అపెండిసైటిస్: రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు
ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారపు అలవాట్లను పాటించకపోవడం వల్ల ప్రస్తుతం లింగబేధం మరియు వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది అపెండిసైటిస్ బారిన పడుతున్నారు. అపెండిసైటిస్ అనేది ప్రధాన అనారోగ్య సమస్యలలో ఒకటి. అపెండిక్స్ (ఉండుకం) దిగువ కుడి పొత్తికడుపులో చిన్న మరియు పెద్ద ప్రేగుల మధ్య వద్ద కనిపించే ఒక సన్నని గొట్టం లాంటి అవయవం. ఇది 4 అంగుళాలు (10 సెం.మీ) పొడవు ఉంటుంది.
అపెండిక్స్‌లో మలినాలు చేరడం వల్ల లేదా బ్యాక్టీరియా సోకినా వాటి గోడలు ఎరుపు బారి, క్రమంగా వాచి అపెండిసైటిస్ కు దారితీస్తోంది. సాధారణంగా ఈ సమస్య ఎక్కువగా 10-30 ఏళ్ల మధ్య వయస్సుల్లో కనిపిస్తుంది.
అపెండిసైటిస్ రకాలు
అపెండిసైటిస్ రెండు రకాలు:
- తీవ్రమైన (అక్యూట్) అపెండిసైటిస్: ఇది తీవ్రమైన కడుపు నొప్పిని కలిగించే అపెండిసైటిస్. ఇది అకస్మాత్తుగా సంభవించి తక్కువ సమయంలోనే (24 గంటలు) తీవ్రమవుతుంది. ఈ రకమైన అపెండిసైటిస్ సాధారణంగా నాభి చుట్టూ నొప్పితో మొదలై కొన్ని గంటలలో, తీవ్రమైన నొప్పి కుడి వైపున దిగువకు వెళుతుంది. స్త్రీల కంటే పురుషులలోనే ఈ సమస్య ఎక్కువ. తీవ్రమైన అపెండిసైటిస్ ఉన్న వారికి వెంటనే వైద్య సహాయం అవసరం.
- దీర్ఘకాలిక (క్రానిక్) అపెండిసైటిస్: అపెండిక్స్ వాపు చాలా కాలం పాటు ఉన్నట్లయితే అప్పుడు దీర్ఘకాలిక అపెండిసైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ రకమైన అపెండిసైటిస్ రావడం చాలా అరుదు. అపెండిసైటిస్ కేసులలో ఇది 1-5 శాతం మాత్రమే ఉంటుంది. అపెండిక్స్ నొప్పి, జీర్ణ సమస్యలు మరియు ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి సమస్యలు దీర్ఘకాలిక అపెండిసైటిస్‌కు కారణం.
అపెండిసైటిస్ కు గల కారణాలు
- సాధారణంగా పెద్ద ప్రేగు మరియు అపెండిక్స్‌లో అడ్డంకులు ఏర్పడినప్పుడు అపెండిసైటిస్ వస్తుంది
- పేగు లోపల సమస్యలు ఏర్పడడం (ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD))
- ఉదరగోడకు (abdominal wall) సంబంధించిన కణజాలం యొక్క వాపు (పెరిటోనిటిస్) కూడా కారణం కావొచ్చు
- బాక్టీరియా, ఫంగస్, వైరస్ మరియు పరాన్నజీవుల వల్ల అపెండిక్స్ కణజాలు వాపుకు గురవ్వడం మరియు జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు
- జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు మరియు పొట్టలో వచ్చే వివిధ రకాల కణితులు కూడా అపెండిసైటిస్‌కు కారణమవుతాయి
- మలబద్దకంతో బాధపడుతున్న వారిలో సైతం ఈ అపెండిసైటిస్ సమస్య వస్తుంది
అపెండిసైటిస్ యొక్క లక్షణాలు
అపెండిసైటిస్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. వాటిలో సాధారణంగా కనిపించే లక్షణాలు:
- అపెండిసైటిస్ బొడ్డుచూట్టు నొప్పితో ప్రారంభమై దిగువ-కుడి పొత్తికడుపులోనూ నొప్పి వస్తుంది
- కడుపు ఉబ్బరం మరియు ఆకలి లేకపోవడం
- నీరసంగా అనిపించడం
- వికారం మరియు వాంతులవ్వడం
- విరేచనాలు కావడం
- జ్వరం రావడం
- మలబద్ధకం
- మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి
- దగ్గుతున్నప్పుడు లేదా పనిచేస్తున్నప్పుడు నొప్పి రావడం
అపెండిసైటిస్ నివారణ చర్యలు
- ప్రతి ఒక్కరు రోజు వారి ఆహారంలో ఫైబర్ (పీచు పదార్థం) అధికంగా ఉండే ఆహార పదార్ధాలను (పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, బీన్స్, ధాన్యాలు) ఎక్కువగా తీసుకోవాలి
- కొవ్వు ఎక్కువగా కలిగిన పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ పై భారం పడుతుంది కావున వాటిని తీసుకోవడం మానుకోవాలి
- రెడ్ మీట్, బేకరీ పదార్థాలు మరియు అధిక చక్కెరతో కూడిన ఇతర రకాల స్వీట్లను తీసుకోకూడదు
అపెండిసైటిస్ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవడంలో ఏ మాత్రం ఆలస్యం చేసిన అది పగిలి పొట్టలో ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అపెండిసైటిస్ సమస్యకు లాపరోస్కోపిక్ (ఉండుకం తొలగించడం) సర్జరీ చాలా ఉత్తమ పరిష్కారం. ఈ సర్జరీ తర్వాత కొంతనొప్పి ఉన్నా, కొద్దికాలానికి నొప్పి పూర్తిగా తగ్గిపోవడమే కాక భవిష్యత్తులోనూ ఈ తరహా నొప్పి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
మరి ముఖ్యంగా మహిళల్లో పునరుత్పత్తి అవయవాలు (గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్) అపెండిక్స్ దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పొత్తికడుపులో వాపు పెరిగి భవిష్యత్తులో సంతానలేమి సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కావున మహిళల్లో అపెండిసైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తప్పక డాక్టర్ ను సంప్రదించాలి.
About Author –
Dr. Tokala Surender Reddy,Consultant Surgical Gastroenterologist, Laparoscopic, Bariatric & Metabolic Surgeon, Yashoda Hospitals - Hyderabad
MS, FMIS, FAIS, FMAS & FICRS