రక్తహీనత (ఎనీమియా): రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు
నేటి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇది పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్ తక్కువగా తయారవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడంతో రక్తహీనత (ఎనీమియా) సమస్య వస్తుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్. ఇది మన శరీరంలోని ఎముక మజ్జలో (బోన్ మ్యారో) తయారవుతుంది. ఇది ఎర్ర రక్త కణాలకు రంగును ఇవ్వడమే కాక ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని అవయవాలకు తీసుకువెళ్తుంది.
రక్తహీనతతో బాధపడుతున్న వారి శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో వారికి అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. సాధారణంగా ఆడవారిలో ప్రతి 100 మిల్లీ లీటర్ల రక్తంలో 12 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాముల కన్నా రక్తం తగ్గితే వారు రక్త హీనతను కలిగి ఉన్నారని అర్ధం.
రక్తహీనత రకాలు
రక్తహీనతను 3 రకాలుగా విభజించవచ్చు. అందులో
- రక్తం కోల్పోవడం వల్ల వచ్చే రక్తహీనత: ఈ రకమైన రక్తహీనత స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది (బుతుక్రమ సమయంలో ఎక్కువగా రక్తం కోల్పోవడం) మరియు కడుపులో అల్సర్లు, ప్రేగు క్యాన్సర్ లు ఉన్న వారిలోనూ ఈ సమస్య వస్తుంది.
- ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గడం వల్ల వచ్చే రక్తహీనత: కొందరు విటమిన్లు, ఖనిజ లవణాలు (మినరల్స్) ను సరిగా తీసుకోకపోవడం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో ఈ రకమైన రక్తహీనత సమస్య వస్తుంది.
- ఎర్రరక్తకణాలు నాశనం కావడం వల్ల వచ్చే రక్తహీనత: జన్యు పరమైన మార్పులు, ఇన్ఫెక్షన్ లు మరియు కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల ఈ రకమైన రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏవరిలోనైనా ఈ సమస్య రావొచ్చు. దీని వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి
రక్తహీనతకు గల కారణాలు
కొన్ని రకాల రక్తహీనతలు పుట్టుకతోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు
- ఆరోగ్యమైన ఎర్ర రక్త కణాల్ని శరీరం తయారు చేయలేకపోవడం మరియు రక్తస్రావం అవ్వడం
- శరీరంలో తగినంత ఐరన్, ఫోలిక్ యాసిడ్, రాగి, జింక్, విటమిన్స్ (A, B12, B3, B6, C, D, E) లేకపోవడం వల్ల కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది
- ముఖ్యంగా స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మరియు బిడ్డకు పాలిచ్చే నెలల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం
- తీసుకున్న ఆహారంలో పోషక విలువలు ఉండకపోవడం, రుతుస్రావం, మలంలో రక్తం పడటం వంటి కారణాలు కూడా రక్తహీనతకు కారణం కావొచ్చు
- కడుపులో ఉండే నులిపురుగులు, హుక్ వార్మ్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక అమిబియాసిస్ వల్ల చిన్న పిల్లల్లోనే కాక పెద్దవారిలోనూ ఈ సమస్య వస్తుంది
- కొన్ని దీర్ఘకాల వ్యాధులను (కిడ్నీ వ్యాధులు, TB, సికల్‌సెల్, తలసేమియా, ఆర్థరైటిస్, క్యాన్సర్) కలిగి ఉన్న వారిలోనూ ఈ రక్తహీనత సమస్య రావొచ్చు.
రక్తహీనత యొక్క లక్షణాలు
- తరుచుగా తలనొప్పి రావడం
- కళ్లు తిరగడం
- నిద్ర పట్టకపోవడం
- జ్ఞాపకశక్తి తగ్గిపోవటం
- ఛాతీలో నొప్పి, వేగంగా గుండె కొట్టుకోవడం
- ఊపిరి తీసుకోవడం కష్టమవడం
- అలసట మరియు చిన్న చిన్న పనులకే నీరసపడడం
- చేసే పనుల పట్ల ఆసక్తి, ఏకాగ్రత లేకపోవడం
- నాలుక నొప్పి మరియు చర్మం పాలిపోయినట్లు కనిపించడం
- పురుషులలో లైంగిక కోరిక తగ్గిపోవడం
- పాదాలలో నీరు చేరడం
- ఆడవారిలో అసాధారణ గర్భాశయ రక్తస్రావం మరియు ఋతు చక్రంలో అసమానతలు రావడం
- రక్తహీనత ఉన్న వారు గుండె సంబంధింత వ్యాధులతో సైతం బాధపడుతుంటారు
రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన చర్యలు
- స్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మరియు బిడ్డకు పాలిచ్చే సమయాల్లో మంచి పౌష్ఠిక, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి
- ప్రతి ఒక్కరు రోజు వారి ఆహారంలో అన్ని రకాల పండ్లు, తాజా కూరగాయలను మరియు ఆకుకూరలను తీసుకుంటూ ఉండాలి
- మాంసాహారాన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఈ రక్తహీనత సమస్య బారిన పడకుండ ఉండవచ్చు (ఇందులో ఐరన్, విటమిన్ బి 12, జింక్, ఫాస్పరస్‌లు అధికంగా ఉంటాయి)
- విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి కాయలు, సిట్రస్ పండ్లు, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, టమోటలను తీసుకోవాలి
- ఖర్జూరం, బెల్లం, నల్ల నువ్వులు, తేనె, బాదం, జీడిపప్పులను తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత సమస్య రాకుండా చూసుకోవచ్చు
రక్తహీనత సమస్యకు చికిత్స కంటే నివారణ ఒక్కటే ఉత్తమ మార్గం. అంతే కాకుండా రక్తహీనత సమస్య గల వారు ఎప్పటికప్పుడు శరీరంలోని రక్త స్థాయిలు మరియు పూర్తి రక్త గణన, రెటిక్యులోసైట్ కౌంట్ వంటి పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు, రక్తస్రావం అధికంగా అయ్యే స్రీలు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వారి సలహామేరకు తగు జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు.
మా అనుభవంతులైన వైద్య నిపుణుల కొరకు +919513262676 కు కాల్ చేసి ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోగలరు
About Author –