ఊపిరితిత్తుల (లంగ్స్) వ్యాధులు: రకాలు, కారణాలు, లక్షణాలు & నివారణలు
ప్రస్తుతం మారిన జీవనశైలి, పర్యావరణం మరియు ఆహారం సంబంధిత సమస్యల వల్ల చాలా మంది అనేక రకాల ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. మన శరీరంలో ఉండే ప్రతి అవయవం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కఅవయవానికి ప్రత్యేక పనితీరు ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు (లంగ్స్) ప్రధానమైనవి. మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారానే వస్తుంది. ఇవి ఆక్సిజన్‌ను తీసుకురావడం మరియు కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేయడం వంటి ప్రధానమైన పక్రియను నిర్వహిస్తాయి. ఇవి మన శ్వాసకోశ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాతావరణ మార్పు ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు. అంతే కాకుండా వాయు కాలుష్యానికి దీర్ఘకాలం గురికావడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాక శ్వాసలోపం, దగ్గు, గురక, ఆస్తమా మరియు అనేక అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఆరోగ్యకరమైన మనిషి రోజుకు దాదాపు 20 వేల సార్లు ఊపిరి తీసుకుంటాడు. అందుకోసమే ఆరోగ్యంగా ఉండటానికి ఊపిరితిత్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.
1. ఊపిరితిత్తుల వ్యాధుల రకాలు
ఊపిరితిత్తుల వ్యాధి ఊపిరితిత్తులను ప్రభావితం చేసే మరియు శ్వాస తీసుకోవడం కష్టతరం చేసే అనేక రుగ్మతలను సూచిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధుల యొక్క సాధారణ రకాలు:
ఆస్తమా: ఇది చిన్న పిల్లల్లో, పెద్దవారిలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధి. ఆస్తమా సంభవిస్తే మాత్రం ఊపిరితిత్తుల్లో వాపు వల్ల వాయు మార్గాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల శ్వాసకు అడ్డంకులు ఏర్పడి పేషంట్ సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బందిపడతాడు. ఈ వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి. చిన్న పిల్లల్లో పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధి ఉన్నట్లయితే దానిని చైల్డ్‌హుడ్ ఆన్సెట్ ఆస్తమా అంటారు. అదే కొంత మందిలో చిన్నప్పుడు ఆస్తమా లక్షణాలు లేకుండా, 20 సంవత్సరాల పైబడి ఉన్న వారిలో గనుక ఆస్తమా వస్తే దానిని అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అంటారు.
బ్రోన్కైటిస్: బ్రోన్కైటిస్ లో అక్యూట్ బ్రాంకైటిస్ మరియు క్రానిక్ బ్రోన్కైటిస్ అనే రెండు రకాలు ఉన్నాయి.అక్యూట్ బ్రోన్కైటిస్ సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది మరియు దానికదే నయం అవుతుంది. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, శ్వాసనాళంలో శ్లేష్మ పొర ఎర్రబడినప్పుడు సంభవిస్తుంది. దాంతో ఊపిరితీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంది. ఇది 6 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఈ సమస్య ధూమపానం చేసేవారిలో ఎక్కువగ కనిపిస్తుంది.
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD): క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. పొగ లేదా ధూళి మరియు ధూమపానం COPD సమస్యకు అత్యంత సాధారణ కారణాలు అయినప్పటికీ, పర్యావరణ బహిర్గతం మరియు జన్యుపరమైన (అనువంశిక)తో సహా అనేక ఇతర అంశాలు కూడా COPD సమస్యకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. COPD వ్యాధిగ్రస్తుల్లో గాలి పైపు సన్నగా మారుతుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడం మరియు వదలడం లో ఇబ్బంది కలుగుతుంది.
బ్రోన్కియోలిటిస్ మరియు బ్రోన్కియెక్టాసిస్: బ్రోన్కియోలిటిస్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. బ్రోన్కియోలిటిస్ అనేది ఊపిరితిత్తుల చిన్న శ్వాసనాళాలు లోవాపును కలిగించే ఒక ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి సాధారణంగా 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇది దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలకు దారితీస్తుంది.
