ఎండోక్రైన్ రుగ్మతలు: కారణాలు, నిర్దారణ, లక్షణాలు, చికిత్స, పూర్తి వివరాలు

ఎండోక్రైన్ రుగ్మతలు: కారణాలు, నిర్దారణ, లక్షణాలు, చికిత్స, పూర్తి వివరాలు

ఎండోక్రైన్ రుగ్మతలు అంటే ఏమిటి?

మానవ శరీరంలో హార్మోన్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజువారీ జీవితంలో శరీరానికి అవసరమైన చర్యలు అంటే ఆకలి, నిద్ర, దాహం మొదలైన వాటిని హార్మోన్లు ప్రేరేపిస్తాయి. ఇంత ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి శరీరంలో కొన్ని గ్రంథులు ఉంటాయి, వాటిని అంతః స్రావ గ్రంథులు (ఎండోక్రైన్) అంటారు. మరో రకంగా వీటిని వినాళ గ్రంథులు అని కూడా అంటారు, అంటే వీటికి ఎటువంటి నాళాలు ఉండవు అని అర్ధం. ఇవి శరీరంలో వివిధ చోట్లలో ఉంటాయి. ఈ గ్రంథులకు నాళాలు లేకపోవడం వలన అవి ఉత్పత్తి చేసిన హార్మోన్లను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ హార్మోన్లలో హెచ్చు తగ్గులు ఉంటే ఆ ప్రభావం శారీరక ఆరోగ్యం మీద చూపిస్తుంది. ఈ కారణం వలన శరీరంలో కలిగే వ్యాధులను ఎండోక్రైన్ రుగ్మతలు అంటారు. ఒక్కో గ్రంథి విడుదల చేసే ఒక్కో హార్మోన్ కు వివిధ లక్షణాలు ఉన్నట్టు, ఒక్కో హార్మోన్ లోపం వలన ఒక్కో విధమైన వ్యాధి సంభవిస్తుంది.

ఎండోక్రైన్ వ్యవస్థ అంటే ఏమిటి మరియు దాని పనితీరు ఏమిటి?

ఎండోక్రైన్ వ్యవస్థ అనేక గ్రంధులను కలిగి ఉంటుంది, వీటి కీలక విధి రక్తప్రవాహంలో వివిధ హార్మోన్లను ఉత్పత్తి చేయడం మరియు విడుదల చేయడం. హార్మోన్లు శరీరంలోని వివిధ భాగాలపై పనిచేస్తాయి, అనేక విధులను ప్రదర్శిస్తాయి. ఎండోక్రైన్ గ్రంథులు ఉత్పత్తి చేసిన హార్మోన్లు ఈ క్రింది పనితీరుని కనబరుస్తాయి.

  • శారీరక పెరుగుదల మరియు అభివృద్ధి
  • జీవక్రియ
  • లైంగిక పనితీరు
  • పునరుత్పత్తి
  • మానసిక స్థితి

ఎండోక్రైన్ రుగ్మతలకు గల కారణాలు

ఎండోక్రైన్ రుగ్మతలు సాధారణంగా ఈ క్రింది కారణాల వలన సంభవిస్తాయి.

  • ఎండోక్రైన్ గ్రంధుల నుండి హార్మోన్లను అత్యధికంగా లేదా అత్యల్పంగా విడుదల కావడం, దీనిని హార్మోన్ల అసమతుల్యతగా భావిస్తారు. ఈ అసమతుల్యతకు కారణాలు ఈ క్రింది విధంగా ఉండవచ్చు:
    • హార్మోనులను రక్తంలోకి స్రవించే ఎండోక్రైన్ సమాచార వ్యవస్థలో సమస్య వలన
    • ఎండోక్రైన్ గ్రంథికి వ్యాధి సోకడం వలన
    • జన్యుపరమైన లోపం కారణంగా
    • ఎండోక్రైన్ గ్రంథికి ఇన్ఫెక్షన్
    • ఎండోక్రైన్ గ్రంథికి గాయం కావడం వలన
  • ఈ గ్రంథులలో కణుతులు ఏర్పడడం వలన:
    • శరీరంలో ఏర్పడే చాలా కణుతులు క్యాన్సర్లు కావు మరియు ఇవి ఇతర శరీర భాగాలకు వ్యాపించవు.
    • కానీ ఎండోక్రైన్ గ్రంథులలో ఈ కణుతులు ఏర్పడడం వలన హార్మోనుల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది.

