ఫుడ్ పాయిజనింగ్: లక్షణాలు, కారణాలు మరియు నివారణ పద్ధతులు

మనిషి జీవించటానికి ఆహారం తీసుకోవటం తప్పనిసరి. అయితే ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రం సరైన మోతాదులో సమతుల్య ఆహారం తీసుకోవాలి. మనిషి శరీరానికి ఇంధనం ఆహారం, ఆ ఆహారమే కలుషితమైతే శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ప్రస్తుతం మారిన జీవనశైలి, పర్యావరణం మరియు ఆహారం సంబంధిత సమస్యల వల్ల చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ సమస్య బారిన పడుతున్నారు. వీకెండ్ వస్తే సరదాగా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లడం, ఇంట్లో భోజనంపై ఆసక్తి తగ్గి హోటల్ భోజనం వైపు మళ్లడం లాంటివి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. కారణం ఏదైనా ఇంట్లో వండిన రుచి, శుచి కలిగిన ఆహారాలను కాదని చాలామంది బయట ఆహారాలకు అలవాటు పడుతున్నారు. అయితే బయట వండే ఆహారాలు శుభ్రంగా లేకపోవడం, నీరు కలుషితం అవ్వడం, వండే ఆహారాలు సరిగ్గా లేకపోవడం లాంటి కారణాల వల్ల ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్నారు.
సాధారణంగా ఎక్కువగా నిల్వ ఉన్న, కలుషితయైన మరియు అపరిశుభ్రతమైన ఆహారం తీసుకున్నప్పుడు ఫుడ్ పాయిజన్ సమస్య ఎదురవుతుంది. శుభ్రంగా లేని ఫుడ్‌ని తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల మొదట దెబ్బతినేది జీర్ణ వ్యవస్థ ఆ తరువాత కలుషిత తీవ్రతను బట్టి మిగతా శరీర వ్యవస్థలు సైతం దెబ్బతింటాయి. మనం తీసుకునే ఆహారం, పానీయాలు శరీరానికి పడనివి అయినప్పుడు, అవి కలుషితమైనవి అయినప్పుడు, అందులో విషపూరిత రసాయనాలు కలిగి ఉన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఈ సమస్య చిన్న పిల్లల్లో మరియు గర్భవతుల్లో, వయస్సు పై బడిన వారిలో, డయాబెటిక్ పేషెంట్లు, క్యాన్సర్ రోగుల్లో అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో మరింత ఎక్కువగా ఉండి తరువాత పెరిగే అవకాశం ఉంటుంది.
ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు
హోటల్ లేదా బయట మరేదైనా ప్రదేశాల్లో వండిన ఆహారాలు కలుషితం అయినప్పుడు అవి తిన్న వారికి సాధారణంగా వాంతులు, విరేచనాలు ప్రధానంగా కనిపించే లక్షణాలు. వీటితో పాటుగా:
• పొట్ట ఉబ్బరంగా అనిపించడం
• కడుపులో తేపినట్లు ఉండడం
• పొత్తి కడుపులో నొప్పి & మంట
• వికారం
• నీరసం & అలసట
• తలనొప్పి
• జ్వరం
• అతిసారం
• నీళ్ల విరేచనాలు
• మలంలో రక్తం పడడం మరియు కొన్ని సార్లు అపస్మారక స్థితిలోకి వెళ్లడం లాంటి లక్షణాలు కూడా ఉండవచ్చు.
ఇన్ఫ్‌క్షన్ కు కారణమయ్యే కారణాలను బట్టి ఈ లక్షణాలు బయటపడాతాయి. ఈ లక్షణాలు బయటపడేందుకు 30 నిమిషాల నుంచి 8 వారాల సమయం పట్టవచ్చు.
ఫుడ్ పాయిజన్ కు గల కారణాలు
ఫుడ్ పాయిజనింగ్‌కు చాలా కారణాలు ఉండవచ్చు అయితే వాటిలో ప్రధానమైనవి:
• బాక్టీరియా, వైరస్లు: సాల్మోనెల్లా, ఇ.కోలి వంటి బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు సాధారణ కారణాలు. వీటితో పాటు నోరోవైరస్ ,హెపటైటిస్ రోటా వంటి వైరస్‌లు కూడా ఆహారాన్ని కలుషితం చేస్తాయి.
