ఛాతీ నొప్పి: రకాలు, లక్షణాలు, కారణాలు & నిర్ధారణ పరీక్షలు
మనలో ఎంతో మందికి ఎదురయ్యే సాధారణ సమస్యలలో ఛాతీ నొప్పి కూడా ఒకటి. క్రమరహిత జీవనశైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం చాలా మంది ఛాతీ నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అయితే మనలో ఎంతోమంది ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడే ఉంటారు. మెడ నుంచి పక్కటెముకల మధ్యలో ఉన్న ఏ భాగంలో నొప్పి వచ్చినా దాన్ని ఛాతీ నొప్పి అని అంటారు. నాభి నుంచి భుజం వరకు కుడి, ఎడమ వైపు ఛాతీలో ఎక్కడయినా ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఛాతీలో నొప్పి వచ్చిందంటే చాలు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
ఛాతీ నొప్పి తేలికపాటి నొప్పి నుంచి తీవ్రమైన నొప్పిగా కూడా వస్తుంటుంది. గుండె దగ్గర వచ్చే నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఛాతీలో వచ్చే నొప్పి దాదాపు ఒకేలా ఉంటాయి. దీంతో చాలా మంది ఛాతీ నొప్పి వచ్చినా అది గుండె నొప్పి ఏమో అని చాలా కంగారు పడుతుంటారు. వీటిని గమనించుకోవడం చాలా ముఖ్యం. అయితే ఛాతీలో వచ్చే నొప్పి అంతా గుండెపోటు కాదని చాలా మందికి తెలియదు. గుండెపోటుకు సంబంధించి ఎలాంటి సమస్య లేకపోయినా ఛాతీ నొప్పి రావొచ్చు. సరైన సమయానికి చికిత్స అందించకపోతే శ్వాస నాళికలో తీవ్రమైన ఇన్ఫ్‌క్షన్లు సైతం తలెత్తుతాయి.
ఛాతీ నొప్పి యొక్క రకాలు
ఛాతీలో చిన్నగా నొప్పి రాగానే గుండెకు సంబంధించిన నొప్పి అని అనుకుంటాం. కానీ, ఛాతీ నొప్పులు అనేక రకాలుగా ఉన్నాయి.
నరాలసంబంధ నొప్పి: ఛాతీ ప్రాంతానికి రక్తం సరఫరా చేసే నరాలలో హాని సంభవించినప్పుడు కలిగే ఛాతీ నొప్పిని “నరాలకు సంబంధించిన ఛాతీ నొప్పి” అంటారు.
సైకోజెనిక్ (మనోవ్యాధిజనిత) ఛాతీనొప్పి: కొన్ని సార్లు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు లేదా భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు, ఛాతీ ప్రాంతంలో తరచుగా నొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి సాధారణంగా ఆందోళన మరియు తీవ్ర భయాందోళనల సంబంధించినదిగా చెప్పవచ్చు. ఈ రకంగా సంభవించే ఛాతీ నొప్పిని మానసిక నొప్పి లేదా ‘సైకోజెనిక్ పెయిన్’ గా పిలువవచ్చు.
మస్క్యులోస్కెలెటల్ (కండరాలు & అస్థిపంజర నిర్మాణాలు): ఛాతీ ప్రాంతంలో ఉన్న ఎముకలు మరియు కండరాలు దెబ్బతిన్నపుడు లేదా ప్రక్కటెముకలు ఏమైనా విరిగిపోయినప్పుడు కలిగే ఛాతీ నొప్పిని మస్క్యులోస్కెలెటల్ పెయిన్ అంటారు.
ఛాతీ నొప్పి యొక్క లక్షణాలు
ఛాతీ నొప్పి తో బాధపడే వారిలో మనం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను మనం గమనించవచ్చు:
- దగ్గు
- నీరసం మరియు అలసట
- వికారం లేదా వాంతులు
- మైకం & ఆందోళన
- శ్వాస ఆడకపోవడం
- చెమటలు పట్టడం
- భుజం నొప్పి
- వేగవంతమైన & క్రమరహిత హృదయ స్పందన
- ఛాతీలో బిగుతుగా లేదా పట్టేస్తున్నట్లు ఉండడం
- దవడ, భుజము, వెన్ను లేదా మెడ భాగంలో తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఛాతీ నొప్పికి గల కారణాలు
ఛాతీలో నొప్పికి అనేక కారణాలు కలవు.