బ్రోన్కియెక్టాసిస్ ఊపిరితిత్తులలోని వాయుమార్గాలు విస్తరించడానికి మరియు స్థితిస్థాపకతను కోల్పోయేలా చేసే దీర్ఘకాలిక పరిస్థితి. దగ్గు మరియు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. దీర్ఘకాలిక మంట కారణంగా శ్వాసనాళాలు దెబ్బతిని, బ్రోన్కియాక్టసిస్ వస్తుంది.
పల్మనరీ ఫైబ్రోసిస్: పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి.ఇది ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిన్నప్పుడు క్రమంగా ఫైబ్రోటిక్ కణజాలం మందంగా మారి దాని సాధారణ శక్తి మరియు స్థితిస్థాపకతను కోల్పోతుంది. ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిని మరియు గాయాలకు గురైన సందర్భంలో ఈసమస్య తలెత్తుతుంది. పల్మనరీ ఫైబ్రోసిస్ ఉన్న వారిలో ఊపిరితిత్తులలోని కణజాలం గట్టిగా మారడంతో రక్తప్రవాహంలోకి ఆక్సిజన్‌ను గ్రహించడం కష్టతరంగా మారుతుంది.
న్యుమోనియా: న్యుమోనియా అనేది సాధారణంగా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఒకటి లేదా రెండు ఊపిరితిత్తుల వాపు. మనం పీల్చే గాలిలో కనిపించే బ్యాక్టీరియా, వైరస్ లు మరియు ఫంగై వంటి సూక్ష్మజీవుల వల్ల న్యుమోనియా వస్తుంది. న్యుమోనియా జ్వరం మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది, ఇది 2-3 వారాల వరకు ఉంటుంది. న్యుమోనియా సాధారణంగా ఊపిరితిత్తులలోకి సూక్ష్మక్రిములను పీల్చడం ద్వారా ప్రారంభమవుతుంది. బాక్టీరియల్ న్యుమోనియా, వైరల్ న్యుమోనియా, ఫంగల్, న్యుమోనియా మరియు ఇతర రకాలు వంటి వివిధ రకాల న్యుమోనియాలు ఉన్నాయి.
పల్మనరీ ఎడెమా: ఊపిరితిత్తులలో నీటి ద్రవం అధికంగా చేరడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ద్రవం పేరుకుపోవడంతో, ఊపిరితిత్తులు పనిచేయడం కష్టమవుతుంది మరియు శరీరానికి తగినంత ప్రాణవాయువు అందదు. పల్మనరీ ఎడెమా వ్యాధిగ్రస్తుల్లో రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. పల్మనరీ ఎడెమా 2 రకాలు 1. తీవ్రమైన మరియు దీర్ఘకాలిక పల్మనరీ ఎడెమా 2. తీవ్రమైన పల్మనరీ ఎడెమా.
క్షయ (TB) వ్యాధి మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మజీవి (బ్యాక్టీరియా) ద్వారా సంభవించే అంటువ్యాధి. క్షయ వ్యాధి ముఖ్యంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. కానీ, మెదడు, కిడ్నీలు మరియు వెన్నెముక వంటి శరీరంలోని ఇతర భాగాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి (యాక్టివ్ TB) నుంచి గాలిలోకి విడుదలయ్యే సూక్ష్మ చుక్కల ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది.
సార్కోయిడోసిస్: సార్కోయిడోసిస్ అనేది ఒక అరుదైన పరిస్థితి. సార్కోయిడోసిస్ అనేది మీ శరీరంలోని వివిధ భాగాలలో ఇన్ఫ్లమేటరీ కణాల యొక్క చిన్న సేకరణల అభివృద్ధికి దారితీసే వాపుతో కూడిన సమస్య. ఈ ఇన్ఫ్లమేటరీ వ్యాధి ఊపిరితిత్తులు, శోషరస కణుపులు, కళ్ళు మరియు చర్మంతో సహా శరీరంలోని వివిధ భాగాలలో గ్రాన్యులోమాల పెరుగుదల సాధారణంగా సంభవిస్తుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్: పొగతాగడం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ముఖ్య కారకం. సిగరెట్ పొగ కారణంగా చాలా మంది వ్యక్తుల్లో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. క్రమేపి దీనికారణంగా ఊపిరితిత్తులలో క్యాన్సర్ కణితి అభివృద్ధి చెందుతుంది.