వయసు పెరగడం వలన ఎండోక్రైన్ వ్యవస్థ పనితీరు ఎలా ప్రభావితం అవుతుంది?

వయసు పెరిగేకొద్దీ ఎండోక్రైన్ వ్యవస్థ పనితీరు తగ్గుతూ ఉంటుంది. వృద్ధాప్యంలో ఎండోక్రైన్ గ్రంథుల నుండి హార్మోన్ల విడుదల తగ్గుతుంది అయితే ఈ మార్పులు అందరిలోనూ ఒకేవిధంగా ఉండవు.

వయసు పెరిగే కొద్దీ ఎండోక్రైన్ వ్యవస్థ లో వచ్చే మార్పులు ఈ క్రింద వివరించబడ్డాయి.

  • మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం వలన రుతువిరతి (మెనోపాజ్) ఏర్పడుతుంది.
  • పెరుగుదల హార్మోన్లు తగ్గడం వలన బలం మరియు కండరాల శక్తి సన్నగిల్లుతుంది.
  • మెలటోనిన్ స్థాయి తగ్గడం వలన నిద్రాభంగం ఎక్కువవుతుంది.
  • ఇన్సులిన్ తక్కువైతే మధుమేహం వచ్చే ముప్పు ఉంది.

Endocrine disorders

తరచుగా గొంతునొప్పి వస్తుందా? అది థైరాయిడ్ అని అనుమానంగా ఉందా?

ఎండోక్రైన్ రుగ్మతలు పిల్లలను ప్రభావితం చేస్తాయా?

ఎండోక్రైన్ రుగ్మతలు పిల్లలను ప్రభావితం చేస్తాయి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం పిల్లలలో ఎండోక్రైన్ రుగ్మతలు సాధారణమైనవి. పిల్లలలో ఎండోక్రైన్ రుగ్మతల ప్రభావం ఈ క్రింది విధంగా ఉంటుంది.

థైరాయిడ్ సమస్యలు: శిశువు రెండు సంవత్సరాల వయసు వరకు మెదడు అభివృద్ధిలో థైరాయిడ్ హార్మోన్లు కీలకమైన పాత్ర పోషిస్తాయి, శిశువు గర్భాశయంలో ఉన్నప్పటి నుండి రెండు సంవత్సరాలుగా ఈ సమయం లెక్కించబడుతుంది. ఈ సమయంలో కూడా పిల్లల్లో థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మధుమేహం: శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం, ఇన్సులిన్ చర్యలలో లోపం లేదా రెండిటిలో లోపం కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి అధికమవుతుంది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ/ కదలికలు అత్యల్పంగా ఉండడం వలన పిల్లల్లో మధుమేహం వేగంగా పెరుగుతుంది.

ఊబకాయం: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లల్లో 43 మిలియన్ల మంది ఊబకాయంతో బాధ పడుతున్నారు. ఎండోక్రైన్ రుగ్మతల కారణంగానే పిల్లల్లో ఊబకాయం సమస్య ఎక్కువవుతుంది.

తక్కువ వయసులోనే శారీరక మార్పులు (Precocious Puberty) : సాధారణంగా బాలికల్లో 10 నుండి 11 సంవత్సరాల మధ్యలో, బాలురిలో 11 నుండి 12 సంవత్సరాల మధ్యలో శారీరక మార్పులు రావడం ప్రారంభమవుతాయి. హార్మోన్ల అసమతుల్యత వలన ఈ శారీరక మార్పులు బాలికల్లో 8 సంవత్సరాలకంటే ముందు, బాలురిలో 9 సంవత్సరాలకంటే ముందే పారరంభమవుతున్నాయి. దీని వలన ఎముకలు కృంగిపోవడం,పెరుగుదలలో లోపాలు సంభవిస్తాయి.

