i-pill (ఐ-పిల్ టాబ్లెట్): ఉపయోగాలు, దుష్ప్రభావాలు, మోతాదు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐ-పిల్ టాబ్లెట్ అంటే ఏమిటి?
అసురక్షిత సంభోగం లేదా గర్భనిరోధక వైఫల్యం సంభవించినప్పుడు అవాంఛనీయ గర్భధారణను నివారించడానికి ఉపయోగించే అత్యవసర గర్భనిరోధక టాబ్లెట్‌నే ఐ-పిల్ అంటారు. ఈ రోజుల్లో చాలా మంది యువతులు సంభోగం తరువాత గర్భం రాకుండా ముందస్తుగా కొన్ని పద్దతులను అనుసరిస్తున్నారు వాటిలో ఈ ఐ-పిల్ టాబ్లెట్ కూడా ఒకటి. దీనిలో లెవోనోర్‌జెస్ట్రల్ అనే హార్మోన్ ఉంటుంది. ఐ-పిల్‌ను బాధ్యతాయుతంగా తీసుకుంటే సాధారణంగా సురక్షితం కానీ, కొన్ని సందర్బాల్లో మాత్రం వికారం, అలసట మరియు కడుపు తిమ్మిరి వంటి కొన్ని దుష్ప్రభావాలకు సైతం దారితీయవచ్చు.
శృంగారంలో పాల్గొన్న 24-72 గంటల లోపు ఈ ఐ-పిల్ టాబ్లెట్ ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిని ఎట్టి పరిస్దితుల్లోనూ తప్పుగా అబార్షన్-ప్రేరేపిత (గర్భస్రావం ప్రోత్సహించే) టాబ్లెట్ గా భావించకూడదు.
ఐ-పిల్ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు
గర్భనిరోధక వైఫల్యం లేదా అసురక్షిత సంభోగం చేయు సందర్బాల్లో గర్భధారణను నివారించడానికి ఈ ఐ-పిల్ సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ ఐ-పిల్ మీ పునరుత్పత్తి చక్రం ఆధారంగా అండోత్సర్గము ప్రక్రియను వాయిదా వేయడంపై ప్రధానంగా పని చేస్తుంది.
అండాశయం ఇప్పటికే గుడ్డును విడుదల చేసినట్లయితే గుడ్డును శుక్రకణంతో ఫలదీకరణం చేయనీయకుండా నిరోధిస్తుంది. ఇప్పటికే ఫలదీకరణం జరిగి ఉంటే గర్బదారణ అనుబంధ ప్రకియలో పాల్గొని గర్భం రాకుండా నివారిస్తుంది.
ఐ-పిల్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్)
• గర్భనిరోధక మాత్రల యొక్క అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఋతుక్రమ సమయంలో ఊహించని విధంగా యోనిలో రక్తస్రావం అవ్వడం అనేది ఒక ప్రధాన సమస్య.
• మొదటిసారి ఈ ఐ-పిల్ టాబ్లెట్‌ను తీసుకున్నప్పుడు మీకు వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది సాధారణంగా వెంటనే తగ్గిపోతుంది.
• గర్బం దాల్చకుండా ఉండేందుకు తీసుకునే టాబ్లెట్‌లలో ఉండే హార్మోన్లు తలనొప్పి మరియు మైగ్రేన్‌లను ప్రేరేపిస్తాయి.
• ఈ టాబ్లెట్‌లను తీసుకోవడం వల్ల మహిళల్లో పీరియడ్స్ రావచ్చు లేదా కొంతకాలం పాటు రాకపోవచ్చు.
• అలసట, యోని ఉత్సర్గలో మార్పులు మరియు లిబిడో తగ్గడం వంటివి ఇతర దుష్ప్రభావాలు సైతం కనిపిస్తాయి.
పైన తెలియజేయని మరికొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కావున ఈ ఐ-పిల్ టాబ్లెట్ తీసుకున్న తరువాత మీరు అసౌకర్యానికి గానీ మరియు అనారోగ్య లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే ఆలస్యం చేయకుండా వైద్య సలహా మరియు సహాయం కోసం యశోద హాస్పిటల్స్‌లోని మా వైద్య బృందాన్ని సంప్రదించండి.
