రక్తనాళ శస్త్రచికిత్సలో రూపాంతరాలు: నూతన విధానాలు, పరిధి యొక్క విస్తరణ & ప్రయోజనాలు

పరిచయం
ఒకప్పుడు ప్రధాన రక్తనాళాల సంబంధిత సమస్యలకు బహిరంగ శస్త్రచికిత్స అనేది తరుచుగా సూచించబడేది, కానీ నేడు ఈ సమస్యలను సులువుగా అధిగమించడానికి రక్తనాళ శస్త్రచికిత్స విభాగం కొన్ని అధునాతనమైన మార్పులకు నాంది పలికింది. సాంకేతిక పురోగతులు, మారుతున్న రోగుల అవసరాలు మరియు రక్తనాళ వ్యాధి యొక్క క్లిష్టమైన సమస్యపై పెరుగుతున్న అవగాహన మొదలైనవి అన్నీ రక్తనాళ శస్త్రచికిత్స యొక్క వైవిధ్యీకరణకు దోహదించాయి. ఈ విస్తరణ రక్తనాళ సంరక్షణకు మార్గాన్ని మెరుగుపరచడమే కాకుండా, పేషెంటుల ఫలితాలను మెరుగుపరచడంలో మరియు అనేక రకాల రక్తనాళ సమస్యల చికిత్సలో తక్కువ కోతను కలిగి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
శస్త్రచికిత్సలో నూతన అధ్యాయం: సంప్రదాయ శస్త్రచికిత్స నుండి కనిష్ఠ కోతతో కూడిన అధునాతన పద్ధతుల వరకు
రక్తనాళ శస్త్రచికిత్స అనగానే పెద్ద కోతలు, సంక్లిష్టమైన బహిరంగ విధానాలు గుర్తుకు వచ్చేవి. ధమనులలో బైపాస్‌లు లేదా అన్యూరిజం అనేవి సర్వసాధారణం. కానీ, ఎండోవాస్కులర్ అనే కనిష్ట కోతతో కూడిన పద్ధతుల అభివృద్ధి ఈ రంగాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు ఇదే భవిష్యత్తుకు మార్గదర్శకం. ఈ విధానాలలో, గజ్జ లేదా చేతిలో చిన్న రంధ్రాల ద్వారా కాథెటర్‌లను ప్రవేశపెట్టి, రక్తనాళాల లోపల నుండే రుగ్మతలను చేరుకుని చికిత్స చేయవచ్చు. ఆంజియోప్లాస్టీ, స్టెంటింగ్ మరియు ఎండోవాస్కులర్ అనూరిజం రిపేర్ (EVAR) వంటి ఈ పరిణామాలకు ఇది చక్కటి పరిష్కారం.
ఆంజియోప్లాస్టీ మరియు స్టెంటింగ్: ఇందులో, ఒక కాథెటర్‌ను ఇరుకైన లేదా అడ్డగింపబడిన ధమని లోకి పంపడం జరుగుతుంది, అది ఆ స్థానానికి చేరుకున్నప్పుడు, ధమనిని తెరవడానికి బెలూన్ విస్తరింపజేసిన పిమ్మట స్టెంట్ (సన్నని మెష్ ట్యూబ్, ఇది ధమనిని ఎక్కువ కాలం తెరిచి ఉంచుతుంది) ఉంచబడుతుంది. ఇది తరచుగా పరిధీయ ధమని వ్యాధి, కారోటిడ్ స్టెనోసిస్ మరియు రీనల్ ఆర్టరీ స్టెనోసిస్‌కు చికిత్స చేస్తుంది.
ఎండోవాస్కులర్ అన్యూరిజం రిపేర్ (EVAR): EVAR అనేది కడుపులోని బృహద్ధమని రక్త నాళము ఉబ్బినప్పుడు చేసే బహిరంగ శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా రూపింపబడింది. బలహీనమైన బృహద్ధమని గోడను బలోపేతం చేయడానికి మరియు పగిలిపోకుండా నిరోధించడానికి ఒక కాథెటర్ ద్వారా స్టెంట్ గ్రాఫ్ట్ ఉంచబడుతుంది.
