డెంగ్యూ జ్వరం: రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ డెంగ్యూ సంక్రమణ కేసుల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో చాలా మందికి జ్వరాలు వస్తుంటాయి, అయితే ఈ జ్వరాలు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ డెంగ్యూ జ్వరం చాలా ప్రమాదకరమైనది. డెంగ్యూ వ్యాధి సాధారణంగా ఒక వైరల్ ఇన్ఫ్‌క్షన్. ఇది ప్రపంచంలోని ఉష్ణ మండల ప్రాంతాల్లో (భారత్, ఆఫ్రికా, దక్షిణ చైనా, తైవాన్, మెక్సికో, పసిఫిక్ ద్వీపాలు, దక్షిణ అమెరికా) ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఈ దేశాల్లో వాతావరణం వేడిగా, తేమగా ఉండి దోమలు ఎక్కువ సంఖ్యలో తన సంతతిని ఉత్పత్తి చేసుకోవటం ద్వారా డెంగ్యూ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతాయి. సంవత్సరంలో ఏ సమయంలోనైనా డెంగ్యూ జ్వరం రావొచ్చు. ఇది ఏడెస్ ఈజిప్టి అనే ఆడ దోమ కాటు వల్ల వస్తుంది. దీనినే టైగర్ దోమ అని కూడా అంటారు. ఇది సాధారణంగా పగటి పూట మాత్రమే కుడుతుంది. DEN-1, DEN-2, DEN-3, DEN-4 అనే 4 రకాల వైరస్ ల కారణంగా డెంగ్యూ జ్వరం వస్తుంది.
ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. దోమ కుట్టిన 1-8 రోజుల లోపు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టిన ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధి మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ ఎడిస్ దోమలు ఎల్లో ఫీవర్, చికెన్ గున్యా వంటి వ్యాధులను సైతం కలుగుజేస్తాయి. ఎడిస్ దోమలు చిన్నవిగా మరియు శరీరంపై ఎరుపు, తెలుపు చారలను కలిగి ఉంటాయి. ఈ జ్వరం వచ్చిన వారిలో వైరస్ వారి శరీర రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేయడంతో రక్తకణాల సంఖ్య బాగా తగ్గుతుంది. డెంగ్యూ అంటు వ్యాధి కాదు కానీ, కుటుంబంలో ఒకరికి డెంగ్యూ వస్తే మిగిలిన అందరికీ ఆ వ్యాధి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతమైన మానవుని శరీరంలో సాధారణంగా 1.5 లక్షల నుంచి 4 లక్షల రక్తకణాలు ఉంటాయి. అయితే కొన్ని సార్లు డెంగ్యూ జ్వరం సమయంలో ఈ ప్లేట్‌లెట్స్ 50,000 కంటే తక్కువకు పడిపోయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యక్తి , తన జీవితకాలంలో దాదాపు 3-4 సార్లు డెంగ్యూ జ్వరం బారిన పడే ప్రమాదం ఉంది. ప్రతిసారీ, పరిస్థితి మరింత తీవ్రంగా మరియు క్లిష్టంగా మారే అవకాశం ఎక్కువ.
డెంగ్యూ జ్వరంలో గల రకాలు :
డెంగ్యూలో ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి. అవి:
- ఎలాంటి ముందస్తు సంకేతాలు చూపకుండా వచ్చే డెంగ్యూ (డెంగ్యూ వితవుట్ వార్నింగ్ సైన్స్)
- కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు (డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్) అనగా జ్వరం, చర్మంపై ఎర్రటి దదుర్లు, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పులు (మైయాల్జియా) చూపుతూ వచ్చే డెంగ్యూ.
- తీవ్రమైన డెంగ్యూ (సివియర్ డెంగ్యూ) జ్వరం డెంగ్యూ యొక్క తీవ్రమైన మరియు మరింత ప్రమాదకరమైన రూపం. చర్మం (సులభంగా గాయాలు), చిగుళ్ళు మరియు జీర్ణశయాంతర ప్రేగులలో రక్తస్రావం, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, అధిక-స్థాయి జ్వరం, నీరసం మరియు అలసట, షాక్ వంటి ప్రమాదాలు సంభవించవచ్చు.