ఐ-పిల్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు, సమాధానాలు
1. ఎన్ని ఐ-పిల్స్ లు తీసుకోవాలి?
అసురక్షిత సంభోగం లేదా గర్భనిరోధక వైఫల్యం జరిగిన 24-72 గంటల లోపు అయితే గర్భధారణ నివారణకు ఒక ఐ-పిల్ టాబ్లెట్ సరిపోతుంది. 25 ఏళ్ల లోపు లేదా 45 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు ఈ టాబ్లెట్ తీసుకోవడం మానుకోవాలి. ఐ-పిల్ టాబ్లెట్‌ను యువతులు తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అందువల్ల గర్భధారణ అవకాశాలను నివారించడానికి యువతులు ఐ-పిల్ టాబ్లెట్ కాకుండా ఇతర గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించమని వైద్యులు చెబుతారు.
2. ఐ-పిల్ ఎలా పని చేస్తుంది?
ఈ ఐ-పిల్ టాబ్లెట్‌లలో లెవోనోర్‌జెస్ట్రల్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది సహజంగా లభించే స్త్రీ సెక్స్ హార్మోన్ ప్రొజెస్టెరాన్ యొక్క సింథటిక్ వెర్షన్. సాధారణ ఋతు చక్రంలో అండోత్సర్గము అనే పక్రియలో అండాశయాల నుంచి పరిపక్వత చెందిన గుడ్డు విడుదల అవుతుంది. అయితే నోటి ద్వారా తీసుకునే ఈ టాబ్లెట్ అండోత్సర్గ ప్రక్రియను వాయిదా వేయడంతో గర్భనిరోధకంగా పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ అండాశయంలో విడుదలయ్యే గుడ్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడం మరియు ఫలదీకరణాన్ని నిరోధించడం వంటివి చేస్తుంది. అంతే కాకుండా ఫలదీకరణం చేసిన గుడ్డును గర్భాశయంలో అమర్చబడకుండా చేసి గర్భధారణను నిరోధిస్తుంది.
3. ఈ ఐ-పిల్ ను ఎప్పుడు తీసుకోవాలి?
గర్భనిరోధక వైఫల్యం లేదా అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల లోపు (మూడు రోజులు) ఒక ఐ-పిల్ తీసుకుంటే ఉత్తమ ఫలితం పొందవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మీ వైద్యుడి సిఫార్సు మేరకు దీనిని 5 రోజుల వరకు తీసుకోవచ్చు. అయితే మీరు సంభోగంలో పాల్గొన్న అనంతరం ఈ ఐ-పిల్ టాబ్లెట్‌ను ఎంత త్వరగా తీసుకుంటే గర్భం రాకుండా ఉండే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి.
4. గర్భధారణను నివారించడానికి ఐ-పిల్ ఎలా ఉపయోగించాలి?
అసురక్షిత సంభోగ సమయంలో లేదా గర్భనిరోధక వైఫల్యం సంభవించిన 24-72 గంటలలోపు ఒక ఐ-పిల్ తీసుకోవడం గర్భం రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. మీరు ఈ ఐ-పిల్ టాబ్లెట్ తీసుకునే సమయానికి సంభోగంలో పాల్గొని 72 గంటలు గడిచినట్లయితే ఈ టాబ్లెట్ తీసుకునే ముందు ఒక సారి వైద్యుడిని సంప్రదించండి, ఎందుకంటే ఈ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత అది ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు.
5. ఐ-పిల్ పీరియడ్స్ రావడాన్ని ఆలస్యం చేస్తుందా?
అవును. ఈ ఐ-పిల్ టాబ్లెట్ లో వివిధ రకాల హార్మోన్ లు మరియు రసాయనాలు ఉంటాయి కావున ఇవి నేరుగా మీ జీవ వ్యవస్థపై పని చేసి మీ ఋతు చక్రంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. కొందరు స్త్రీలలో తేలికపాటి రక్తస్రావం అవుతుంది. ఈ పిల్స్ ప్రభావం వల్ల మరి కొంతమంది కొంతకాలం వరకు పీరియడ్స్ ను పూర్తిగా కోల్పోవచ్చు.