హైపోస్పాడియాస్ మరియు క్రిప్టోర్కిడిజం : ఈ రెండు సమస్యలు బాలురిలో కలుగుతాయి, హైపోస్పాడియాస్ అంటే పుట్టుకతో పురుషాంగం యొక్క మూత్రనాళం చివరి భాగంలో కాకుండా పురుషాంగం క్రింద ఉంటుంది. ఈ సమస్య 250 మందిలో ఒకరికి ఉంటుంది. క్రిప్టోర్కిడిజం కూడా పుట్టుకతో వస్తుంది, సాధారణంగా శిశువు గర్భంలో ఉన్నప్పుడు వృషణాలు ఉదరం లోపల ఏర్పడతాయి, శిశివు జన్మించినప్పుడు లేదా కొన్ని నెలల్లో వృషణాలు ఉదరం నుండి బయటకు వస్తాయి. కొన్నిసార్లు వృషణాలలో ఒకటి లేదా రెండు ఉదరం భాగంలోనే ఉండిపోతాయి.

ఎండోక్రైన్ క్యాన్సర్ : ప్యాంక్రియాటిక్ మరియు థైరాయిడ్ క్యాన్సర్ లు ఎండోక్రైన్ రుగ్మతల వలన సంభవించే అవకాశం ఉంది.

వివిధ రకాల ఎండోక్రైన్ రుగ్మతలు ఏమిటి?

ఎండోక్రైన్ రుగ్మతలు అనేక రకాలు ఉన్నాయి. అత్యంత సాధారణ రుగ్మతలలో కొన్ని ఈ క్రింద ఉన్నాయి:

పరిస్థితి కారణాలు లక్షణాలు
మధుమేహం క్లోమం శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం లేదా ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ ను శరీరం ఉపయోగించుకోకపోవడం
  • ఆకలి, దాహం ఎక్కువగా ఉండడం
  • అలసట
  • ఎక్కువసార్లు మూత్ర విసర్జన
  • బరువు తగ్గడం లేదా పెరగడం
  • చూపు మందగించడం
హషిమోటో థైరాయిడైటిస్ ఆటో ఇమ్యూన్ వ్యాధి, రోగ నిరోధక శక్తి వలన థైరాయిడ్ గ్రంధి నాశనమవుతుంది, అందువలన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అవ్వదు.
  • చలికి తట్టుకోలేకపోవడం
  • మలబద్దకం
  • జుట్టు పొడిబారడం లేదా రాలిపోవడం
  • అలసట
  • థైరాయిడ్ గ్రంథి పెరగడం
  • ఎముకలు మరియు కీళ్ళ నొప్పులు
  • రుతుక్రమం సరిగా లేకపోవడం
  • బరువు పెరగడం
  • గుండె నిదానంగా కొట్టుకోవడం
గ్రేవ్ వ్యాధి (Grave’s Disease) ఆటో ఇమ్మ్యూన్ వ్యాధి, థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేయడం
  • కళ్ళ దగ్గర వాపు
  • డయేరియా
  • నిద్ర పట్టకపోవడం
  • అలసట
  • థైరాయిడ్ గ్రంథి పెరగడం
  • వేడిని తట్టుకోలేకపోవడం
  • బరువు తగ్గడం
  • గుండె వేగంగా కొట్టుకోవడం
హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్రంధి హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేయడం
  • డయేరియా
  • నిద్ర పట్టకపోవడం
  • అలసట
  • థైరాయిడ్ గ్రంథి పెరగడం
  • వేడిని తట్టుకోలేకపోవడం
  • గుండె వేగంగా కొట్టుకోవడం
  • బరువు తగ్గడం
  • చికాకు
హైపోథైరాయిడిజం థైరాయిడ్ గ్రంధి హార్మోన్లను తక్కువగా ఉత్పత్తి చేయడం, అయోడిన్ లోపం
  • చలికి తట్టుకోలేకపోవడం
  • మలబద్దకం
  • జుట్టు పొడిబారడం
  • అలసట
  • థైరాయిడ్ గ్రంథి పెరగడం
  • రుతుక్రమం సరిగా లేకపోవడం
  • బరువు పెరగడం
  • గుండె నెమ్మదిగా కొట్టుకోవడం
  • ముఖం వాపు
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) మహిళల్లో ఆండ్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం
  • రుతుక్రమం సరిగా లేకపోవడం
  • బరువు పెరగడం
  • మొటిమలు, చర్మం జిడ్డుగా ఉండడం
  • మెడ, చేతులు, రొమ్ము మరియు తొడల మీద చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడడం
  • సంతానం కలగకపోవడం

ఎండోక్రైన్ రుగ్మతలు ప్రాణాంతకమైనవా?