• సరికాని ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని నిల్వ చేయడం: ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోతే, బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. రిఫ్రిజిరేటర్‌లో ఉంచని వండిన ఆహారంలో బ్యాక్టీరియా ఉండవచ్చు.
• అపరిశుభ్రత: మురికి చేతులు, మురికి పాత్రలు ఉపయోగించడం లేదా వంట గది పరిసర పాంత్రం (కిచెన్ ప్లాట్‌ఫామ్) అపరిశుభ్రంగా ఉండడం మరియు ఆహారాన్ని వండేటప్పుడు, వడ్డించేటప్పుడు శుభ్రమైన నీటిని ఉపయోగించకపోవడం కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం
• సరిగ్గా ఉడకని ఆహారం: పచ్చి మాంసం, పచ్చి చేపలు (సుషీ) లేదా ఉడకని గుడ్లు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది.
• గడువు ముగిసిన ఆహారం: ముఖ్యంగా పుడ్ పాయిజన్ గడువు ముగిసిన లేదా ఇప్పటికే కలుషితమైన పదార్థాలను ఉపయోగించడం వల్ల ఆహారం విషపూరితం అవుతుంది.
• నీరు కలుషితమవ్వడం: కలుషితమైన నీరు తీసుకోవడం ఫుడ్ పాయిజనింగ్ గల ముఖ్యమైన కారణాలలో ఒకటి. మంచి నీటితో మురికి నీళ్లు కలవడం వల్ల కానీ, నీరు సరిగ్గా శుద్ది చేయనప్పుడు కానీ ఈ విధంగా జరుగుతుంది.
• తాజా ఆకుకూరలు మరియు కూరగాయలను కడగకుండా తీసుకోవడం వల్ల కూడా ఒకొక్క సారి పుడ్ పాయిజన్ అవ్వవచ్చు..
• పాయిశ్చరేజ్ చేయని పచ్చిపాలు మరియు వాటితో చేసే పదార్ధాల వల్ల కూడా పుడ్ పాయిజనింగ్ కావొచ్చు
• రిఫ్రిజిరేటర్‌లో ఎక్కవ కాలం నిల్వ ఉన్న ఆహారాలు తీసుకోవడం
ఫుడ్ పాయిజన్ అయినప్పుడు తీసుకోవాల్సిన & నివారించాల్సిన ఆహారాలు
• ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలతో శరీరం సాధారణ స్థాయికీ తిరిగి రాగలదు.
• నీరు, ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే ద్రవాలును తీసుకోవడం వల్ల శరీరానికి హైడ్రేటెడ్‌గా ఉంచడానికి మరియు కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేయడానికి సహాయపడతాయి.
• ప్రోబయోటిక్ అధికంగా ఉండే పెరుగును ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పునరుద్ధరించవచ్చు.
• ఉడికించిన కూరగాయలు పచ్చి వాటితో పోలిస్తే సులభంగా జీర్ణమవడమే కాక జీర్ణవ్యవస్థకు ఇబ్బంది లేకుండా అవసరమైన పోషకాలను అందిస్తాయి కావున వాటిని ఎక్కువగా తీసుకోవాలి
• పుచ్చకాయ, దోసకాయ వంటి సున్నితమైన పండ్లు జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించకుండా హైడ్రేషన్, విటమిన్లను అందిస్తాయి కావున వీటిని తీసుకుంటూ ఉండాలి
• ఏదైనా పచ్చి లేదా తక్కువగా వండిన ఆహారాలను నివారించండి, ఎందుకంటే అవి ఆహార విష లక్షణాలను మరింత తీవ్రతరం చేసే హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి.
• డైరీ ఉత్పత్తులను తాత్కాలికంగా నివారించండి ఎందుకంటే అవి జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి.
• కారంగా ఉండే మసాలా ఆహారాలు జీర్ణవ్యవస్థను చికాకు పెట్టగలవు. అంతే కాకుండా వికారం లేదా అతిసారం వంటి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి
• కెఫీన్, ఆల్కహాల్ వంటివి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరుకు ఆటంకం కలిగి అతిసారం, వికారం వంటి లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి.