6. ఐ-పిల్ తీసుకున్న తరువాత రక్తస్రావాన్ని ఎలా ఆపాలి?
గర్భనిరోధక మాత్రలను ఉపయోగించిన మొదటి 3-4 నెలల్లోనే క్రమరహిత ఋతు రక్తస్రావం సాధారణంగా ఆగిపోతుంది. దానిని నివారించడానికి మీరు రోజు క్రమం తప్పకుండా ఒకే సమయానికి ట్లాబెట్ ను తీసుకోవాలి. ఈ సమస్య అలాగే కొనసాగితే మాత్రం మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
7. ఐ-పిల్ శరీరానికి హానికరమా?
గర్భధారణను నివారించడానికి అత్యవసర సమయంలో మాత్రమే ఈ ఐ-పిల్ టాబ్లెట్ ను తీసుకోవడం సురక్షితం. ఇది సాధారణ అబార్షన్-ప్రేరేపిత మందు అని ఎప్పుడూ పొరబడకూడదు. అసురక్షిత సెక్స్ లేదా గర్భనిరోధక వైఫల్యం సంభవించినప్పుడు మాత్రమే మీరు దీనిని తీసుకోవాలి, ఎందుకంటే ఇది వికారం, తలనొప్పి, కడుపు తిమ్మిరి మొదలైన అనేక దుష్ప్రభావాలకు కారణం కావచ్చు.
8. ఐ-పిల్ వేసుకున్న తర్వాత కూడా అమ్మాయి గర్భం దాల్చవచ్చా?
ఈ ఐ-పిల్ టాబ్లెట్ మీరు గర్భవతి అయ్యే అవకాశాలను తగ్గించినప్పటికీ ఇది 100 శాతం ప్రభావవంతంగా ఉండదని గమనించాలి. వారి ఋతు చక్రం యొక్క దశ ప్రారంభమై ఎంత సమయం గడిచింది అనే మొదలైన అంశాలపై గర్భం దాల్చడం ఆధారపడి ఉంటుంది కావున ఐ-పిల్ తీసుకున్న తర్వాత కూడా గర్భం దాల్చవచ్చు. మీ పీరియడ్స్ ఒక వారం కంటే ఎక్కువ ఆలస్యమైతే మాత్రం గర్భధారణ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
9. గర్భం రాకుండా ఉండడానికి ఒక్క పిల్ సరిపోతుందా?
అవును, అసురక్షిత సెక్స్ లేదా గర్భనిరోధక వైఫల్యం తర్వాత 24-72 గంటల గ్రేస్ పీరియడ్ సమయంలో ఒక ఐ-పిల్ టాబ్లెట్ తీసుకున్నా గర్భం రాకుండా నిరోధించుకోవడానికి వీలుంటుంది. అయితే ఈ ఐ-పిల్ టాబ్లెట్ 50-100% మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని గుర్తించుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే తదుపరి సంప్రదింపుల కోసం మీ దగ్గరలోని వైద్యుడిని సంప్రదించండి.
10. ఐ-పిల్ బరువు పెరగడానికి కారణమవుతుందా?
గర్భనిరోధక మాత్రల వల్ల శరీరంలో కొన్ని రకాల ద్రవాలు నిలిచిపోవడం మరియు శరీరంలో నీటి పరిమాణం పెరగడం వల్ల కాస్త బరువు పెరగవచ్చు. అంతే కాకుండా కొవ్వు లేదా కండర ద్రవ్యరాశి పెరగడానికి కూడా ఇది కారణం అవుతుంది. మరోవైపు కొంతమంది మహిళలు ఈ ఐ-పిల్ టాబ్లెట్ తీసుకునేటప్పుడు బరువు కూడా తగ్గుతారు. ఈ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు, ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి నేడే యశోద హాస్పిటల్స్‌లోని మా వైద్య నిపుణులను సంప్రదించగలరు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.