2. ఊపిరితిత్తుల వ్యాధులు యొక్క లక్షణాలు
ఊపిరితిత్తుల ఇన్ఫ్‌క్షన్ యొక్క లక్షణాలు ఒక్కొక్క వ్యాధిలో ఒకోలా ఉంటాయి అయితే సాధారణంగా ఊపిరితిత్తుల వ్యాధులో కనిపించే లక్షణాలు:
- దీర్ఘకాలిక దగ్గు
- శ్వాస ఆడకపోవడం
- దీర్ఘకాలిక శ్లేష్మం ఉత్పత్తి
- అలసట
- ఛాతీ నొప్పి
- జ్వరం
- శ్వాసలో గురక
- మైకము లేదా అందోళన
- తీవ్రమైన శారీరక శ్రమ చేయడంలో ఇబ్బంది
- దగ్గినప్పుడు రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
3. ఊపిరితిత్తుల వ్యాధులకు గల కారణాలు
ఊపిరితిత్తుల వ్యాధులకు అనేక కారణాలు కలవు అందులో ప్రధానమైనవి:
- బాక్టీరియల్, వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురికావడం
- వాయు కాలుష్యం మరియు దుమ్ము మరియు పుప్పొడి వంటి అలెర్జీ కారకాల బారిన పడడం
- ధూమపానం లేదా పొగకు వంటి వాటికి బహిర్గతంగా గురి కావడం
- వృత్తిపరంగా రసాయనిక పొగలకు లేదా రాతినార (ఆస్బెస్టాస్) వంటి హానికర విషతుల్య పదార్థాలకు లోను కావడం
- పుట్టుకతో వచ్చే గుండె వ్యాధులు లేదా జన్యు పరివర్తన సంబంధిత సమస్యలతో బాధపడుతుండటం
- వంశపార్యంపరంగా ఊపిరితిత్తులను క్యాన్సర్ కలిగి ఉండడం
- శరీరం యొక్క ఇతర భాగాలలో క్యాన్సర్ ఉండడం
- బలహీన రోగనిరోధక వ్యవస్థ మూలానా కూడా ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.
4. ఊపిరితిత్తుల వ్యాధుల నిర్ధారణ పరీక్షలు
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, స్థితిని గుర్తించడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి వైద్యులు ఈ క్రింది పరీక్షలను నిర్వహించవచ్చు.
ఛాతీ ఎక్స్-రే: ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలు, వాయుమార్గాలు, పక్కటెముకలు, ఉదరవితానము (డయాఫ్రాగమ్) చిత్రాన్ని తీయడానికి ఉపయోగిస్తారు. న్యుమోనియా, ఎంఫిసెమా, COPD వంటి పరిస్థితులను నిర్ధారించడానికి లేదా చికిత్స చేయడానికి ఛాతీ ఎక్స్-రేలు ఉపయోగిస్తారు.
రక్త వాయువు పరీక్ష: రక్తపు pH స్థాయిలను అలాగే ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను కొలుస్తుంది, ఇవి ఊపిరితిత్తుల సామర్థ్యం మరియు ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి ఈ రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.
పూర్తి రక్త గణన (CBC): ఈ పరీక్ష రక్త కణాల పరిస్థితిని అంచనా వేయడానికి మరియు రక్తహీనతను గుర్తించడానికి సహాయపడుతుంది.
ప్లూరల్ ఫ్లూయిడ్ విశ్లేషణ: ఈ పరీక్ష ప్లూరల్ పొరలో (ఛాతీ గోడ మరియు ఊపిరితిత్తుల మధ్య పొర) ద్రవం పేరుకుపోవడానికి గల కారణాలను మరియు ఆ ద్రవం క్యాన్సర్ లేదా ఇన్ఫెక్షన్ నుంచి ఏమైనా వచ్చిందా అని తెలుసుకోవడానికి వీలవుతుంది.
కఫం పరీక్ష: ఊపిరితిత్తుల లోతు నుంచి కఫాన్ని సేకరించి బాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లను పరిశీలించడానికి లేదా గుర్తించడానికి చేయబడే ఈ పరీక్ష చేస్తారు.
పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్::ఈ పరీక్ష ద్వారా మీ ఊపిరితిత్తులు ఎంత బాగా గాలిని పీల్చుకుంటున్నాయి మరియు వదులుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
జన్యు పరీక్షలు: ఈ పరీక్షల్లో అసాధారణ జన్యువులను పరీక్షించడానికి రక్త నమూనాలను తీసుకుంటారు.బ్రోంకోస్కోపీ: బ్రోంకోస్కోపీ అనేది ఊపిరితిత్తులలోని వాయుమార్గాలను పరిశీలించి, వాటిలోని పరిస్థితులను గుర్తించడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగించే వైద్య ప్రక్రియ.
బ్రోంకోస్కోపీ: బ్రోంకోస్కోపీ అనేది ఊపిరితిత్తులలోని వాయుమార్గాలను పరిశీలించి, వాటిలోని పరిస్థితులను గుర్తించడానికి మరియు చికిత్స చేయడానికి ఉపయోగించే వైద్య ప్రక్రియ.
స్పిరోమెట్రీ : ఒక వ్యక్తికి COPD ఉందో లేదో తెలుసుకోవడానికి చేసే అత్యంత ముఖ్యమైన పరీక్షల్లో స్పిరోమెట్రీ కూడా ఒకటి. ఛాతీ ఎక్స్-రే లేదా ఛాతీ CT స్కాన్‌లో కూడా COPD సమస్యను నిర్ధారణ చేయవచ్చు.
5. ఊపిరితిత్తుల వ్యాధుల యొక్క నివారణ చర్యలు
- గాలి మరియు వాయు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ప్రతిసారీ మాస్క్ వంటి వాటిని ధరించాలి.
- వృత్తిలో భాగంగా ప్రమాదకరమైన రసాయనాలు మరియు పరిశ్రమల్లో పనిచేసే వారు అణువులకు బహిర్గతం కాకుండా స్వీయ నియంత్రణ చర్యలను పాటించాలి.
- ధూమపానం ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తుంది కావున అలవాటు ఉన్న వారు వెంటనే ధూమపానం మానేయాలి.
- సెకండ్‌హ్యాండ్ స్మోక్ (ధూమపానం అలవాటు లేకపోయినా, ఆ అలవాటున్న వాళ్లు వదిలే పొగ పీల్చడం) కు సైతం దూరంగా ఉండాలి.
- క్రమం తప్పకుండా సాధారణ యోగా మరియు ప్రాణాయామ (శ్వాస) వ్యాయామాలను సాధన చేయడం
- ఇన్ఫెక్షన్ ల నుంచి వచ్చే సమస్యలను నివారించడానికి సబ్బు లేదా నీటితో తరచుగా మీ చేతులను శుభ్రం చేసుకోవాలి.
- ఫైబర్ అధికంగా ఉండే (పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, కాయధాన్యాలు, గింజలు మరియు విత్తనాలు) ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం
- విటమిన్ సి అధికంగా ఉండే (సిట్రస్ పండ్లు, కివీలు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు మరియు టమోటాలు) వంటి వాటిని తీసుకోవడం
- ఫ్లేవనాయిడ్-రిచ్ ఫుడ్స్ మరియు కెరోటినాయిడ్లు అధికంగా ఉండే ఉండే (క్యారెట్లు, చిలగడదుంపలు, గుమ్మడికాయ, బచ్చలికూర, మొక్కజొన్న మరియు గుడ్లు, బెర్రీలు, యాపిల్స్, ద్రాక్ష, గ్రీన్ టీ, రెడ్ వైన్) వంటి వాటిని తీసుకోవడం.
- ప్రాసెస్ చేసిన మాంసాలను వీలైనంత వరకు పరిమితం చేయడం లేదా నివారించడం వంటివి చేయాలి
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు మద్యం సేవించడం మానుకోవాలి.
- ఊపిరితిత్తుల వ్యాధి మరియు రకాన్ని బట్టి ఛాతీ స్పెషలిస్ట్ (chest specialist) లేదా పల్మోనాలజిస్ట్ చికిత్స చేయడం జరుగుతుంది. ఊపిరితిత్తుల వ్యాధిని నియంత్రించడానికి మరియు నయం చేసుకోవడానికి సరైన సమయంలో సరైన వైద్యున్ని సంప్రదించి క్రమంగా ఎప్పటికప్పుడు వైద్య సంప్రదింపులు, సలహాలు మరియు అనుసరణలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు.