహజంగా సంభవించే ఒక జీవ ప్రక్రియ. ఇది సాధారణంగా 45-55 సంవత్సరాల వయస్సులో సంభవిస్తుంది. అండాశయ పనితీరు తగ్గడం మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ నెలసరి అనేది ఆగిపోతుంది. ఈ రుతువిరతి అనేది కొన్ని భావోద్వేగ మరియు శారీరక లక్షణాలతో ముడిపడి ఉంటుంది, సహజంగా రాత్రి చెమటలు పట్టడం, మానసిక లక్షణాలు రావడం మరియు యోని పొడిబారడం వంటివి సాధారణంగా ఉత్పన్నమవుతాయి. మహిళలకు నెలసరి ఆగిపోవడం అనేది ఏ వయసులో జరుగుతుంది, అదేవిధంగా ఎలా వస్తుందో తెలుసుకోవడం వంటివి చాలా ముఖ్యం.
రుతువిరతి (మెనోపాజ్) గూర్చి వివరణ
రుతువిరతి (మెనోపాజ్) అంటే పీరియడ్స్ శాశ్వతంగా ఆగిపోవడం. 12 నెలల పాటు రుతుక్రమం, యోని నుండి రక్తస్రావం లేదా స్పాటింగ్ గనుక లేకపోతే ఈ రుతువిరతి (మెనోపాజ్) అనేది నిర్ధారించబడుతుంది. ఇది ఈస్ట్రోజెన్ లోపం వల్ల రుతుక్రమం యొక్క సాధారణ ముగింపు; ఇది సహజంగా 45 నుండి 56 సంవత్సరాల వయస్సులో సంభవిస్తుంది. ఇది రోగ సంబంధితం కాదు మరియు పన్నెండు నెలల అమెన్నోరియా (పీరియడ్స్ లేకపోవడం) ద్వారా ఇది నిర్దారించబడుతుంది. సహజ మెనోపాజ్ సాధారణంగా 51 సంవత్సరాల వయస్సులో సంభవిస్తుంది. మెనోపాజ్ అనేది రక్తనాళముల విస్ఫారముగాని, కుంచనముగాని కలుగజేసే లక్షణాలు మరియు హృదయ సంబంధిత లక్షణాలతో సహా వివిధ అవయవ వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది, అయితే ఈ లక్షణాలు అనేవి సహజ విధమైనవి ఎటువంటి హాని కలుగజేయవు. మెనోపాజ్‌కి హార్మోనల్ మరియు నాన్-హార్మోనల్ చికిత్సా పద్ధతులు ఉన్నాయి; కొన్ని అరుదైన సందర్భాలలో ఈ రుతువిరతి ద్వారా సమస్యలు తలెత్తవచ్చు.
చాలా మంది మహిళలు వారి జీవితంలో దాదాపు 40% కాలాన్ని పోస్ట్ మెనోపాజల్ (రుతువిరతి తదనంతర) సంవత్సరాలలో గడుపుతారు. మెనోపాజ్‌కు సంబంధించిన హార్మోన్ల మార్పుల కారణంగా, మహిళలు తరచుగా అసౌకర్యమైన శారీరక మరియు భావోద్వేగ లక్షణాలను అనుభవించడం జరుగుతుంది. సాధారణంగా, హార్మోన్ల మార్పుల ఆధారంగా మెనోపాజ్ వయస్సు స్త్రీ నుండి స్త్రీకి భిన్నంగా ఉంటుంది. హార్మోన్ థెరపీ, మందులు లేదా జీవనశైలి సర్దుబాట్లతో సహా మెనోపాజ్ లక్షణాలకు సహాయపడే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఎర్లీ మెనోపాజ్ అంటే ఏమిటి?
రుతువిరతి అనేది 40 సంవత్సరాల కంటే ముందు ప్రారంభమైతే, దానిని ఎర్లీ మెనోపాజ్ లేదా ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఇన్సఫిషియెన్సీ అంటారు. ఈ అకాల మెనోపాజ్ యొక్క కారణాలు జన్యుపరమైన రుగ్మతలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మరియు కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ వంటి నిర్దిష్ట వైద్య చికిత్సలు అంతేగాక అండాశయం తొలగింపుతో సహా శస్త్రచికిత్స విధానాలు వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటాయి. అకాల మెనోపాజ్ లక్షణాలలో క్రమరహిత లేదా లేని రుతుక్రమాలు, వంటి నుంచి వేడి రావడం, రాత్రి చెమటలు పట్టడం, యోని పొడిబారడం, మానసిక లాందోళన మరియు నిద్రించడానికి ఇబ్బంది మొదలైనవి ఉన్నాయి.