- హృదయ సంబంధిత కారణాలు:
- కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ (CAD): కొరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD) గుండె జబ్బులలో అత్యంత సాధారణ రకం. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో రక్త ప్రవాహాన్ని పరిమితం చేసే వ్యాధి.
- మయోకార్డియల్ ఇన్ఫార్షన్: గుండెపోటును వైద్యపరంగా ‘మయోకార్డియల్ ఇన్ఫార్షన్”గా పిలుస్తారు. కరోనరీ ఆర్టరీ పూర్తిగా బ్లాక్ అయినప్పుడు ఈ సమస్య వస్తుంది.
- కొరోనరీ ఆర్టరీ డిస్సెక్షన్ : గుండె ధమనుల్లో చీలిక ఏర్పడినప్పుడు సంభవించే అత్యవసర పరిస్థితి. ఇది గుండెకు రక్త ప్రసరణను తగ్గించడం లేదా నిరోధించడం వల్ల, గుండెపోటుకు దారితీయవచ్చు
- మయోకార్డిటిస్: మయోకార్డిటిస్ అనేది గుండె కండరాల వాపును సూచిస్తుంది. ఇది గుండె కండరాలను దెబ్బతీసి, వాపుగా మరియు మందంగా చేస్తుంది. దీంతో గుండె రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం అవుతుంది.
- పెరికార్డిటిస్: పెరికార్డియం యొక్క వాపు, గుండె చుట్టూ ఉండే ఒక సన్నని, రెండు-పొరల సంచి ద్వారా వర్ణించబడే ఒక వైద్య పరిస్థితి.
- హైపర్ట్రోఫిక్ కార్డియోమియోపతి: తీవ్ర భావోద్వేగానికి గురైతే టాకోట్సుబో కార్డియోమయోపతి వస్తుంది. అధిక శారీరక శ్రమ కూడా ఈ పరిస్థితికి కారణం. ఈ కారణాలతో పాటు మిట్రాల్ వాల్వ్ ప్రోలాప్స్ వంటి వివిధ గుండె సంబంధిత పరిస్థితులు కూడా ఛాతీ నొప్పికి కారణంగా చెప్పవచ్చు.
- శ్వాసకోశ సంబంధిత కారణాలు: ఊపిరితిత్తులను ప్రభావితం చేసే పరిస్థితుల (వైరల్ బ్రోన్కైటిస్, న్యుమోనియా, రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులు (లేదా) న్యూమోథొరాక్స్ నుండి ఛాతీలోకి గాలిని లీకేజ్ అవ్వడం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, గాలి ప్రసరించే ద్వారా కుచించుకుపోవడం (లేదా) బ్రోన్కోస్పస్మ్) వల్ల కూడా ఛాతీ నొప్పి రావొచ్చు
- జీర్ణశయాంతర కారణాలు: అన్నవాహిక (ఎసోఫేగస్) సంబంధిత రుగ్మతలు, హార్ట్ బర్న్ (లేదా) యాసిడ్ రిఫ్లక్స్ (కడుపు పైభాగంలో లేదా రొమ్ము ఎముక క్రింద మంటగా అనిపించడం), క్లోమం (లేదా) పిత్తాశయం వాపు, పిత్తాశయం & కిడ్నీలో రాళ్ళు వంటి పరిస్థితులు కూడా ఛాతీలో అసౌకర్యం మరియు నొప్పికి దారితీస్తాయి
- ఎముకలు (లేదా) కండరాల సంబంధ కారణాలు: కొన్ని సార్లు ఎముకలలో పగుళ్లు, గాయపడిన, విరిగిన ఎముకలు, క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ వంటి ఇబ్బందుల వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుంది.. ఈ కారణాలతో పాటుగా:
- గుండెపోటు: ఛాతీలో నొప్పి మరియు మంట అనేది గుండెకు సంబంధించిన సమస్యలకు కారణం అని అనడంలో నిజం ఉన్నప్పటికీ ప్రతిసారి ఇదే కారణం అని కూడా చెప్పలేము. సాధారణంగా చాతి నొప్పి గుండె నొప్పి ఒకటి కాదు. గుండె నొప్పి వున్నపుడు కూడా చాతీనొప్పి రావొచ్చు.