రక్తనాళ చికిత్సలో వైవిధ్యం
రక్తనాళ చికిత్సలో వైవిధ్యం అనేది కేవలం ఉపయోగించే పద్ధతులకే పరిమితం కాకుండా, ప్రతి రోగికి అందించే సాధారణ చికిత్సా విధానానికి కూడా వర్తిస్తుంది.
- వైద్య నిర్వహణ: చాలా రక్తనాళ వ్యాధులకు, ముఖ్యంగా ప్రారంభ దశలలో, వైద్య నిర్వహణే చికిత్సకు ప్రధాన ఆధారం. ఇందులో జీవనశైలి మార్పులు (ధూమపానం మానేయడం, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం), మందులు (యాంటీప్లేట్‌లెట్ డ్రగ్స్, కొలెస్ట్రాల్-తగ్గించే మందులు, రక్తపోటు నియంత్రణ మందులు) మరియు నిశిత పర్యవేక్షణ ఉంటాయి. రక్తనాళ సర్జన్లు (వ్యాస్కులర్ సర్జన్లు) ఈ వైద్య నిర్వహణను సమన్వయం చేయడంలో, కార్డియాలజిస్టులు మరియు ఎండోక్రినాలజిస్టుల వంటి ఇతర నిపుణులతో సన్నిహితంగా పనిచేయడంలో ఎక్కువ నిమగ్నమవుతున్నారు.
- హైబ్రిడ్ విధానాలు: కొన్ని సందర్భాలలో, హైబ్రిడ్ విధానం ఉత్తమ ఎంపిక కావచ్చు. ఎందుకంటె ఒక ఎంపికతోనే ఫలితాన్ని ఆశించనప్పుడు ఈ హైబ్రిడ్ విధానాలు అనేవి సర్జన్లను సంక్లిష్టమైన రక్తనాళ సమస్యలను పరిష్కరించడానికి అనుమతిస్తాయి.
- రేడియాలజీ జోక్యాలు: రక్తనాళ శస్త్రచికిత్స మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మధ్య ఒక నిర్దిష్ట సరిహద్దు అనేది లేకుండా ఇటీవలి కాలంలో చెరిగిపోయింది. ఎండోవాస్కులర్ సర్జరీలు అనేవి మొదట్లో రక్తనాళ సర్జన్లచే నిర్వహించబడేవి, కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు ఇప్పుడు ఈ రకమైన సహకారంలో తరచుగా పాల్గొంటున్నారు మరియు రక్తనాళ వ్యాధి నిర్వహణను సమగ్రపరచడంతో పాటు సంరక్షణకు మెరుగైన ప్రాప్యతను కలిగి ఉన్నారు.
రక్తనాళ శస్త్రచికిత్స పరిధి యొక్క విస్తరణ
రక్తనాళ శస్త్రచికిత్స పరిధి విస్తరించడం వలన, చికిత్స చేయబడే పరిస్థితుల రకాలలో కూడా విస్తరణకు దారితీసింది. కేవలం ధమనులపై దృష్టి పెట్టడం నుండి, రక్తనాళ సర్జన్లు అనేవారు నేడు విస్తృత శ్రేణి రక్తనాళ రుగ్మతల చికిత్సలతో కీలకంగా వ్యవహరిస్తున్నారు, వీటిలో కొన్ని ఈ క్రింద వివరించబడ్డాయి:
- సిరల వ్యాధులు: ఇప్పుడు, సిరలను ప్రభావితం చేసే పరిస్థితులు, వెరికోస్ వెయిన్స్, DVT (డీప్ వెయిన్ థ్రాంబోసిస్), మరియు దీర్ఘకాలిక సిరల లోపాలు వంటివి రక్తనాళ శస్త్రచికిత్సా విధానంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతున్నాయి. స్క్లెరోథెరపీ మరియు ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ వంటి పద్ధతులు ఈ పరిస్థితుల చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి.
- శోషరస వ్యాధులు: ఇవి అంత సాధారణం కానప్పటికీ, లింఫెడీమాతో సహా శోషరస వ్యాధులు రక్తనాళ సర్జన్లచే గుర్తించబడి చికిత్స చేయబడుతున్నాయి.