రుతువిరతి యొక్క దశలు
మెనోపాజ్ అనేది ఒక సహజ జీవ ప్రక్రియ, ఇది స్త్రీ యొక్క పునరుత్పత్తి సంవత్సరాల ముగింపును సూచిస్తుంది మరియు మూడు దశలలో జరుగుతుంది. మెనోపాజ్ యొక్క మూడు దశలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- పెరిమెనోపాజ్: ఇది మెనోపాజ్‌కు ముందు పరివర్తన దశ. ఇది చివరి రుతు ప్రవాహానికి ముందే ప్రారంభమవుతుంది మరియు మెనోపాజ్‌కు కొన్ని సంవత్సరాల ముందుగా వస్తుంది. పెరిమెనోపాజల్ మహిళలు తరచుగా హార్మోన్ల యొక్క హెచ్చుతగ్గుల స్థాయిలను, అలాగే తక్కువ ఈస్ట్రోజెన్ లక్షణాలను కలిగి ఉంటారు, ఇవి క్రమరహిత పీరియడ్స్ (భారీగా, తేలికగా లేదా తరచుగా), వంటిలో నుంచి వేడి సెగలు, రాత్రి చెమటలు అధికం కావడం, మానసిక ఆందోళన మరియు నిద్ర భంగం వంటి సంకేతాలు మరియు లక్షణాలను కలిగి ఉంటుంది .
- మెనోపాజ్: ఇది రుతుక్రమం చివరలో నిర్ధారించబడుతుంది. వరుసగా 12 నెలల పాటు రుతు ప్రవాహం లేనప్పుడు ఇది నిర్ధారించబడుతుంది. ఈస్ట్రోజెన్ తగ్గుతుంది, కాబట్టి లక్షణాలు ప్రారంభం అయి క్రమేపి తీవ్రమవుతాయి.
- పోస్ట్ మెనోపాజ్: ఇది మెనోపాజ్ తర్వాత ఒక సంవత్సరం దశలో ప్రారంభమవుతుంది. ఇది మెనోపాజ్ తర్వాత సమయం, మహిళలు పడిపోతున్న ఈస్ట్రోజెన్ స్థాయిల ప్రభావంలో ఉంటారు. ఈ దశలో కూడా పైన వివరించబడిన లక్షణాలు ఉంటాయి.
రుతువిరతి లక్షణాలు
మెనోపాజ్ సంభవించినప్పుడు శరీరంలోని అండాశయాలు తక్కువ ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి, దీని వలన వివిధ లక్షణాలు వస్తాయి:
క్రమరహిత పీరియడ్స్: పీరియడ్స్ తగ్గిపోవచ్చు, పొడిగించబడవచ్చు, తేలికగా మారవచ్చు లేదా భారీగా మరియు తరచుగా మారవచ్చు.
పీరియడ్స్ దాటవేయబడటం: పీరియడ్స్ వరుసగా కొన్ని నెలలు రాకపోవడమే గాక క్రమేపి ఆగిపోతాయి.
హాట్ ఫ్లాష్‌లు: తీవ్రమైన వేడిని అనుభూతి చెందడం, ఇది ఛాతీ మరియు ముఖానికి చేరుకుంటుంది, అదేవిధంగా చెమటలు పట్టడం, ఎర్రబడటం మరియు గుండె దడ కూడా ఉంటుంది.
రాత్రి చెమటలు: నిద్రలో చెమటలు పట్టడం వల్ల నిద్ర విధానాలను దెబ్బతీస్తుంది.
యోని పొడిబారడం: ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల మెనోపాజ్ సమయంలో యోనిలో తక్కువ కందెనను ప్రేరేపిస్తుంది. ఇది లైంగిక సంపర్క సమయంలో నొప్పిని కలిగిస్తుంది.
మూత్రాన్ని ఆపుకొనలేకపోవడం: పెరిగిన ఫ్రీక్వెన్సీ, అత్యవసరం లేదా అనియంత్రిత మూత్ర లీకేజ్ కూడా.
మానసిక ఆందోళన: పెరిగిన చిరాకు, ఆందోళన మరియు డిప్రెషన్ చాలా సాధారణం.
నిద్ర భంగం: నిద్రపోవడంలో ఇబ్బంది, విశ్రాంతి లేకపోవడం మరియు నిద్రలేమి వంటి వివిధ వ్యక్తీకరణలు.
అభిజ్ఞా బలహీనతలు (కాగ్నిటివ్ మార్పులు): ఏకాగ్రత, జ్ఞాపకశక్తి వైఫల్యాలు మరియు “బ్రెయిన్ ఫాగ్.”
బరువు పెరగడం: జీవక్రియలో మార్పులు మరియు ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గడం అదేవిధంగా శరీర కూర్పులో మార్పుల కారణంగా శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరుగుతారు.
చర్మం మరియు జుట్టులో మార్పులు: పొడి చర్మం, జుట్టు సన్నబడటం లేదా రాలడం మరియు చర్మ ఆకృతిలో మార్పులు.
కీళ్ల మరియు కండరాల నొప్పులు: కీళ్ల మరియు కండరాల నొప్పులు కూడా ఎక్కువ మంది మహిళలకు వస్తాయి.
క్రమరహిత పీరియడ్స్, హాట్ ఫ్లాష్‌లు, రాత్రి చెమటలు మరియు మానసిక ఆందోళన అనేవి 40 సంవత్సరాల వయస్సులో మెనోపాజ్ యొక్క సర్వ సాధారణ సంకేతాలు.
రుతువిరతి కారణాలు
మెనోపాజ్ సహజంగా గాని, శస్త్రచికిత్స ద్వారా గాని లేదా ఈ క్రింద విధంగా వివరించినట్లుగా ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఇన్సఫిషియెన్సీ వంటి ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా సంభవించవచ్చు:
అండాశయ పనితీరులో సహజ క్షీణత: ఇది మెనోపాజ్ యొక్క అత్యంత సాధారణ కారణం. కాలక్రమేణా, అండాశయాలు గుడ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. గుడ్లలో ఈ సహజ తగ్గింపు చివరికి ఈస్ట్రోజెన్ అసమానతలకు దారితీస్తుంది, దీని ఫలితంగా రుతుచక్రాలు లేకపోవడం మరియు చివరికి మెనోపాజ్ రావడం జరుగుతుంది. ఇది సాధారణ వృద్ధాప్యం.
శస్త్రచికిత్స వలన రుతువిరతి: రెండు అండాశయాలను తొలగించడం, దీనిని ద్వైపాక్షిక ఓఫోరెక్టమీ అంటారు, ఇది తరచుగా గర్భాశయం తొలగింపు సమయంలో జరుగుతుంది, తద్వారా తక్షణ మెనోపాజ్‌కు దారితీస్తుంది, ఎందుకంటే అండాశయాలు మానవ శరీరంలో ఈస్ట్రోజెన్ యొక్క అతిపెద్ద మూలం.
ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఇన్సఫిషియెన్సీ (ఎర్లీ మెనోపాజ్): కొంతమంది వ్యక్తులు కొన్ని జన్యుపరమైన పోకడలు మరియు పరిస్థితుల కారణంగా 40 సంవత్సరాల కంటే ముందుగానే అకాల మెనోపాజ్ కలిగి ఉండటానికి అవకాశం ఉంది; దీనికి గల పరిస్థితులు ఏమనగా:
- ఆటో ఇమ్యూన్ వ్యాధులు: ఉదాహరణకు, లూపస్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి పరిస్థితులు రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు, తద్వారా అండాశయాలపై అనుకోకుండా దాడి చేసి, అకాల అండాశయ వైఫల్యానికి దారితీస్తాయి.
- కీమోథెరపీ మరియు రేడియేషన్: ఈ చికిత్సలు తరచుగా క్యాన్సర్‌తో పోరాడటానికి ఉపయోగిస్తారు, ఇవి అండాశయాలను గణనీయంగా దెబ్బతీయడమే గాక వాటి విధులను తగ్గిస్తాయి, ఇది అకాల మెనోపాజ్‌కు దారితీస్తుంది.
- పెల్విక్ సర్జరీ: ఎండోమెట్రియోసిస్ లేదా అండాశయ తిత్తుల కోసం శస్త్రచికిత్సల వంటి కొన్ని శస్త్రచికిత్సలు అండాశయ కణజాలానికి నష్టం కలిగిస్తాయి, తద్వారా అండాశయ వైఫల్యానికి దారితీస్తాయి.
- ధూమపానం: ధూమపానం ఎర్లీ మెనోపాజ్‌తో సానుకూల సంబంధాన్ని కలిగి ఉన్నట్లు కనుగొనబడింది, ఎందుకంటే ధూమపానం అండాశయ పనితీరులో క్షీణతను వేగవంతం చేస్తుంది.
రుతువిరతి సమస్యలు
కొన్ని వైద్య పరిస్థితులు మరియు నిర్దిష్ట ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా మెనోపాజ్ సమయంలో లేదా తర్వాత కొన్ని సమస్యలను అభివృద్ధి చేసే అవకాశాలు ఉండవచ్చు. మెనోపాజ్ యొక్క కొన్ని సాధ్యమయ్యే సమస్యలు:
- ఆస్టియోపొరోసిస్ (బోలు ఎముకల వ్యాధి): ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎముకల ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలలో తగ్గుదల ఈ ఎముక బలహీనపడే వ్యాధిని అభివృద్ధి చేసే సంభావ్యతను బాగా పెంచుతుంది.
హృదయ సంబంధిత వ్యాధులు: ఈస్ట్రోజెన్ గుండెకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది, అంటే మెనోపాజ్ తర్వాత, మహిళలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా కొన్ని సందర్భాలలో ఎక్కువగా ఉంటుంది. - మూత్ర ఆపుకొనలేకపోవడం: ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల కటి కండరాలు బలహీనపడినప్పుడు ఇది చాలా సాధారణంగా వస్తుంది.
- అట్రోఫిక్ వెజైనైటిస్: ఈస్ట్రోజెన్ స్థాయిలో తగ్గుదల వల్ల యోని పొడిబారడం మరియు సన్నబడటానికి దారితీస్తుంది మరియు ఇది సంపర్క సమయంలో అసౌకర్యం మరియు రక్తస్రావంతో పాటు కొన్ని సమస్యలను కలిగిస్తుంది.
- కాగ్నిటివ్ మార్పులు: కొంతమంది మహిళలు మతిమరుపు లేదా ఏకాగ్రత కష్టంగా ఉండటం వంటి కాగ్నిటివ్ మార్పులను అనుభవిస్తారు.
రుతువిరతి నిర్ధారణ
వైద్యులు లేదా గైనకాలజిస్ట్‌లు గత సంవత్సరం రుతుచక్రం మరియు లక్షణాల గురించి చర్చించడం ద్వారా మెనోపాజ్‌ను సహజంగానే నిర్ధారిస్తారు. ఈ మెనోపాజ్ పరిస్థితి ప్రత్యేకమైనది మరియు ఇది సంభవించిన తర్వాత నిర్ధారించబడుతుంది. ఒక వ్యక్తి సంవత్సరం పాటు పీరియడ్ లేకుండా ఉంటే, వారు పోస్ట్ మెనోపాజల్‌గా పరిగణించబడతారు. ఇది కాకుండా, మెనోపాజ్ నిర్ధారణ కోసం లేదా వివిధ సందర్భాలలో హార్మోన్ స్థాయిలను తెలుసుకోవడానికి కొన్ని హార్మోన్-సంబంధిత పరీక్షలు ఉన్నాయి, అవి:
- ఫాలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH) మరియు ఈస్ట్రోజెన్ (ఈస్ట్రాడియోల్): మెనోపాజ్ సమయంలో FSH పెరుగుతుంది మరియు ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ హార్మోన్లు పెరిమెనోపాజ్ సమయంలో హెచ్చుతగ్గులకు లోనవుతాయి; ఒకరు మెనోపాజ్‌లో ఉన్నారా లేదా అని ఈ పరీక్షల నుండి మాత్రమే నిర్దారణకు రాలేము.
- థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH): థైరాయిడ్ యొక్క అధిక పనితీరు, దీనిని హైపర్‌థైరాయిడిజం అని కూడా అంటారు, ఇది మెనోపాజ్‌ను పోలి ఉండే లక్షణాలను కూడా కలిగిస్తుంది.
