అజీర్తి ఎందువలన వస్తుంది? అజీర్తి లక్షణాలు, దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు, చికిత్స

అజీర్తి అంటే ఏమిటి?
మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకపోవడాన్ని అజీర్తి అంటాం, ఇది చిన్న సమస్యలాగా అనిపించవచ్చు, కానీ అజీర్తి వలన జీవనశైలి చాలా అసౌకర్యంగా మారుతుంది. ఒక్క రోజులో తగ్గే సమస్య కాదు కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ప్రతీరోజూ అజీర్తి వలన బాధ పడుతుంటారు. అజీర్తి సమస్య వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారి మీద ప్రభావం చూపిస్తుంది. సరైన సమయానికి చికిత్స తీసుకోకపోతే దీని వలన మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, డాక్టర్లు సూచించిన మందులను వాడడం ద్వారా అజీర్తి నుండి ఉపశమనం పొందవచ్చు.
అజీర్తి లక్షణాలు ఎలా ఉంటాయి?
చాలామంది ఆహారం జీర్ణం అవ్వకపోవడాన్ని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఈ చిన్న సమస్య వలన అనేక అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంది, అజీర్తి లక్షణాలను ముందే గుర్తిస్తే దాని వలన కలిగే మిగతా అనారోగ్యాలనుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అజీర్తి లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
- కడుపు ఉబ్బరం : అజీర్తి వలన కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది, దీని వలన తేలికపాటి కడుపునొప్పి ఉండవచ్చు. ఐతే దీని వలన రోజువారీ చేసుకునే పనులకు ఆటంకం కలగవచ్చు.
- త్రేన్పులు: అజీర్తి వలన త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి, ఆహారం ఎక్కువగా తీసుకోకపోయినా కూడా త్రేన్పులు వస్తూనే ఉంటాయి.
- కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన : అజీర్తి సమస్య వలన తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకపోగా కొంచెం ఆహారం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది.
- ఛాతీలో మంట : అజీర్తి వలన కడుపులో ఎక్కువగా గ్యాస్ తయారవుతుంది, మరియు కొన్నిసార్లు కడుపులో ఉత్పత్తైన ఆమ్లాలు తిరిగి అన్నవాహికలోకి రావడం వలన ఛాతీలో మంట కలుగుతుంది.
- ఆకలి లేకపోవడం : అజీర్తి సమస్య ఉన్నవారికి ఆకలి మందగిస్తుంది, ఆహారం తీసుకోకపోయినా ఎక్కువసేపు ఆకలి అనిపించదు.
- వాంతులు మరియు వికారం : ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణం అవ్వకపోతే దానివలన వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆహారం జీర్ణం అవ్వకపోవడం వలన రెండు రోజులకంటే ఎక్కువగా వాంతులు అవుతుంటే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి.
- గ్యాస్ : అజీర్తి వలన కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది, ఈ గ్యాస్ ఎక్కువగా త్రేన్పుల రూపంలో కానీ ఆపాన వాయువు రూపంలో కానీ బయటకు వెళ్తుంది. దీని వలన పేషేంట్ ఎక్కువ అసౌకర్యానికి గురవుతారు.
అజీర్తి రావడానికి గల కారణాలు
మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, మన ఆహారపు అలవాట్లతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా అజీర్తికి కారణం అవ్వచ్చు. అజీర్తికి గల కారణాలు ఈ క్రింద వివరంగా తెలుసుకోవచ్చు.
- ఆహారపు అలవాట్లు : అధికంగా మసాలాలు, కారం కలిగిన ఆహారం తీసుకోవడం అజీర్తికి కారణమవుతుంది. మసాలాలు కడుపులో జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అధికంగా పచ్చళ్ళతో తింటే కూడా అజీర్తి సమస్య వచ్చే అవకాశం ఉంది. రోజులో ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం వలన కూడా అజీర్తి సమస్య వస్తుంది.
- ధూమపానం , మద్యపానం : ఈ రెండు అలవాట్లు మనం తిన్న ఆహరం జీర్ణం అవ్వకుండా నిరోధించడానికి కారణం అవుతాయి. ఈ అలవాట్ల వలన జీర్ణాశయం, అన్నవాహిక లోని పొరలు దెబ్బ తినవచ్చు, ఇవి కడుపులో అల్సర్లు మరియు క్యాన్సర్లకు కూడా కారణం కావచ్చు.
- గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్ వ్యాధి (GERD) : గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్ వ్యాధి కలిగి ఉండడం వలన అజీర్తి సమస్య రావచ్చు. ఈ వ్యాధి కారణంగా కడుపులో ఉత్పత్తి అయిన ఆమ్లాలు అన్నవాహికలోకి వెళ్తాయి, ఈ ప్రభావం అజీర్తికి కారణమవుతుంది.
- గ్యాస్ట్రోపరేసిస్ : చిన్న పేగులో ఆహార కదలికలు నెమ్మదించడాన్ని గ్యాస్ట్రోపరేసిస్ అంటారు, ఈ సమస్య ఉన్నవారికి అజీర్తి సమస్య కలిగే అవకాశం ఎక్కువగా ఉంది.
- గాల్ స్టోన్స్ లేదా పిత్తాశయంలో రాళ్ళు : కాలేయం పైన ఉండే పిత్తాశయం మనం తీసుకునే ఆహారంలో కొవ్వును కరిగిస్తుంది, అయితే ఈ ప్రదేశంలో రాళ్ళు ఏర్పడినప్పుడు జీర్ణక్రియ నెమ్మదించి అజీర్తికి కారణమవుతుంది.
