ఆందోళన: లక్షణాలు, కారణాలు మరియు నివారణ చర్యలు
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతటివారైనా సరే ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఆందోళనకు గురై ఉంటారు. ప్రస్తుతం ఈ సమస్య చిన్న వయస్సు వారి నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తోంది. ఆందోళన అనేది సాధారణంగా సంభవించే ఒక మానసిక రుగ్మత. బాధ, కోపం, ఆందోళన వంటి మానసిక వ్యాధులు శారీరక వ్యాధుల కంటే తక్కువ ప్రమాదకరం అని అనుకున్న నిజానికి అవే ఎక్కువ సమస్యలను (అత్మహత్య మరియు ఇతర ప్రమాదాలు) కలుగజేస్తాయి.
ఈ సమస్య వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఏవరికైనా రావొచ్చు. ఆందోళన ఎక్కువగా బాల్యంలో లేదా యుక్తవయసు గల వారిలో ప్రారంభమవుతుంది. ఈ సమస్య దగ్గర వారిని కోల్పోవడం మరియు దూరం కావడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో వస్తుంది. అంతే కాకుండా మెనోపాజ్, నిద్ర సమస్యలు, కొన్ని ఔషధాల దుష్ప్రభావం, మంచి ఆహారం తీసుకోకపోవడం వంటివి కూడా ఆందోళన వచ్చే ముప్పును పెంచుతాయి.
ఆందోళన యొక్క లక్షణాలు, సంకేతాలు
ఆందోళన లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటాయి. అయితే అందరిలోనూ కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు:
- తలనొప్పి మరియు చెమటలు పట్టడం
- గుండె కొట్టుకునే వేగంలో మరియు శ్వాసలో మార్పు రావడం
- విపరీతంగా భయపడడం మరియు శరీరమంతా వణకడం
- అలసిపోయినట్లు నీరసంగా అనిపించడం
- సహనం మరియు ఏకాగ్రత కోల్పోవడం
- చిన్నచిన్న విషయాలకే చిరాకు పడడం
- నిద్ర పోవడంలో ఇబ్బంది పడడం
- దీర్ఘకాలం బాధలో ఉండటం మరియు సర్వం కోల్పోయినట్లు అనిపించడం
- ప్రతికూల ఆలోచనలు మరియు జీవితంపై విరక్తి రావడం
- ఎవరినీ కలవాలనే ఆసక్తి, దేనిమీదా ధ్యాస లేకపోవడం
- ఏదో తప్పు చేసిన భావన కలగడం
- ఇష్టపడే పనులనూ ఆస్వాదించలేకపోవడం
- కుటుంబం మరియు స్నేహితులను దూరంగా పెట్టడం
ఈ ఆందోళన సమస్యతో బాధపడే వారు జీర్ణశయాంతర సమస్యలను సైతం ఎదుర్కొంటుంటారు.
ఆందోళనకు గల కారణాలు
ఆందోళన అనేది సాధారణంగా వచ్చి వెళ్లే సమస్య. అయితే ఆందోళనతో బాధపడుతున్న చాలా మందిలో తమకు ఆ సమస్య ఉందని తెలుసుకోలేకపోతారు.
ఆందోళనకు సంబంధించిన కొన్ని సాధారణ కారణాలు:
ఎక్కువగా ఆలోచించడం: కొందరు ప్రతి విషయాన్ని ఎక్కువగా అలోచించి భవిష్యత్తు మరియు గతం గురించి తలచుకొని బాధపడుతుంటారు. అయితే ఇలా చిన్న చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా పలువురు ఆందోళనకు గురవుతుంటారు.
వంశపారంపార్యంగా: చాలా తీవ్రమైన మానసిక వ్యాధులకు వారసత్వం కూడా ప్రధాన కారణం. ఆందోళన వంటి మానసిక రుగ్మతలు ఒక తరం నుంచి మరొక తరం వారికి వంశపారంపార్యంగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
పని భారం మరియు ఒత్తిడి: వారు చేసే పనుల వల్ల దైనందిన జీవితంలో చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు. ఈ ఆందోళన మానసికంగాను మరియు శారీరకంగాను జీవితంపై ప్రభావం చూపుతుంది.
