అధిక రక్తపోటు: రకాలు, లక్షణాలు, కారణాలు మరియు నివారణ చర్యలు
ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా అధిక రక్తపోటు (Hypertension) బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది దాదాపు శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. మన శరీర భాగాలకు ఆక్సీజన్‌ను సరఫరా చేసే అతిముఖ్యమైన ద్రావకం రక్తం. గుండె సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది. రక్తపోటు అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి రక్తనాళాలు గట్టిపడిపోవడం వల్ల అధిక రక్తపోటు (హైబీపీ) సంభవిస్తుంది. దీనిని హైపర్‌టెన్షన్ అని పిలుస్తారు. ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉంటే దాన్ని హైపోటెన్షన్ లేదా లోబీపీ అని వ్యవహరిస్తారు. మన గుండె ఎంత కష్టపడి పనిచేస్తుందన్నది రక్తపోటు సూచిస్తుంది. రక్తపోటు అనేది రోగం కాదు.. అది ఒక రోగ లక్షణం. ఈ సమస్యను వైద్యులు సైలెంట్ కిల్లర్ అని కూడా అభివర్ణిస్తు ఉంటారు.
ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు మరియు మెదడులోని రక్తనాళాలు సున్నితత్వాన్ని కోల్పోయి, చిట్లిపోయి బ్రెయిన్ స్ట్రోక్ గురై పక్షవాతం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అంతే కాకుండా అధిక రక్తపోటు వల్ల కిడ్నీలలో ఉన్న రక్తనాళాలు దెబ్బతిని కిడ్నీ ఫెయ్యిలర్ మరియు కళ్ళలో ఉన్న రక్తనాళాలు దెబ్బతిని, కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. దీనిని హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. అంతే కాకుండా ఈ సమస్య కొన్ని సార్లు పురుషులలో లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
అధిక రక్తపోటు యొక్క రకాలు
హైపర్‌టెన్షన్ అనేక రకాలుగా ఉంటుంది అందులో ముఖ్యమైనవి :
1) ఎసెన్షియల్ హైపర్ టెన్షన్: ఈ రకమైన హైపర్‌టెన్షన్‌కు కచ్చితమైన కారణాలు ఉండవు.
2) సెకండరీ హైపర్‌టెన్షన్: వివిధ రకాల కారణాలతో వచ్చే అధిక రక్తపోటును సెకండరీ హైపర్‌టెన్షన్ అని అంటారు.
3) గర్భస్థ రక్తపోటు (Gestational Hypertension): ఇది గర్భిణీ స్త్రీలను మాత్రమే ప్రభావితం చేసే పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రసూతి మరణాలు, పిండం లోపాల వంటి ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ప్రీఎక్లంప్సియా నిర్ధారణతో లేదా లేకుండా కూడా సంభవించవచ్చు.
4) వైట్ కోట్ హైపర్ టెన్షన్ (White Coat Hypertension): దీనినే ఐసోలేటెడ్ క్లినిక్ హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. అంబులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ ఉపయోగించి దీనిని నిర్ధారిస్తారు. పెద్దవారి కంటే యువకుల్లోనే ఈ హైపర్‌టెన్షన్ ప్రమాదం ఎక్కువ.
5) రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ (Resistant Hypertension): ఏదైనా చికిత్స చేసినా పేషంట్ రక్తపోటును నియంత్రించడంలో విఫలమైనప్పుడు దానిని రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అని నిర్ధారిస్తారు. హైబీపీ ఉన్న 10% మంది పేషంట్స్ లలో ఈ రకమైన రక్తపోటు ఉండవచ్చు. హృదయ సంబంధ వ్యాధులు,
అవయవ వైఫల్యం వంటి పరిస్థితుల్లో ఈ రకమైన హైబీపీ ఉంటుంది.
అధిక రక్తపోటు ఏ వయసులో వస్తుంది?
కొందరు ఏ కారణం లేకుండానే హైపర్‌టెన్షన్ బారిప పడుతున్నారు. దీని బారిన పడిన చాల మందికి కారణాలే తెలియడం లేదు. కొందరిలో 20 ఏళ్లు దాటిన వారిలోనూ వంశపారం పర్యంగా కూడా హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశముంది. పరీక్షలు చేస్తేగానీ రక్తపోటు ఉందనేది నిర్దారణ కాదు. మారిన జీవనశైలి, శ్రమ మరియు పని ఒత్తిడి కారణంగా ప్రస్తుతం కొందరికి యుక్త వయస్సులోనే హైపర్‌టెన్షన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. 20నుంచి 30 ఏళ్ల వయస్సు వారిలో 5 శాతం, 30 నుంచి 40ఏళ్ల వారిలో 10 శాతం, 40 నుంచి 50 ఏళ్ల వయస్సు వారిలో 5 శాతం, 50 నుంచి 60 ఏళ్ల వారిలో 15 శాతం మంది హైపెర్టెన్షన్ తో ఇబ్బంది పడుతున్నారు.. ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒక యువతికి ఉండే అవకాశం ఉంది.
అధిక రక్తపోటు యొక్క లక్షణాలు
రక్తపు పోటు ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ రక్తపోటు తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు:
• తలనొప్పి
• విపరీతమైన అలసట
• కళ్ళు తిరగడం
• చూపు మందగించడం
• నిద్రలేమి
• మతిమరుపు
• చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం
• ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
• ఛాతిలో నొప్పి
• గుండె దడ
• గందరగోళం మరియు తికమక పడడం
• మెడనొప్పి
• త్వరగా అలసిపోవడం
• జీర్ణ వ్యవస్థలో సమస్యలు వంటివి కూడా కనిపిస్తాయి.
కొన్ని సార్లు గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, కంటి జబ్బులు, మెదడు సంబంధ రక్త నాళాల జబ్బులు, పక్షవాతం, గుండె రక్తనాళాల జబ్బులు, విపరీతమైన తలనొప్పులు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
అధిక రక్తపోటుకు గల కారణాలు?
అధిక రక్తపోటుకు కారణం రక్తపోటును పెంచడానికి కలిసి పనిచేసే జన్యు మరియు పర్యావరణ (జీవనశైలి) కారకాల వల్ల కావచ్చు. కొన్ని ఇతర అంశాలు:
• అధిక బరువు లేదా ఊబకాయం
• శారీరక శ్రమ లేకపోవడం
• ఉప్పు ఎక్కువగా తీసుకోవడం
• అధికంగా మద్యం సేవించడం
• ధూమపానం
• ఒత్తిడి మరియు అందోళనకు గురికావడం
• అడ్రినల్ మరియు థైరాయిడ్ వ్యాధి రుగ్మతలను కలిగి ఉండడం
• స్లీప్ అప్నియా వంటి సమస్యల ద్వారా రక్తపోటు సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.
అధిక రక్తపోటు వల్ల కలిగే ప్రమాదాలు
• అదుపులో లేని రక్తపోటు వల్ల, రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం (atherosclerosis) పక్ష వాతం, గుండె పోటు లాంటి అత్యవసర పరిస్థితులు కలుగవచ్చు.
• ఎక్కువ కాలం అధిక రక్తపోటుతో ఉండడం వల్ల, గుండె వాపు రావడం దానితో గుండె సరిగ్గా పని చేయక, ఆయాసం వంటి లక్షణాలు రావొచ్చు.
• మూత్ర పిండాలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల దీర్ఘకాలికంగా డయాలసిస్ చేసుకునే అవసరం కలుగవచ్చు.
• అధిక రక్తపోటు వల్ల, కళ్ళ మీద ప్రభావం పడి, చూపు మందగిస్తుంది.
• ఒక్క సారిగా రక్తపోటు చాలా ఎక్కువగా అవ్వడం వల్ల మెదడు సరిగ్గా పని చేయకుండా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.
• అధిక రక్తపోటు వల్ల జ్ఞాపక శక్తి మందగించే అవకాశం కూడా ఉంటుంది.
రక్త పోటు పరీక్ష చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
• రక్త పోటు పరీక్ష చేయించుకునే గంట ముందులో, ధూమపానం లేదా వ్యాయామం చేసి ఉండకూడదు.
• కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నాక పరీక్ష చేయాలి
• పరీక్ష చేసే సమయంలో బీపీ చూసే మెషీన్ ఆ వ్యక్తి గుండె ఎత్తులో ఉండాలి
• ఆ వ్యక్తి పాదాలు పూర్తిగా నేల మీద ఉండాలి
• వెనక ఆసరా ఉండాలి. చెయ్యి ఎక్కడైనా ఆసరాతో పెట్టి ఉండాలి
• బీపీ చూసే సమయంలో కదలకుండా, మాట్లాడకుండా ఉండాలి
అధిక రక్తపోటు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
• జీవితాంతం మందులు వేనుకుంటూనే ఉండాలి
• తరుచు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి
• మందుల వాడకాన్ని ఒకరోజు కూడా నిలిపేయొద్దు
• ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకం మార్చుకోవాలి
• షుగర్ , గుండె , థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి
• కొలస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి
• మద్యపానం , సిగరెట్టను పూర్తిగా మానేయాలి
• మీకు నచ్చని అంశాలపై చర్చ జరుగుతుంటే ఆక్కడి నుంచి తప్పుకోవడం మంచిది.
• కారం, ఉప్పు వాడకం చాలా వరకు తగ్గించాలి
అధిక రక్తపోటు యొక్క నివారణ చర్యలు
• రక్తపోటు సమస్య ఉన్న వారు ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి
• హైబీపీ ఉన్నదని చెప్పగానే అంతగా ఆందోళన పడకుండా శరీరానికి కెలరీలు, క్రొవ్వులు తక్కువగా, ప్రోటీన్లు సాధారణ మోతాదులో ఉండే ఆహారం తీసుకోవాలి. అంతే కాకుండా ముఖ్య పోషకాలైన కాల్షియం, మెగ్నిషియం, పొటాషియంలు రోజు వారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటుగా:
• ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు యోగా, నడకా వంటి సున్నితమైన వ్యాయామాలు చేస్తూ ఉండడం
• ఒత్తిడిని, మానసిక ఆందోళనలను దూరంగా ఉండడం
• ఎల్లప్పుడు కుర్చీలకే అతుక్కుని కూర్చోకుండా (ప్రతి అరగంటకు ఒకసారి నడవాలి.)
• ఆహారంలో ఎక్కువగా కూరగాయలు మరియు పండ్లను (నారింజ, పుట్టగొడుగులు, పాలకూర, కంద గడ్డలు, బ్రొకొలి, అరటి పండ్లు, యాప్రికాట్స్, అవకాడొ, బాదం, పిస్తా
• పప్పు, వాల్‌నట్స్, గుమ్మడికాయ, పొద్దు తిరుగుడు విత్తనాలు) తీసుకోవడం ద్వారా హైబీపీని అదుపులో పెట్టుకోవచ్చు.
• ఉప్పును తగిన మోతాదులో లేదా తీసుకోకపోవడం మంచిది
• మద్యపానం మరియు ధూమపానం వంటి అలవాట్లను, పూర్తిగా మానుకోవడం ఉత్తమం
• ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి ఆహార పదార్ధాల జోలికి వెళ్లకూడదు
• శరీర బరువును అదుపులో ఉంచుకోవడం చాల అవసరం
• టెన్షన్‌కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం మరియు పాటలు వినడం చేయాలి
• అధిక శబ్దాలతో మరియు తీవ్రభయాందోళనలకు, మానసిక కల్లోలాలకు కారణమయ్యే సినిమాలు చూడడం నియత్రించుకోవాలి
• వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. మసాలాలు, కారం వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి
• బ్రెడ్, పాస్తా ,పిజ్జా, బర్గర్,ఫ్రెంచ్‌ఫ్రెస్, జంక్ ఫుడ్ మరియు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్ (కేక్ లు, కుకీలు) తినడం తగ్గించాలి
రక్తపోటు లక్షణాలను ముందుగానే గుర్తించి సరైన సమయంలో వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకున్నట్లైతే, ఈ సమస్య తీవ్రతరం కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే, కొన్ని సార్లు చికిత్సలో నిర్లక్ష్యం వహించినట్లు అయితే దీర్ఘకాలిక, ప్రాణాంతక సమస్యలకు సైతం దారి తీయవచ్చు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.