• చక్కెర కలిగిన ఆహారాలు విరేచనాలను మరింత తీవ్రతరం చేస్తాయి.కావున బేకరీ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి
• కార్బోనేటేడ్ పానీయాలు గ్యాస్, ఉబ్బరానికి దోహదం చేస్తాయి, ఫుడ్ పాయిజనింగ్ వల్ల కలిగే అసౌకర్యాన్ని పెంచుతుంది.
ఫుడ్ పాయిజనింగ్ యొక్క నివారణ చర్యలు
• చేతులను శుభ్రం చేసుకోవడం : ఫుడ్ పాయిజనింగ్ మాత్రమే కాదు ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం చాల అవసరం. ముఖ్యంగా ఏదైనా ఆహారం వండే ముందు, తినే ముందు అలాగే పచ్చి మాంసం, గుడ్లు మొదలైన వాటిని తాకిన తర్వాత చేతులు కడుక్కోవడం కూడా తప్పనిసరి.
• చేతి, డిష్ టవల్స్ శుభ్రంగా ఉంచుకోవడం : చాలా మంది చేతి, డిష్ టవల్స్ క్లీన్ చేయకుండా ఎక్కువ రోజులు వాటిని యూజ్ చేస్తుంటారు. అది కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. కాబట్టి తరచుగా వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి
• కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రం చేయడం : చాలా మంది వంట గది శుభ్రం చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. అలాకాకుండా ఆహార పదార్థాలను వండే ముందు, తర్వాత కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రం చేసుకోవాలి. నాన్‌వెజ్ వంటకాలు వండుతున్నప్పుడు ఇది చాలా ముఖ్యం. అలాగే వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
• మాంసాన్ని సరిగ్గా ఉడికించడం : ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏ వంటకమైనా సరిగ్గా ఉడికిన తర్వాత తినడం చాలా అవసరం. ముఖ్యంగా మాంసాహారాలు చేసినప్పుడు అది పూర్తిగా ఉడికిందని నిర్ధారించుకున్నాకే వాటిని ఆహారంగా తీసుకోవడం మంచిది.
• రిఫ్రిజిరేటర్‌ను 5ºC (41ºF) కంటే తక్కువగా ఉంచండి : ఫ్రిజ్ లోని ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తున్నారో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, మీ రిఫ్రిజిరేటర్‌ను ఓవర్‌లోడ్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది గాలి ప్రవాహం లేకపోవడం వల్ల మొత్తం ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. అలాగే ఫ్రిజ్‌లో మాంసాహారాన్ని స్టోర్ చేసేటప్పుడు దిగువ షెల్ఫ్‌లో నిల్వ చేయడం, మిగతా వాటితో కలపకుండా వాటిని వేరుగా నిల్వ చేయడం మంచిది
• గడువు తేదీలు తనిఖీ చేయడం: చాలా మంది చేసే పొరపాటు ఆహార పదార్థాల గడువు తేదీ చెక్ చేయకుండా బాగానే ఉందని తినేస్తుంటారు. కానీ, అది తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు లేదా పాల ఉత్పత్తులకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి
• పండ్లు, కూరగాయలను బాగా కడగాలి : బయట మార్కెట్ నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చినప్పుడు తప్పనిసరిగా వాటిని బాగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి, ఎందుకంటే అవి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి.
• ఇవే కాదు ఆహారం వండే పాత్రలు, గరిటెలు శుభ్రంగా కడగకపోయినా అందులోని ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఆహారం వండి వార్చే క్రమంలో సరైన పరిశుభ్రతా ప్రమాణాల్ని పాటించకపోయినా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది.
• బయటి ఆహారాన్ని జాగ్రత్తగా తినండి బయట తినడానికి ఎంచుకున్నప్పుడు పరిశుభ్రతను గుర్తుంచుకోండి. అక్కడ పరిశుభ్రత కనిపించకపోతే స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోండి.
పైన తెలియజేసిన జాగ్రత్తలను మరియు నివారణ చర్యలను పాటిస్తూ.. బయటి ఆహారాలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండడం వల్ల ఈ ఫుడ్ పాయిజనింగ్ సమస్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
About Author –
Dr. M. Ramakrishna is a Senior Consultant Physician at Yashoda Hospitals, Hyderabad