వినికిడి లోపం: కారణాలు, సంకేతాలు మరియు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సల గురించి వివరణ
ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసే వాటిలో వినికిడి లోపం ఒకటి, ఇది ప్రధానంగా మనిషి యొక్క జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఈ వినికిడి లోపం అనేది క్రమంగా లేదా అకస్మాత్తుగా సంభవించవచ్చు. ఇది మరి ముఖ్యంగా వృద్ధాప్యం, పెద్ద శబ్దాలకు గురికావడం, జన్యుపరమైన పరిస్థితులు లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యల వల్ల సంభవిస్తుంది. నేటి ప్రపంచంలో, వినికిడి చికిత్సలకు సంబంధించిన సాంకేతికతలో పురోగతి అదేవిధంగా వినికిడి లోపాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనేవి మనం చూస్తూ ఉన్నాం.
వినికిడి లోపం అంటే ఏమిటి?
వినికిడి లోపం అనేది వ్యక్తి యొక్క ధ్వనిని గ్రహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే పరిస్థితి. ఇది తేలికపాటి (వినికిడి సమస్య) నుండి తీవ్రమైన దశ (చెవుడు) వరకు ఉంటుంది. ఈ వినికిడి లోపం అనేది ఒకటి లేదా రెండు చెవులను ప్రభావితం చేయవచ్చు. తరచుగా ఈ వినికిడి లోపాన్ని డెసిబెల్స్ (dB)లో కొలుస్తారు, సాధారణంగా ఈ వినికిడి అనేది 0 నుండి 25 dB వరకు ఉంటుంది. డెసిబెల్ స్థాయి పెరిగేకొద్దీ, వినికిడి లోపం మరింత తీవ్రమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా 43 కోట్లకు పైగా ప్రజలు ఈ వినికిడి సమస్య కలిగి ఉన్నారని వారికి తగు పరిష్కారాలు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేసింది. 2050 నాటికి, 700 మిలియన్లకు పైగా ప్రజలు ఈ పరిస్థితిని కలిగి ఉంటారని కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. వినికిడి లోపం ఉన్నవారిలో దాదాపు 80% మంది తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. ఈ వినికిడి లోపం యొక్క ప్రాబల్యం వయస్సుతో పెరుగుతుంది, 60 ఏళ్లు పైబడిన వారిలో 25% కంటే ఎక్కువ మంది ఈ వినికిడి లోపానికి ప్రభావితమవుతారు.
వినికిడి లోపంతో రోజువారీ పనులు సమర్ధవంతంగా చేయలేకపోవడం, వారి మీద వారే చిరాకు పడుతూ తృప్తి చెందని జీవితాన్ని గడపడం వంటివి తరుచూ చూస్తూనే ఉంటాం. అయితే, శ్రవణ శాస్త్రవేత్తలు (ఆడియోలజిస్ట్స్) & ENT వైద్యనిపుణులు, ఈ వినికిడి లోపాన్ని నిర్ధారించడంలో మరియు చికిత్స చేయడంలో ప్రత్యేకత కలిగిన ఆరోగ్య నిపుణులు. వారు ఈ సమస్యని పరిష్కరించే వినికిడి సాధనాలు లేదా కోక్లియర్ ఇంప్లాంట్లు వంటి చికిత్సలను సాధారణంగా ఈ వినికిడి సమస్యలు కలిగిన వ్యక్తులకు సిఫారసు చేయడం జరుగుతుంది.
వినికిడి లోపం యొక్క రకాలు
వినికిడి లోపాలు ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి, అవేవనగా:
- వాహక వినికిడి నష్టం (కండక్టీవ్ హియరింగ్ లాస్): బయటి లేదా మధ్య చెవిలో ధ్వనికి అడ్డంకి ఏర్పడటం.
- సంవేదనాత్మక వినికిడి లోపం (సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్): కాలక్రమేణా లోపలి చెవి దెబ్బతినడం, తరచుగా సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (SSHL)గా సూచిస్తారు, ఇది కొన్ని సార్లు ఆకస్మికంగా కూడా ప్రారంభం అవుతుంది..
- మిశ్రమ వినికిడి లోపం (మిక్స్డ్ హియరింగ్ లాస్): మధ్య లేదా బయటి చెవి మరియు లోపలి చెవిలో సమస్యలు ఈ సంయోగస్థితికి దారితీస్తాయి.
వినికిడి లోపం ఎవరిలో వస్తుంది మరియు ఎందుకు వస్తుంది?
వినికిడి లోపం వయస్సు లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. అయినప్పటికీ, ఈ క్రింద వివరించబడిన కొన్ని అంశాలు వినికిడి లోపాన్ని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి, వాటిలో:
- వయస్సు-సంబంధిత వినికిడి లోపం: వృద్ధాప్యం కారణంగా లోపలి చెవి నిర్మాణాలలో సమస్యలు వచ్చి వినికిడి లోపానికి దారితీయడం జరుగుతుంది. దీనిని సాధారణంగా చెవుడుగా పరిగణిస్తారు.
- శబ్దం-ప్రేరిత వినికిడి నష్టం: అధిక ధ్వనితో కూడిన శబ్ధాలు లోపలికి చేరడంతో చెవి లోని కణాలకు నష్టం జరిగి వినికిడిని దెబ్బతీస్తుంది.
- ఒటోటాక్సిక్ మందులు: కొన్ని చెవి సంబంధిత మందులు పడకపోయినా లేదా విషపూరితం అయినా ఈ సమస్యకు దారితీస్తుంది.
- దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్లు: తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు లేదా తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్లు ఈ వినికిడి లోపానికి దారి తీయవచ్చు.
- జన్యుపరమైన కారకాలు: కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల కూడా ఈ వినికిడి సమస్యలు తలెత్తుతాయి.
- తలకు గాయం: తలపై గాయం చెవి నిర్మాణాలను దెబ్బతీస్తుంది, తద్వారా సమస్యలకు దారితీస్తుంది.
- స్వీయ రోగనిరోధక రుగ్మతలు: ఆటో ఇమ్యూన్ ఇన్నర్ ఇయర్ డిసీజ్ వంటి పరిస్థితులు కొన్ని సందర్భాలలో ఈ వినికిడిని ప్రభావితం చేస్తాయి.
పైన వివరించిన అంశాలే కాకుండా, వినికిడి లోపానికి గల కారణాలు కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి, అవేవనగా:
- చెవిలో గుబిలి (గులిమి) పేరుకుపోవడం
- మధ్య చెవిలో ద్రవం చేరడం
- చెవి లోపల గాయాలు కావడం
- చెవిలో కణితులు ఏర్పడటం
- చెవిలో ఏదైనా వస్తువు ఇరుక్కుపోవడం
- అధిక శబ్దతరంగాలకు బహిర్గతం కావడం
- ధూమపానం చేయడం
- ఓటోస్క్లెరోసిస్ కు గురికావడం
- పుట్టుకతో వచ్చే సమస్యలు మొదలైనవి
వినికిడి లోపం యొక్క లక్షణాలు మరియు సంకేతాలు
వినికిడి లోపం యొక్క లక్షణాలు అనేవి ముఖ్యంగా మనిషిని అదేవిధంగా వారికి ఉన్న సమస్య యొక్క తీవ్రతను బట్టి మారుతూ ఉంటాయి, అందరిలోనూ ఒకే విధంగా ఉండాలని లేదు. వినికిడి లోపం యొక్క కొన్ని సాధారణ లక్షణాలు మరియు సంకేతాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- చెప్పిన దాని గురించి పదే పదే అడగటం
- సంభాషణలను అనుసరించడంలో ఇబ్బంది, ముఖ్యంగా ధ్వనించే వాతావరణంలో
- ఇతరులు గొణుగుతున్నారనే భావన
- గరిష్ట స్థాయి శబ్దాలను వినలేకపోవడం
- పరికరాలలో వచ్చే శబ్దాలు వినలేకపోవడం
- టిన్నిటస్ (చెవిలో మ్రోగుతున్నట్లు అనిపించడం)
- చెవి లోపల ఒత్తిడి లేదా ద్రవం చేరిన అనుభూతి
- చెవిలో నొప్పి లేదా పోటు రావడం
- ఫోన్లో సంభాషణలు అర్ధం కాకపోవడం
- టీవీ లేదా రేడియోలో సౌండును పెంచి వినడం
- పదాలను తప్పుగా అర్థం చేసుకోవడం, ముఖ్యంగా హల్లులు మొదలైనవి
పై లక్షణాలతో పాటుగా కొంతమంది ఒంటరితనం లేదా నిరాశకు లోనయ్యి బయటి వారు ఎమన్నా అనుకుంటారేమో అని సామాజిక పరిస్థితులకు దూరం కావడం జరుగుతుంది.
వినికిడి లోపం యొక్క దశలు
వినికిడి పరీక్షలు సాధారణంగా ENT వైద్యులచే నిర్వహించబడతాయి. వినికిడి లోపం యొక్క దశ అనేది పరీక్షల ద్వారా తెలుపబడే తీవ్రతను బట్టి ఉంటుంది. అమెరికన్ స్పీచ్-లాంగ్వేజ్-హియరింగ్ అసోసియేషన్ వారు ఈ వినికిడి లోపాన్ని సాధారణ, స్వల్ప లేదా తేలికపాటి, మితమైన, మధ్యస్తంగా తీవ్రమైన, తీవ్రమైన మరియు శాశ్వత చెవుడుగా పరిగణించడం జరిగింది.
వినికిడి లోపాన్ని ఏ విధంగా నిర్థారిస్తారు?
వైద్యులు లక్షణాలను అంచనా వేయడానికి లేదా ఇన్ఫెక్షన్ మరియు వినికిడి లోపానికి గల సమస్యలను గుర్తించడానికి ముందుగా శారీరక పరీక్షను నిర్వహిస్తారు. అలా కాకుండా చెవికి ఏదైనా గాయం అయినట్లయితే CT లేదా MRI స్కాన్‌లను సిఫారసు చేయవచ్చు. నిర్దిష్ట పరీక్షల కోసం ఆడియాలజిస్ట్‌కు కూడా కొన్ని సందర్భాలాలు సిఫారసు చేయడం జరుగుతుంది. సాధారణంగా వినికిడి లోపానికి ENT వైద్యులు ఈ క్రింది నిర్దారణ పరీక్షలు సూచించడం జరుగుతుంది:
- ప్యూర్-టోన్ టెస్టింగ్: ఈ పరీక్షలో చెవికి తగిలించి పెట్టుకునే శబ్దగ్రాహక పరికరం (హెడ్ ఫోన్స్) ఉపయోగించి ప్రతి నిర్ణీత శబ్దం వద్ద నిశ్శబ్దతను కనుగోనటం జరుగుతుంది.
- ఒటోకౌస్టిక్ ఎమిషన్స్ టెస్ట్ (OAE): లోపలి చెవి పనితీరును అంచనా వేస్తుంది .
- టిమ్పానోమెట్రీ: ఇది కర్ణభేరి కదలికను పరీక్షిస్తుంది, సాధారణంగా వైద్యులు ఈ పరీక్షను కర్ణభేరి గాయాలను, అదేవిధంగా మధ్య చెవిలో ద్రవం లేదా గుబిలిని గుర్తించడానికి మరియు మధ్య చెవిలోని సున్నిత యెముకలను కూడా పరీక్షించడానికి చేయడం జరుగుతుంది.
- ఆడియోమెట్రీ: ఈ పరీక్ష వివిధ శబ్దాల వద్ద మీ వినికిడి సున్నితత్వాన్ని కొలుస్తుంది. ఇది సాధారణంగా సూచించే పరీక్ష.
- ఆడిటరీ బ్రెయిన్‌స్టెమ్ రెస్పాన్స్ (ABR): ఈ పరీక్ష ధ్వనికి మెదడు యొక్క ప్రతిస్పందనను కొలుస్తుంది.
ఈ పరీక్షలు వినికిడి లోపం యొక్క రకాన్ని మరియు తీవ్రతను గుర్తించడంలో సహాయపడతాయి, అలాగే సరైన చికిత్సా ఎంపికలను నిర్ణయించడంలో సహాయపడతాయి.
వినికిడి లోపానికి చికిత్స ఎంపికలు
వినికిడి లోపానికి చికిత్స అనేది అంతర్లీన కారణం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. చికిత్స ఎంపికలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. వినికిడి నష్టానికి కొన్ని సాధారణ చికిత్స ఎంపికలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- మందులు: చెవి ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ మందులు, అదేవిధంగా చెవి యొక్క కణితిలలో వాపును తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్స్ వంటి మందులు సూచిస్తారు.
- వినికిడి సహాయక చికిత్స పద్ధతులు: వినికిడి లోపానికి ఆధునిక వినికిడి పరికరాలు మరియు కోక్లియర్ ఇంప్లాంట్లు వంటివి చెవిలో అమర్చడం జరుగుతుంది.
- సర్జరీ: చెవి యొక్క గాయాలను లేదా పగిలిన కర్ణభేరిని సరిచేయడానికి టిమ్పానోప్లాస్టీ వంటి శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది, చెవిలో గొట్టాలను చొప్పించడానికి లేదా కణితులను తొలగించడానికి టిమ్పానోస్టోమీ శస్త్రచికిత్స సూచించడం జరుగుతుంది.
సాంకేతికతలో పురోగతులు రావడంతో వినికిడి లోపానికి ఆధునిక చికిత్స ఎంపికలు కనుగొనబడ్డాయి. వీటిలో కోక్లియర్ ఇంప్లాంట్లు, బోన్-ఎంకర్డ్ వంటి వినికిడి పరికరాలు (BAHA) మరియు మధ్య చెవి భాగంలో ఇంప్లాంట్లు ఉన్నాయి. ఈ పరికరాలు శ్రవణ నాడిని ప్రేరేపిస్తాయి, దెబ్బతిన్న చెవి భాగాలను దాటవేసి తీవ్రమైన వినికిడి లోపం, వాహక వినికిడి లోపం లేదా ఒక-వైపు చెవుడు ఉన్న వ్యక్తులకు వినపడేలా సహకరిస్తాయి.
యశోద హాస్పిటల్స్ సమగ్ర వినికిడి సంరక్షణ సేవలను అందిస్తోంది. మా అనుభవజ్ఞులైన ఆడియోలజిస్ట్‌లు మరియు ENT నిపుణులు వినికిడి లోపంతో సహా వివిధ వినికిడి రుగ్మతలకు అధునాతన రోగ నిర్ధారణ మరియు చికిత్సను అందిస్తారు. వినికిడి లోపాన్ని అంచనా వేయడానికి మరియు వినికిడి పరికరాలు అదేవిధంగా ఇతర సహాయక పరికరాలతో కూడిన వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళికలను మీకు అందించడానికి మేము అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి చికిత్స చేయడం జరుగుతుంది.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262676 కి కాల్ చేయగలరు.
About Author –