కొన్ని సందర్భాలలో ఎండోక్రైన్ రుగ్మతలు ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది. పేషేంట్ లో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

  • తరచుగా స్పృహ కోల్పోవడం మరియు గందరగోళానికి గురవ్వడం
  • రక్తపోటు లేదా హృదయ స్పందన తక్కువగా ఉండడం
  • నిర్జలీకరణం (డీహైడ్రేషన్)
  • వాంతులు, విరేచనాలు తీవ్రంగా ఉండడం
  • తీవ్రమైన అలసట మరియు బలహీనత
  • కళ్ళు పొడిబారడం, నొప్పి, ఒత్తిడి, చిరాకు
  • సరిగా నిద్రపట్టకపోవడం
  • చేతులు, కాళ్ళు మొద్దుబారిపోవడం

 

ఎండోక్రైన్ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?

ఈ క్రింది లక్షణాలు కలిగిన వారికి ఎండోక్రైన్ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

  • రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువ ఉన్నవారికి
  • కుటుంబలో ఎండోక్రైన్ రుగ్మతలు కలిగి ఉన్నవారికి
  • ఊబకాయం కలిగి ఉన్నవారికి
  • కనీస వ్యాయామం చేయని వారికి లేదా ఎక్కువగా కదలని వారికి
  • ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నవారికి
  • గర్భిణీ స్త్రీలకు
  • ఇన్ఫెక్షన్, గాయాలు ఉన్నవారికి లేదా ఇటీవలే శస్త్రచికిత్స జరిగిన వారికి
  • వయస్సు పైబడిన వారికి

ఎండోక్రైన్ రుగ్మతలను ఎలా నిర్దారిస్తారు?

ఎండోక్రైన్ రుగ్మతలను నిర్దారించడానికి పేషేంట్ లక్షణాలు, శారీరక పరిస్థితి, పేషేంట్ గతంలో తీసుకున్న వైద్యం, కుటుంబ చరిత్ర ఆధారంగా పేషేంట్ కు చేయవలసిన పరీక్షలను ఎండోక్రినాలజిస్ట్ నిర్ణయిస్తారు. ఆ పరీక్షలు ఈ క్రింది విధంగా ఉండవచ్చు.

రక్తం మరియు మూత్రంలో హార్మోన్ స్థాయిలను పరీక్షించడం
CT స్కాన్, అల్ట్రాసోనోగ్రఫీ, MRI, PET స్కాన్‌లు వంటి ఇమేజింగ్ పరీక్షల ద్వారా లోపల ఏర్పడిన కణుతులను గుర్తించడం.

ఎండోక్రైన్ రుగ్మతలకు చికిత్స ఎలా చేయాలి?

ఎండోక్రైన్ రుగ్మతలకు చికిత్స

  • గ్రంథి ద్వారా హార్మోన్ ఉత్పత్తి తక్కువగా లేదా అసలు లేనప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్స.
  • హార్మోన్ ఉత్పత్తిని పెంచే లేదా తగ్గించే మందులు వాడడం
  • కణితి పెరుగుదలను నియంత్రించడానికి శస్త్రచికిత్స లేదా రేడియేషన్ థెరపీ
పీరియడ్స్ రావడం ప్రతీ నెల ఆలస్యం అవుతుందా?

ఎండోక్రైన్ రుగ్మతలను ఎలా నివారించవచ్చు?