- అజీర్ణం: అజీర్ణం కారణంగా కుడి వైపు ఛాతీలో నొప్పి ఉంటుంది. ఇది మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.ఈ స్థితిలో ఆహారం ఛాతీ, గొంతు మధ్య ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది.
- కండరాలలో ఒత్తిడి: కండరాలలో అధిక ఒత్తిడి కారణంగా ఛాతీలో నొప్పి ఉంటుంది.
- పొడి దగ్గు: దీర్ఘకాలికమైన పొడి దగ్గు కారణంగా ఛాతీ మరియు చుట్టుపక్కల పక్కటెముకపై ఒత్తిడి తెస్తుంది. ఇది ఛాతీలో అసౌకర్యం మరియు నొప్పిని కలిగిస్తుంది
- హెర్నియా: కడుపు యొక్క బలహీనమైన కండరం కొంత భాగం ఛాతీలోకి వ్యాపించినప్పుడు, యాసిడ్ రిఫ్లక్స్ లేదా రెగ్యురిటేషన్‌కు (ఏవైనా ఆహార పదార్థాలు తిన్నప్పుడు జీర్ణం కాక తిరిగి గొంతులోకి రావడం)కారణమవుతుంది. ఇది ఛాతీ నొప్పిలో నొప్పి మరియు అసౌకర్యానికి దారితీస్తుంది.
- బాగా బరువులు ఎత్తుతున్నప్పుడు మరియు ఛాతీ కండరాలు అతిగా అలసిపోయినప్పుడు కూడా ఛాతీలో నొప్పి కలుగుతుంది.
- గుండెకి దగ్గరగా ఉండే ఊపిరితిత్తుల భాగంలో వాపులాంటివి వస్తే ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది. కొన్ని సార్లు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఛాతీ నొప్పికి కారణం కావొచ్చు.
- అధిక కొవ్వు పదార్ధాలు మరియు కెపీన్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంటకు కారణమవుతుంది. ఇది తాత్కాలిక ఛాతీ అసౌకర్యానికి లేదా మంటకు దారితీయడమే కాక అన్నవాహికను సైతం చికాకు పెడుతుంది మరియు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
- ఎక్కువగా మద్యపానం మరియు ధుమపానం చేయడం వంటివి గుండె దడను ప్రేరేపిస్తుంది.
- తీవ్ర భయాందోళనలు లేదా ఆందోళన వంటివి కూడా ఛాతీ నొప్పికి కారణం కావచ్చు
- కొన్ని సార్లు ఛాతీపై ఏదైనా గాయం లేదా ఒత్తిడి కూడా ఛాతీ నొప్పికి కారణమవుతుంది.
ఛాతీ నొప్పి నిర్ధారణ పరీక్షలు
ఈ క్రింది పద్ధతులను ఉపయోగించి ఛాతీ నొప్పికి కారణాన్ని నిర్ధారించవచ్చు.
ఛాతీ ఎక్స్-రే: గుండె చుట్టూ ద్రవం లేదా గుండె సమస్యలు, క్యాన్సర్ సంకేతాలు, ఇన్ఫెక్షన్‌లు లేదా ఊపిరితిత్తులలో అసాధారణ గాలి ఏర్పడటం, వంటి పరిస్థితులను గుర్తించడానికి ఛాతీ ఎక్స్-రే సహాయపడుతుంది.
ఎండోస్కోపీ: యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఇతర జీర్ణశయాంతర సమస్యలను గుర్తించడానికి ఈ రకమైన పరీక్ష చేయడం జరుగుతుంది.
ECG: గుండెపోటు, ఇస్కీమియా, అరిథ్మియా లేదా గుండె కవాటాలు, గోడలు, గదులు లేదా కండరాలను ప్రభావితం చేసే ఏవైనా పరిస్థితుల వల్ల ఛాతీ నొప్పి వచ్చిందో లేదో ECG పరీక్ష చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష అత్యవసర సంరక్షణ మరియు తదుపరి పరీక్షలకు మార్గనిర్దేశం చేస్తుంది.
CT & MRI: CT మరియు MRI వంటి ఇమేజింగ్ పరీక్షలు ఛాతీ నొప్పిలో ఎందుకు వస్తుందనే కారణాలను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి, అంతే కాకుండా వాస్కులర్, ఊపిరితిత్తులు మరియు మృదు కణజాల అసాధారణతలను గుర్తించడానికి సైతం ఉపయోగపడతాయి.
ఎకోకార్డియోగ్రామ్: ఎకోకార్డియోగ్రఫీ అనేది గుండె యొక్క స్పష్టమైన అంతర్గత చిత్రాన్ని రూపొందించడానికి అల్ట్రాసౌండ్‌ని ఉపయోగించే ఒక ఇమేజింగ్ పద్దతి.
కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్: ఈ పరీక్ష సమయంలో, ఒక వ్యక్తిని ట్రెడ్‌మిల్‌పై నడవమని అడుగుతారు. పరీక్ష సమయంలో ఈ ట్రెడ్‌మిల్ వేగం క్రమంగా పెరుగుతుంది. గుండె లేదా దాని పనితీరులో ఏదైనా అసాధారణతలను గుర్తించడానికి వ్యక్తి యొక్క గుండె లయ నిరంతరం కొలుస్తారు.
యాంజియోగ్రామ్: రక్త నాళాలు లేదా గుండె ద్వారా రక్తం ఎలా ప్రవహిస్తుందో చూపించే రోగనిర్ధారణ ప్రక్రియ. ఇందులో, కాంట్రాస్ట్ మెటీరియల్‌ను ఇంజెక్ట్ చేసి, ఎక్స్-రేలు లేదా ఇతర ఇమేజింగ్‌ల ద్వారా ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో గమనించవచ్చు.
ఛాతీ నొప్పి యొక్క నివారణ చర్యలు
- ప్రతిరోజు సరైన సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
- తీవ్ర భయాందోళనలు లేదా ఆందోళనలకు గురికాకుండా ఉండడం
- ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి ఉండడం
- ఆహారాన్ని వేగంగా తినకుండా నెమ్మదిగా తింటూ పూర్తిగా నమిలినా తర్వాత మాత్రమే మిగడం మంచిది
- ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపానం మరియు ధుమపానం జోలికి వెళ్లకూడదు
- కాఫీ మరియు కూల్ డ్రింక్స్ సైతం ఛాతిలో మంట మరియు నొప్పికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. కావున, వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది
- అధిక కొవ్వు పదార్ధాలు మరియు కెపీన్ వంటి వాటికి దూరంగా ఉండడం
- అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మరియు మధుమేహం వంటి ఆరోగ్య పరిస్థితులను అదుపులో ఉంచుకోవడం
- మసాలా ఫుడ్ తో పాటు వేపుళ్లను తీసుకోకపోవడం మంచిది
- పొగాకు నమలడం, దూమపానం మరియు మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండడం
ఛాతీ నొప్పులకు చికిత్స నొప్పి యొక్క తీవ్రత మరియు నొప్పికి కారణమైన పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు తరచుగా ఛాతీ నొప్పి మరియు అసౌకర్యానికి గురవుతుంటే, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ను సంప్రదించడం మంచిది.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262676 మాకు కాల్ చేయగలరు.
About Author –
Dr. V. Rajasekhar, Consultant Interventional Cardiologist, Yashoda Hospital, Hyderabad
MD, DM (Cardiology)