- ఆందోళన , ఒత్తిడి ప్రభావం : మానసిక పరిస్థితి వలన శరీరంలో కొన్ని హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ మనం ఆందోళనకు కానీ, ఒత్తిడికి కానీ లోనైతే వాటి ప్రభావం హార్మోన్ల ఉత్పత్తి మీద పడుతుంది. హార్మోన్ల లోపం ఉంటే ఆ ప్రభావం వివిధ అవయవాల పనితీరు మీద పడుతుంది, దానిలో భాగంగానే అజీర్తి సమస్య కూడా ఉత్పన్నమవుతుంది.
అజీర్తి నివారణకు ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలి?
అజీర్తి సమస్య నివారించడానికి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకూడదు: చాలామంది రోజులో ఆహారాన్ని మూడు సార్లు కడుపు నిండే వరకూ తింటుంటారు, ఐతే ఈ పద్ధతి సరైనది కాదు. ఎక్కువ మొత్తంలో తక్కువ సార్లు ఆహారం తీసుకునేకంటే తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. అయితే ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
- కనీస వ్యాయామం : ప్రస్తుత జనరేషన్ వారి ఉద్యోగాల కారణంగా రోజులో ఎక్కువ సమయం కూర్చుని పని చేయాల్సి వస్తుంది, దీని కారణంగా వారి శారీరక శ్రమ తగ్గిపోతుంది. దీని వలన మనం తీసుకున్న ఆహారం జీర్ణమవ్వడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రతీరోజూ కనీస వ్యాయామం లేదా నడక అలవాటు చేసుకోవడం వలన అజీర్తి సమస్యను నివారించవచ్చు.
- మసాలాలు, కారం, నూనె పదార్ధాలను తగ్గించాలి: అజీర్తికి కారణమయ్యే మసాలాలు, అధిక కారం, నూనె పదార్ధాలను తగ్గించాలి. స్ట్రీట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి.
- ఆహారాన్ని ఎక్కువగా నమలాలి : ఆహారాన్ని తినే విధానం కూడా అజీర్తికి కారణమవుతుంది, ఆహారాన్ని నమలకుండా మింగడం వలన ఆహరం జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఆహారాన్ని సరిగా నమిలి మింగడం వలన ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
- ధూమపానం, మద్యపానం మానుకోవాలి: ధూమపానం, మద్యపానం శరీరంలో అనేక రకాలైన అనారోగ్యాలను కలుగజేస్తాయి. ఈ అలవాట్లను మానుకోవడం వలన ఆరోగ్యకరమైన జీవనశైలి పొందడంతో పాటుగా అజీర్తి సమస్యను నివారించవచ్చు.
- భోజనం తినగానే పడుకోకూడదు : రాత్రి సమయంలో భోజనం చేయగానే పడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది, ఇలా చేయడం వలన తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవ్వదు. భోజనానికి, నిద్రకు మధ్య మూడు నుండి నాలుగు గంటల వ్యవధి ఉండాలి. భోజనం పూర్తయ్యాక నడక అజీర్తిని నివారిస్తుంది.
అజీర్తి నయం చేయడానికి ఎటువంటి చికిత్స చేస్తారు?
అజీర్తిని నయం చేయడానికి చికిత్సతో పాటుగా జీవనశైలిలో మార్పులు కూడా అవసరం. అజీర్తి సమస్యకు సరైన సమయంలో చికిత్స చేయకపోతే మరిన్ని తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. పేషేంట్ లక్షణాలను బట్టి అజీర్తి తీవ్రతను బట్టి డాక్టర్లు మందులను సూచిస్తారు.
- యాంటిసిడ్స్ : పేషేంట్, అజీర్తి లక్షణాలను బట్టి అవసరమైన యాంటిసిడ్ మందులను డాక్టర్ సూచిస్తారు. ఈ మందులు కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి. దీని వలన అజీర్తి సమస్య తగ్గుతుంది.
- H2 బ్లాకర్స్ : కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడానికి ఈ మందులను సూచిస్తారు. దీని వలన అజీర్తి సమస్య తగ్గుతుంది.
- ప్రోకినిటిక్స్ : అన్నవాహిక స్పింక్టర్ బలోపేతం చేయడానికి మరియు ఆహారం జీర్ణం అవ్వడానికి ఈ మందులను సూచిస్తారు.
- ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ : ఈ మందులను కూడా కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని తగ్గించడానికి సూచిస్తారు. ముఖ్యంగా పేషేంట్ లో అజీర్తి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు ఈ మందులను సూచిస్తారు.
అజీర్తి తగ్గించడానికి పాటించవలసిన ఆహార నియమాలు
అజీర్తి తగ్గించడానికి మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది.
- పండ్లు, కూరగాయలు : అజీర్తి కలిగిన వారు పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి, దీని వలన శరీరానికి ఫైబర్ పుష్కలంగా అందుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- తగినంత నీరు : శరీరానికి అవసరమైన నీరు అందించకపోతే దాని వలన ఎన్నో సమస్యలు వస్తాయి, అందులో అజీర్తి కూడా ఒకటి. రోజుకి కనీసం 8 గ్లాసుల మంచినీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి.
- కారం మరియు మసాలాలు : అజీర్తికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారమే, అందులో మసాలాలు మరియు కారం ఎక్కువగా ఉంటే అవి అజీర్తికి కారణమవుతాయి, కాబట్టి తినే ఆహారంలో మసాలాలు, కారం స్థాయిలను తగ్గించాలి.
- కాఫీ, టీ మరియు కెఫీన్ కలిగిన పదార్ధాలు: కాఫీ, టీ, పాలు మరియు కెఫీన్ అధికంగా ఉన్న పదార్ధాలు జీర్ణక్రియను మందగించేలా చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు వీటిని తగ్గిస్తే అజీర్తి సమస్యను కూడా తగ్గించవచ్చు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.