- పేషంట్ కోలుకునే దశ డెంగ్యూ జ్వరం యొక్క చివరి దశ. క్లిష్టమైన దశలోకి ప్రవేశించకుండా జ్వరసంబంధమైన దశను దాటిన వ్యక్తులు ఈ దశకు చేరుకుంటారు. ఈ దశలో, శరీరం క్రమంగా కోలుకుంటుంది మరియు డెంగ్యూ జ్వరం యొక్క వివిధ లక్షణాలు క్రమంగా మెరుగుపడతాయి. రక్త నాళాలు సాధారణ గోడ సమగ్రతను తిరిగి పొందుతాయి.
డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు
సాధారణంగా దోమ కాటుకు గురైన 2-7 రోజుల తర్వాత డెంగ్యూ యొక్క లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు 7-10 రోజుల వరకు ఉంటాయి. అయితే ఈ డెంగ్యూ జ్వరం బారిన పడిన వారిలో రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్కటిగా లక్షణాలు బయటకు కనబడతాయి. సాధారణంగా డెంగ్యూ జ్వరం వల్ల వచ్చే 105 – 108°F అధిక జ్వరంతో పాటు క్రింది సంకేతాలు మరియు లక్షణాలు ఉంటాయి:
• తీవ్రమైన తలనొప్పి
• నీరసం మరియు అలసట
• ఆకలి తగ్గిపోవడం
• కళ్ల వెనుక నొప్పి
• వికారం మరియు వాంతులు
• రక్తపోటు తగ్గడం
• తీవ్రమైన ఎముకలు మరియు కీళ్ల నొప్పులు
• ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం అవ్వడం
• కొందరిలో శరీరంపై ఎర్రగా దద్దుర్లు రావడం
• రక్తంలో తెల్ల రక్తకణాలు సంఖ్య తగ్గడంతో కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లడం వంటి లక్షణాలు సైతం ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో, లక్షణాలు మరింత తీవ్రమవుతాయి మరియు ప్రాణాంతక మవుతాయి. ఫలితంగా రక్త నాళాలు దెబ్బతిని రక్తప్రవాహంలో గడ్డకట్టే కణాల సంఖ్య (ప్లేట్‌లెట్స్) పడిపోతుంది. ఇది ఈ క్రింది సమస్యలకు దారితీయవచ్చు:
• నోరు మరియు ముక్కు నుంచి రక్తస్రావం
• పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి
• ఎక్కువ కాలం పాటు వాంతులవ్వడం
• చర్మం కింద రక్తస్రావం అయి గాయాలు లాగా ఉండడం
• కొన్ని సార్లు ఊపిరితిత్తులు, కాలేయం మరియు గుండె వంటి సమస్యలకు సైతం దారితీయవచ్చు.
డెంగ్యూ రోగ నిర్ధారణ పరీక్షలు
సాధారణంగా డెంగ్యూ జ్వరం బారిన పడిన 3 నుంచి 7 రోజుల లోపు డెంగ్యూ పరీక్ష చేయించుకోవాలి. అయితే డెంగ్యూ జ్వరాన్ని గుర్తించడం చాలా కష్టమైన పని ఎందుకంటే దాని సంకేతాలు మరియు లక్షణాలు మలేరియా, లెప్టోస్పిరోసిస్, టైఫాయిడ్ జ్వరం , చికెన్ గున్యా మొదలైన ఇతర వ్యాధులను పోలి ఉంటాయి. పరిస్థితిని నిర్ధారించడానికి ఈ క్రింది పరీక్షలు సహాయపడతాయి.
- NS1 యాంటిజెన్: NS1 యాంటిజెన్ పరీక్ష రక్తంలో వైరస్‌ను మరియు ప్రారంభ దశలో డెంగ్యూ ఇన్ఫెక్షన్‌ను నిర్ధారించడంలో సహాయపడుతుంది.
- యాంటీబాడీ టైటర్: రక్తంలోని ప్రతిరోధకాలు (యాంటీబాడీలు) ఉనికిని మరియు స్థాయిని (టైటర్) నిర్ణయించే రక్త పరీక్షే యాంటీబాడీ టైటర్ పరీక్ష. శరీరంపై యాంటిజెన్‌లు దాడి చేసినప్పుడు, రోగనిరోధక వ్యవస్థ ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిరోధకాల స్థాయిని యాంటీబాడీ టైటర్ పరీక్ష ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఫ్లూ ప్రారంభమైన 5 నుండి 7 రోజుల తర్వాత రక్తంలో IgM ప్రతిరోధకాలు కనుగొనబడతాయి.
