అనల్ ఫిషర్: రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నూతన చికిత్స విధానాలు
మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల ప్రస్తుతం చాలా మంది అనల్ ఫిషర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొందరిలో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి వారు మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం తో పాటు దాని చుట్టుపక్కల ఉండే కండరాలు తీవ్ర ఒత్తిడికి గురవడంతో మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను అనల్ ఫిషర్ అంటారు. ఈ సమస్య సాధారణంగా స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కనిపిస్తుంది. అనల్ ఫిషర్ 15-50 ఏళ్ల వయస్సు గల వారిలో ఎక్కువగా వస్తుంటుంది. ఈ సమస్యకు సరైన చికిత్స తీసుకోకపోతే సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది.
అనల్ ఫిషర్ సమస్యను నిర్దారించడానికి సాధారణంగా దృశ్య పరీక్ష సరిపోతుంది. అయితే కొన్ని సార్లు అనల్ ఫిషర్ ను నిర్దారించడానికి మలద్వారంలోకి అనోస్కోప్/ప్రోక్టోస్కోప్/సిగ్మాయిడోస్కోప్ వంటి వాటిని ఉపయోగిస్తారు.
అనల్ ఫిషర్ రకాలు
అనల్ ఫిషర్ ఏర్పడిన సమయాన్ని బట్టి దీనిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఇందులో మొదటి రకం అప్పటికప్పుడు కనిపించే అక్యూట్ ఫిషర్. రెండోది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ నొప్పిని కలిగించే క్రానిక్ ఫిషర్.
ఆక్యూట్ ఫిషర్: ఇందులో మొదట మలద్వారం యొక్క బయటి చర్మం చీలిపోయినట్లు అవుతుంది. ఆ తర్వాత అక్కడ ఉండే మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడుతాయి. ఈ ఫిషర్‌కు సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లు అయితే అది దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా మారే అవకాశం ఉంటుంది.
క్రానిక్ ఫిషర్: ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే ఫిషర్. ఇందులో మలద్వారాన్ని గట్టిగా పట్టేసినట్లు ఉంచి, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీలిపోయినట్లుగా కనిపిస్తుంటాయి. అంతే కాకుండా మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది.
అనల్ ఫిషర్ కు గల కారణాలు
ముఖ్యంగా అనల్ ఫిషర్ సమస్య రావడానికి ప్రధాన కారణాలు
- ఎక్కువ కాలం విరేచనాలు కావడం
- దీర్ఘకాలిక మలబద్దకం
- అతిగా మద్యం తీసుకోవడం
- ఎక్కువ సేపు మలవిసర్జనను ఆపుకోవడం
- ఫాస్ట్‌ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వేపుళ్లను ఎక్కువగా తినడం
- మాంసాహారాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కూడా అనల్ ఫిషర్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది
- మలద్వారం చూట్టు ఉండే కండరాలు బిగుతుగా ఉన్న వారిలో కూడా ఈ సమస్య వస్తుంటుంది
- సాధారణంగా మహిళల్లో ప్రసవం సమయంలోనూ మలద్వారం చీలడం వల్ల కూడా అనల్ ఫిషర్ రావొచ్చు
- లైంగికంగా సంక్రమించే వ్యాధులు (సిఫిలిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, క్లమీడియా) సోకినప్పుడు అవి క్రమంగా ముదిరి దీర్ఘకాలంలో అనల్ ఫిషర్‌కు దారితీయవచ్చు
అనల్ ఫిషర్ యొక్క లక్షణాలు
- మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి మరియు మంట
- ఆసన ప్రాంతంలో వాపు మరియు నొప్పి
- మలద్వారం దగ్గర దురద మరియు బాధాకరమైన కురుపులు రావడం
- మల విసర్జన సమయంలో రక్త స్రావం
- కొందరిలో మలవిసర్జన అనంతరం రెండు గంటల పాటు నొప్పి, మంట ఉండడం
- కొందరిలో మలద్వారం వద్ద దుర్వాసనతో కూడిన స్రావాలు కనిపించవచ్చు
అనల్ ఫిషర్ యొక్క నివారణ చర్యలు
అనల్ ఫిషర్ సమస్యకు చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండా నివారించుకోవడమే ఉత్తమమైన చర్య.
- ఈ సమస్య నివారణకు మొదటగా జీవనశైలిలో మార్పులు తప్పనిసరి
- ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటించడం
- రోజులో కనీసం 2-3 లీటర్ల మంచినీళ్లు తాగుతూ ఉండాలి
- మనం తీసుకునే రోజు వారి ఆహార విషయంలో పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు వాటిని తీసుకోవడం
- మలం గట్టిగా మారడానికి తోడ్పడే ఆహారపదార్థాలైన మసాలాలూ, మాంసాహారం, పచ్చళ్లు తీసుకునే మోతాదును తగ్గించుకోవాలి
- మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం, పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించాలి
- ఎక్కువ సార్లు నీళ్ల విరేచనాలు అవుతున్నవారు, ఇలా తరచూ ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది
- రక్తస్రావం తరచుగా అయితే మాత్రం డాక్టర్‌ని సంప్రదించి క్యాన్సర్ లేదని నిర్ధారించుకోవాలి
- ఒకవేళ అప్పటికే చిన్నపాటి అనల్ ఫిషర్ ఉన్నవారు మలవిసర్జన సాఫీగా అవ్వడానికి తోడ్పడే ల్యూబ్రికేటింగ్ ఆయింట్‌మెంట్స్ వాడడం కూడా మంచిది
చికిత్స పద్దతులు
మలవిసర్జన మార్గాన్ని జాగ్రత్తగానూ, సున్నితంగానూ పరిశీలించడం ద్వారా అనల్ ఫిషర్ సమస్యను నిర్ధారణ చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సమస్యకు మంచి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. అనల్ ఫిషర్ సమస్యను మొదటి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేసుకోవడానికి వీలు అవుతుంది. అయితే దీర్ఘకాలంగా అనల్ ఫిషర్‌తో బాధపడేవారికి మందులు అంతగా ఉపయోగపడవనే చెప్పాలి.
అనల్ ఫిషర్ కు హైబ్రిడ్ పద్దతుల్లో అనగా లేజర్, మినిమల్లీ ఇన్వేసివ్ వంటి అధునాతన సర్జరీలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రకమైన సర్జరీల వల్ల నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. హాస్పిటల్లో ఉండే సమయం తక్కువ మరియు సర్జరీ అయిన ఒక్క రోజులోనే డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. అంతే కాకుండా సర్జరీ అయిన 3, 4 రోజులలోనే వారి రోజు వారి పనులు సైతం చేసుకోవచ్చు. ముఖ్యంగా మల విసర్జన సమయంలో నొప్పి, రక్తం రావడం మరియు మలబద్దకం వంటి ఏదైనా సమస్యలు ఉన్న వారు వెంటనే జనరల్ సర్జన్ ను లేదా ప్రొక్టాలజిస్ట్ ను కలవడం మంచిది. అయితే నాన్-సర్జికల్ (ఆపరేషన్ లేకుండా) విధానంలో బొటాక్స్ ఇంజెక్షన్స్ వాడడం వల్ల కూడా ఈ అనల్ ఫిషర్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
మా అనుభవంతులైన వైద్య నిపుణుల కొరకు +919513262676 కు కాల్ చేసి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోగలరు
About Author –