కొన్ని ఎండోక్రైన్ రుగ్మతలు వంశపారంపర్యంగా వస్తాయి, మరికొన్ని అనుసరిస్తున్న జీవనశైలి కారణంగా సంభవిస్తాయి. కొన్ని జాగ్రత్తలను పాటించడం వలన జీవనశైలి కారణంగా వచ్చే ఎండోక్రైన్ రుగ్మతలు మధుమేహం, PCOS వంటి వాటిని నివారించవచ్చు.

  1. సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
  • తీసుకునే భోజనంలో 20 – 30 గ్రాములు ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి, ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం వలన ఎండోక్రైన్ గ్రంథులు సరిగా పనిచేస్తాయి.
  • అధికంగా ఫైబర్ కలిగిన ఆహారం తీసుకోవడం వలన ఇన్సులిన్ సరైన స్థాయిలో ఉంటుంది మరియు ఆకలి నియంత్రణలో ఉంటుంది.
  • కార్బోహైడ్రేట్స్ మరియు చక్కెర పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వలన ఊబకాయం మరియు మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
  • చెడు కొవ్వు కలిగిన ఆహారాన్ని తగ్గించండి, ఆరోగ్యకరమైన కొవ్వు PUFA, MUFA, చేప కొవ్వు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం.
  • గ్రీన్ టీ తీసుకోవడం వలన మధుమేహం, ఊబకాయం సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
  • ఒకేసారి చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఆహారం తీసుకోవడం వలన హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.
  • మంచి ఆరోగ్యం కోసం ప్రతీరోజూ తీసుకునే ఆహారంలో 1200 కేలరీలు ఉండేలాగా చూసుకోవాలి.

2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
3. ప్రతీరోజూ నడక, తగిన మోతాదులో బరువులు ఎత్తడం, ఏరోబిక్స్ మొదలైన వ్యాయామాల వలన శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం తగ్గించవచ్చు, దీనివలన ఎండోక్రైన్ రుగ్మతలు వచ్చే ముప్పు తక్కువగా 4. ఉంటుంది.
5. ధూమపానం మానేయడం
6. మద్యపానాన్ని తక్కువ పరిమితిలో ఉంచడం
7. ప్రతీ రోజూ 6 నుండి 8 గంటల పాటు సరైన నిద్ర
8. వర్క్ – లైఫ్ సమయాన్ని బ్యాలన్స్ చేసుకోవడం
9. కుటుంబ చరిత్రను బట్టి ఎండోక్రైన్ రుగ్మతలకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం.

ఎండోక్రైన్ క్యాన్సర్ అంటే ఏమిటి?

మన అలవాట్లను బట్టి కానీ తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండడం వలన కానీ మరేదైనా కారణం వలన శరీరంలో క్యాన్సర్ కణుతులు ఏర్పడవచ్చు ఈ క్యాన్సర్ కణుతులు ఎండోక్రైన్ గ్రంథులలో ఏర్పడితే వాటిని ఎండోక్రైన్ క్యాన్సర్ గా పరిగణిస్తారు. అత్యంత సాధారణ ఎండోక్రైన్ క్యాన్సర్లలో థైరాయిడ్ క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నాయి. ఇతర ఎండోక్రైన్ కణితుల్లో అడ్రినల్ గ్రంథి కణితులు, బహుళ ఎండోక్రైన్ నియోప్లాసియా 1 (MEN 1), MEN 2, పారాథైరాయిడ్ గ్రంథి కణితులు మరియు పిట్యూటరీ గ్రంథి కణితులు ఉన్నాయి.

కొన్ని కణితులు నిరపాయకరమైనవి మరియు క్యాన్సర్లు కావు. అవి గ్రంథిలోనే ఉంటాయి మరియు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవు. ప్రాణాంతక కణితులు వేగంగా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి.

ఎండోక్రైన్ క్యాన్సర్‌కు కారణాలేంటి?