- పూర్తి రక్త గణన (CBC) పరీక్ష: ఈ రక్త పరీక్ష ద్వారా డెంగ్యూ జ్వరం నిర్ధారణ చేయబడుతుంది. అంతే కాకుండా ప్లేట్‌లెట్స్, ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలు వంటి రక్త భాగాలలో మార్పులు మరియు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం మరియు హెమటోక్రిట్ (ఎర్ర రక్త కణాల సాంద్రత) పెరగడం వంటి వాటిని గుర్తించడానికి ఈ పరీక్ష సహాయపడుతుంది.
- పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్ష: జ్వరం 4 రోజుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, PCR పరీక్ష ద్వార ప్లేట్‌లెట్‌లు మరియు WRC తగ్గుదలని నిర్దరించవచ్చు. డెంగ్యూ వైరస్ ఆర్‌ఎన్‌ఏను సాధారణంగా న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ (NAAT) ద్వారా మొదటి 7 రోజుల అనారోగ్యంతో గుర్తించవచ్చు. సానుకూల NAAT (ఉదా. RT-PCR) ఫలితం ప్రస్తుత డెంగ్యూ వైరస్ సంక్రమణను నిర్ధారిస్తుంది .
డెంగ్యూ జ్వరం యొక్క నివారణ చర్యలు
డెంగ్యూ వచ్చాక ఇబ్బందులు పడటం కన్నా రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగ్యూ పూర్తిగా నివారించుకోవచ్చు. డెంగ్యూ జ్వరాన్ని నయం చేయడానికి నిర్దిష్ట మందులు లేవు కాబట్టి లక్షణాలను తెలుసుకోవడం అనేది చికిత్సకు ఏకైక మార్గం. దోమ కాటును నివారించడం మరియు దోమల జనాభాను నియంత్రించడం డెంగ్యూ జ్వరం వ్యాప్తిని నిరోధించే రెండు అత్యంత ప్రభావవంతమైన పద్ధతులు
డెంగ్యూ జ్వరం బారిన పడకుండా ఉండటానికి కొన్ని నివారణ చర్యలు పాటించడం తప్పనిసరి.
- డెంగ్యూ ఎక్కువగా దోమల వల్ల వస్తుంది కాబట్టి ముందుగా వాటిని నివారించుకోవడం చాలా అవసరం.
- కాయిల్స్, ఏరోసోల్స్, లిక్విడ్ వేపరైజర్లు మరియు ఇతర ఉత్పత్తుల రూపంలో ఉన్న దోమల వికర్షకాలను వాడడం.
- ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం
- నీటిని నిల్వ చేసే తొట్టెలు, ట్యాంకులు, పాత్రలను మూసి ఉంచడం
- ఇంట్లోకి దోమలు రాకుండా సాయంత్ర సమయాల్లో తలుపులు, కిటికీలు వేసుకోవడం
- ప్రతి వారం కూలర్లు, నీరు నిల్వ ఉన్న ఇతర ప్రదేశాలలో శుభ్రం చేయడం లేదా మార్చడం
- క్రమం తప్పకుండా మన పరిసరాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే దోమల వృద్ధిని నివారించడానికి ప్రయత్నించాలి
- దోమల నుంచి రక్షణ పొందటానికి పొడవాటి చేతుల చొక్కాలు, ఫ్యాంట్లు మరియు సాక్స్‌లు వంటి వాటిని ఉపయోగించడం
- పడుకునేపటప్పుడు కాళ్లు, చేతులు, శరీరాన్ని పూర్తిగ కప్పుకోవడం
- ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైనీజీల నుంచి నీటిని బయటికి రానీయకుండ తగు జాగ్రత్తలు పాటించడం
- ఏసీలేని గదుల్లో దోమతెరలను వాడడం
- పూలకుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం.