రుతువిరతికి చికిత్స
మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ మరియు దీనికి చికిత్స అవసరం లేదు. అయినప్పటికీ, చికిత్సలు కొన్ని సందర్భాలలో లక్షణాలను తగ్గించడం మరియు అకాల మెనోపాజ్ వంటి ఆరోగ్య పరిస్థితులను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. మెనోపాజల్ హాట్ ఫ్లాష్‌లు, కాగ్నిటివ్ మార్పులు మరియు యోని పొడిబారడం కోసం చికిత్సలలో హార్మోన్ థెరపీ, యోని ద్వారా ఈస్ట్రోజెన్, యాంటిడిప్రెసెంట్స్ మరియు ఓరల్ ఈస్ట్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేటర్లు ఉన్నాయి. హార్మోన్ థెరపీ చిన్న వయస్సు గల వ్యక్తులకు మరియు మెనోపాజ్ ప్రారంభమైన 10 సంవత్సరాలలోపు వారికి ఉత్తమమైనది. దీర్ఘకాలిక ఉపయోగం ప్రమాదాలను కలిగి ఉండవచ్చు, కానీ మెనోపాజ్ సమయంలో హార్మోన్ థెరపీని ప్రారంభించడం వల్ల కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
మెనోపాజ్ ఒక సహజ జీవ ప్రక్రియ అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ దీనిని భిన్నంగా అనుభవిస్తారనేది వాస్తవం. కింది సందర్భాలలో మీ డాక్టర్ లేదా గైనకాలజిస్ట్‌ను సందర్శించండి:
- లక్షణాలు తీవ్రంగా ఉంటే: వాటిలో అధికమైన వేడి ఉత్పన్నమవడం, రాత్రి చెమటలు, మానసిక ఆందోళనలు మొదలైనవి లేదా ఇతర లక్షణాలు మీ రోజువారీ జీవితం, పని లేదా సంబంధాలలో గణనీయంగా జోక్యం చేసుకుంటే.
- మెనోపాజ్ లక్షణాలు ముందుగా ప్రారంభమైతే: మీరు 40 సంవత్సరాల కంటే ముందు మెనోపాజ్ లక్షణాలను అనుభవిస్తుంటే.
- మెనోపాజ్ తర్వాత యోని నుండి రక్తస్రావం: 12 నెలల పాటు రుతుక్రమం లేకపోతే ఏదైనా యోని నుండి రక్తస్రావం గనుక అయితే వెంటనే వైద్య సహాయం అవసరం.
- దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి ఆందోళనలు: బోలు ఎముకల వ్యాధి మరియు గుండె జబ్బుల వంటి మెనోపాజ్‌తో సంబంధం ఉన్న దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను నిర్వహించడానికి మీ వైద్యుడితో చర్చించడం అవసరం.
ముగింపు
మెనోపాజ్ అనేది స్త్రీ యొక్క జీవితంలో చాలా సహజమైన భాగం, అయినప్పటికీ ఇది అనేక శారీరక మరియు మానసిక మార్పులను ప్రేరేపిస్తుంది. ఈ మార్పుల గురించి తమను తాము విద్యావంతులను చేసుకోవడం మరియు తగిన సంరక్షణను పొందడంతో జీవన నాణ్యతను గణనీయంగా మార్చుకోవచ్చు. నిజానికి, చాలా మంది మహిళలు గణనీయమైన సమస్యలు లేకుండా మెనోపాజ్‌ను కలిగి ఉంటారు; అయినప్పటికీ, బోలు ఎముకల వ్యాధి లేదా గుండె జబ్బుల వంటి సంభావ్య దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కలిగి ఉండటం అనేది నివారణ మరియు సమర్థవంతమైన నిర్వహణకు సహాయపడుతుంది.
యశోద హాస్పిటల్స్ నందు మెనోపాజ్ అనుభవిస్తున్న మహిళలకు నిపుణులైన గైనకాలజిస్స్ట్ల సంరక్షణతో సహా సమగ్ర మహిళల ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది. మా అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్‌ల బృందం వివిధ రుతు ఆరోగ్య సమస్యలు మరియు మహిళల ఆరోగ్యానికి ప్రత్యేకమైన చికిత్సా ఎంపికలను అందిస్తుంది. యశోద హాస్పిటల్స్ నందు మహిళలు మెనోపాజ్ సమస్యను మెరుగ్గా నిర్వహించడానికి మరియు జీవితంలోని ఈ ముఖ్యమైన దశలో సరైన ఆరోగ్యం మరియు శ్రేయస్సును పొందడానికి మీకు మద్దతు ఇస్తుంది.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.