ఎండోక్రైన్ క్యాన్సర్‌కు కారణం ఖచ్చితంగా చెప్పలేకపోయినా సాధారణ కారణాలు ఇవి:

  • కుటుంబ చరిత్ర– కుటుంబంలో గతంలో ఎవరికైనా ఎండోక్రైన్ క్యాన్సర్ ఉంటే వంశపారంపర్యంగా ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
  • వయస్సు– వివిధ వయసుల వారికి వేర్వేరు ఎండోక్రైన్ కణితులు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, 70 ఏళ్లు పైబడిన వారిలో చర్మ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • లింగం– పురుషులతో పోలిస్తే స్త్రీలలో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 2-3 రెట్లు ఎక్కువ.
  • తక్కువ రోగనిరోధక శక్తి – తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఎండోక్రైన్ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Endocrine disorders

 

ఎండోక్రైన్ క్యాన్సర్ సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఎండోక్రైన్ క్యాన్సర్ లక్షణాలు ప్రభావితమైన నిర్దిష్ట అవయవాన్ని బట్టి ఉంటాయి. ఎండోక్రైన్ క్యాన్సర్ లక్షణాలు ఈ క్రింది వాటిని కలిగి ఉండవచ్చు,

  • భయం, గందరగోళం, నిరాశ, చిరాకు,ఆందోళన.
  • ప్రేగు లేదా మూత్రాశయ అలవాట్లలో మార్పులు, విరేచనాలు
  • ముఖం ఎర్రబడటం ( ముఖం మీద వెచ్చగా అనిపించడం)
  • అలసట
  • జ్వరం
  • తలనొప్పి
  • పేగు రక్తస్రావం
  • గొంతునొప్పి
  • కామెర్లు (చర్మం మరియు కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం)
  • వికారం, వాంతులు
  • నిర్దిష్ట ప్రాంతంలో నిరంతర నొప్పి
  • చెమట ఎక్కువగా పట్టడం
  • శరీరంలోని ఏదైనా భాగంలో ఎటువంటి గాయం లేకుండా వాపు, లేదా గడ్డ కట్టడం.
  • ఉన్నఫళంగా బరువు పెరగడం లేదా తగ్గడం

ఎండోక్రైన్ క్యాన్సర్‌ను ఎలా నిర్ధారించవచ్చు?

ఎండోక్రైన్ క్యాన్సర్ ను ఈ క్రింది పరీక్షల ద్వారా నిర్దారించవచ్చు.

  • శరీరంలో ప్రభావితమైన భాగాలను అధ్యయనం చేయడానికి శారీరక పరీక్ష.
  • రిఫ్లెక్స్‌ల సాధారణ పనితీరు, సమతుల్యత, సమన్వయం మరియు మానసిక స్థితిని అంచనా వేయడానికి నాడీ పరీక్ష.
  • హార్మోన్లు, గ్లూకోజ్ మరియు ఇతర బయోమార్కర్ల అసాధారణ స్థాయిలను తనిఖీ చేయడానికి రక్తం, మూత్రం మరియు మలం పరీక్షలు.
  • కణితి నిరపాయకరమైనదా లేదా ప్రాణాంతక కణితి పెరుగుదల స్వభావాన్ని పరిశీలించడానికి బయాప్సీ పరీక్ష
  • ప్రభావిత గ్రంథుల CT స్కాన్, MRI మరియు PET పరీక్షలు.

ఎండోక్రైన్ క్యాన్సర్‌కు ఎలాంటి చికిత్స చేయాలి?

ఇతర క్యాన్సర్‌ల మాదిరిగానే, ఎండోక్రైన్ క్యాన్సర్ చికిత్స చేయడానికి ఈ క్రింది పద్దతులను అనుసరిస్తారు.

  • కీమోథెరపీ
  • రేడియేషన్ థెరపీ
  • ప్రభావిత గ్రంథి నుండి కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స
  • ప్రభావిత గ్రంథిని తొలగించిన తర్వాత శరీరం సాధారణంగా పనిచేయడానికి సహాయపడే హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్స
  • నొప్పి మరియు అలసట, వికారం, బరువు తగ్గడం మొదలైన శారీరక లక్షణాలకు చికిత్స చేయడానికి పాలియేటివ్ మెడిసిన్.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Aashish Reddy Bande , Consultant Endocrinologist

About Author

Dr. Aashish Reddy Bande | yashoda hospitals

Dr. Aashish Reddy Bande

MD, DM (Endocrinology)

Consultant Endocrinologist