ఆరోగ్య సమస్యలు: కొంతమందికి ఈ ఆందోళన సమస్య అనేది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుంది. అంతే కాకుండా గుండెవ్యాధి, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు కలిగి ఉన్నవారు సైతం ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది.
మద్యపాన వినియోగం: చాలా మంది నొప్పి, దుఃఖం, నిరాశ, విచారం మరియు బాధలను మరచిపోవడానికి మద్యం మరియు ఇతర మత్తుపదార్థాల వైపు మొగ్గు చూపుతారు. ఈ అలవాటు పోను పోను వ్యసనంగా మారి తరువాత ఆందోళనకు గురవుతారు.
దగ్గరి వారిని కోల్పోవడం: బాగా దగ్గరైన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తీవ్రంగా అనారోగ్యానికి గురైన మరియు చనిపోయిన ఆ పరిస్థితి విస్తృతమైన ఒత్తిడి మరియు భావోద్వేగ ప్రతిచర్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితి కారణంగా చాలా మంది అనేక సంవత్సరాలుగా ఆందోళనలో ఉంటారు.
కుటుంబ పరిస్థితులు: కుటుంబంలో జరిగే పరిస్థితుల వల్ల కూడా కొందరు ఆందోళనకు గురవుతుంటారు. బాల్యం, యుక్తవయసులో భావోద్వేగానికి లోనైన వారు సైతం ఆందోళన చెందుతుంటారు.
వ్యక్తిత్వ క్రమరాహిత్యం (పర్సనాలిటీ డిజార్డర్): కొంతమందికి పరిపూర్ణతతో పని చేసే అలవాటు ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఈ మొండితనం ఒక వ్యసనంగా మారినప్పుడు ఆ వ్యక్తుల్లో ఆందోళన కలుగుతుంది.
ఈ ఆందోళన కారణంగా డిప్రెషన్ (ఇది తరచుగా ఆందోళన రుగ్మతతో సంభవిస్తుంది) లేదా ఇతర మానసిక ఆరోగ్య రుగ్మతలు కూడా కలుగుతాయి. వీటితో పాటు నిద్ర పట్టడంలో ఇబ్బంది (నిద్రలేమి), జీర్ణ లేదా ప్రేగు సమస్యలు, తలనొప్పి మరియు దీర్ఘకాలిక నొప్పి వంటి వాటికి సైతం గురవుతారు.
ఆందోళన బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- సమతుల్య పౌష్టిక ఆహారం తీసుకోవడం
- ఆందోళనను అధిగమించేందుకు ధ్యానం, యోగా వంటివి చేయడం
- శారీరక వ్యాయామం మరియు మంచి నిద్రను అలవాటు చేసుకోవడం
- అనవసరమైన ఆలోచనలు చేయడం మానేయాలి
- అవసరం లేని వాటిని కోరుకోకూడదు
- పాత విషయాలను గుర్తు చేసుకొని బాధపడడం మానేయాలి
- సంతృప్తికరమైన జీవితాన్ని అస్వాదించాలి
- కుటుంబం మరియు స్నేహితులతో మంచి సంభాషణ చేయాలి
- ఆలోచనల పరిమితి ఒక స్థాయిలోనే ఉండాలి
చాలా రకాల మానసిక వ్యాధుల్ని మందులతో నయం చెయలేము. అయితే ఏ వయస్సు వారిలోనైనా ఈ ఆందోళన వంటి సమస్యను గుర్తించినప్పుడు దానిని ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్సలు తీసుకోవడం ఉత్తమం. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఈ ఆందోళన సమస్య నుంచి వీలైనంత త్వరగా కోలుకుని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు.
మా అనుభవంతులైన వైద్య నిపుణుల కొరకు +919513262676 కు కాల్ చేసి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోగలరు
About Author –
Dr. Sashidhar Reddy Gutha,Consultant General Physician and Diabetologist, Yashoda Hospitals - Hyderabad
MBBS, MD (Internal Medicine), CCEBDM (Fellowship in Diabetology)