- డెంగ్యూ వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది కావున శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రెట్ గా ఉంచుకోవడం కోసం నీటిని, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవడం
- విటమిన్ సి అధికముగా ఉండే పండ్లు రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి. కావున నారింజపండ్లు, జామపండ్లు, చిలగడ దుంపలు, నిమ్మపండు మరియు బొప్పాయిపండ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం
- డెంగ్యూ నుంచి కోలుకునే వరకు నిర్జలీకరణ కారకమైన ద్రవాలైన మద్యపానం, కాఫీ లేక టీ వంటి వాటికి దూరంగా ఉండాలి
- డెంగ్యూ వచ్చిన వారు సమతుల్య ఆహారం మరియు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను మాత్రమే తీసుకోవడం ఉత్తమం
- నూనె, కొవ్వు పదార్ధాలు, కార్బోనేటేడ్ పానీయాలు మరియు కెఫిన్ ను తీసుకోకూడదు. వీటితో పాటు కారంగా ఉండే ఆహారాలు మరియు మాంసాహారాలను మానుకోవడం ఉత్తమం.
గర్భధారణ సమయంలో డెంగ్యూ జ్వరం బారిన పడిన మహిళలు ప్రసవ సమయంలో వారి బిడ్డకు కూడా వైరస్ సంక్రమిస్తుంది. అంతే కాకుండా గర్భధారణ సమయంలో డెంగ్యూ జ్వరం సంక్రమణ ద్వారా పుట్టిన పిల్లలు నెలలు నిండకుండానే పుట్టడం (ముందస్తు జననం) తక్కువ బరువుతో పుట్టడం, పిండం మరణించడం వంటి అనేక ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కావున గర్భిణి స్త్రీలు, దోమ కాటు నుంచి రక్షించుకోవటానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
డెంగ్యూ జ్వరం నుంచి చాలా మంది వ్యక్తులు దాదాపు ఒక వారంలో కోలుకున్నప్పటికీ, కొంతమంది పేషంట్ లు తీవ్రమైన డెంగ్యూ, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ లేదా డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌గా సూచించబడే ప్రమాదకరమైన లక్షణాలను సైతం అనుభవిస్తారు. తీవ్రమైన డెంగ్యూ అనేది రక్త నాళాలు దెబ్బతినడం మరియు రక్తప్రవాహంలో ప్లేట్‌లెట్స్ లేదా రక్తం గడ్డకట్టే కణాల తగ్గుదల ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది షాక్, అంతర్గత రక్తస్రావం, అవయవ వైఫల్యం లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.
మిగతా వైరల్ జ్వరాలలాగానే డెంగ్యూను నయం చేయటానికి ప్రత్యేకమైన చికిత్స లేదా మందులు ఏవీ లేవు. మందులు కేవలం లక్షణాలను తగ్గించటానికి, రోగనిరోధక వ్యవస్థను బలపర్చటానికి మాత్రమే ఇస్తారు. విశ్రాంతి & మంచి నిద్ర, ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం మరియు లక్షణాల నిర్మూలకు కొన్ని ప్రత్యేక పెయిన్ కిల్లర్స్ మాత్రమే సాయపడగలవు.
మీకు జ్వరం వచ్చినట్లయితే లేదా మీరు ఇటీవల డెంగ్యూ జ్వరం ఉన్నట్లు తెలిసిన ప్రాంతంలో ఉన్నట్లయితే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. 12 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు మరియు గర్భిణీలు, మధుమేహ వ్యాధి గ్రస్తులు, దీర్ఘకాలక వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు, రక్తహీనతతో బాధపడుతున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కావున వారు మరింత జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది. డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారు డాక్టర్ సలహా లేనిదే ఏ ఇతర రకాలైన నొప్పి నివారణ మాత్రలను ఎట్టి పరిస్థితూల్లోనూ వాడకూడదు. ముఖ్యంగా రెండు రోజుల కన్నా ఎక్కువ సమయం పాటు జ్వరం ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా చాలా వరకు డెంగీ జ్వరాలను నివారించుకోవచ్చు
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు..
About Author –
Dr. Sashidhar Reddy Gutha,Consultant General Physician and Diabetologist, Yashoda Hospitals - Hyderabad
MBBS, MD (Internal Medicine), CCEBDM (Fellowship in Diabetology)