- డయాలసిస్ యాక్సెస్: మూత్రపిండ వైఫల్యం ఉన్న రోగులలో డయాలసిస్ ప్రాప్యత యొక్క నిర్వహణను రక్తనాళ సర్జన్లు అందిస్తారు. సాధారణంగా, ఇది ఆర్టీరియోవీనస్ ఫిస్టులా లేదా గ్రాఫ్ట్ రూపం తీసుకుంటుంది.
- థొరాసిక్ అవుట్‌లెట్ సిండ్రోమ్: ఇది థొరాసిక్ అవుట్‌లెట్ రక్తనాళాలు మరియు నరాలను కుదించే పరిస్థితి. వీటికి ఎక్కువగా రక్తనాళ సర్జన్ల నిర్వహణను కలిగి ఉంటుంది, వారు ఇతర నిపుణులతో కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది.
రక్తనాళ శస్త్రచికిత్స ప్రయోజనాలు: జీవన నాణ్యతకు ఊత
రక్తనాళాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రక్తనాళ శస్త్రచికిత్స అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా, మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షించడంలోనూ సహాయపడుతుంది. తీవ్రమైన లక్షణాల నుండి ప్రాణాంతక సమస్యలను నివారించడం వరకుఈ రక్తనాళ శస్త్రచికిత్స అనేక విధాలుగా ఉపకరిస్తుంది.
- నొప్పి నివారణ: పరిధీయ ధమని వ్యాధి వంటి అనేక రక్తనాళ సమస్యలు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. రక్తనాళ శస్త్రచికిత్స ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరచడం వలన నొప్పిని గణనీయంగా తగ్గించవచ్చు. ఇది రోగులకు సాధారణ కార్యకలాపాలకు తిరిగి రావడానికి సహాయపడుతుంది. నొప్పి తగ్గడంతో, వారి దినచర్య మరింత సులభమవుతుంది.
- చలనశీలత మెరుగుదల: రక్తనాళ శస్త్రచికిత్స రోగుల కదలికను మరియు నడవగల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం చేయడం, రోజువారీ పనుల్లో పాల్గొనడం వంటివి సులభమవుతాయి. శస్త్రచికిత్స తర్వాత, వారు స్వేచ్ఛగా కదలగలుగుతారు, ఇది వారి మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- గాయం నయం చేయడం: రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల దీర్ఘకాలిక గాయాలు నయం కావడం కష్టమవుతుంది. రక్తనాళ శస్త్రచికిత్స ప్రభావిత ప్రాంతాలకు రక్త ప్రసరణను పెంచడం ద్వారా గాయాలు త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది. దీని ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. నయం కాని గాయాల బాధ నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
- అవయవ నష్టం నివారణ: తీవ్రమైన లేదా కొన్ని అరుదైన సందర్భాలలో, ఈ పరిధీయ ధమని వ్యాధి కణజాల మరణానికి మరియు రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల అవయవం కోల్పోవడానికి దారితీస్తుంది. అయితే ఈ రక్తనాళ శస్త్రచికిత్సతో రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడం ద్వారా అవయవాన్ని కాపాడవచ్చు.
- స్ట్రోక్ నివారణ: కారోటిడ్ ధమని వ్యాధి అనేది మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనులను ఇరుకైనదిగా చేస్తుంది, తద్వారా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తనాళ శస్త్రచికిత్స ద్వారా, కారోటిడ్ ధమనులలో పేరుకుపోయిన ఫలకాన్ని తొలగించవచ్చు, దీని ద్వారా స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్స మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.
- అన్యూరిజం (రక్త నాళము ఉబ్బుట)కు పరిష్కారం: రక్తనాళ గోడలు బలహీనపడటం వల్ల కలిగే అవి ఉబ్బి పగిలిపోతే, ప్రాణాంతక అంతర్గత రక్తస్రావం కావచ్చు. ఈ రక్తనాళ శస్త్రచికిత్స ద్వారా, బలహీనమైన రక్తనాళాలను సరిచేయవచ్చు లేదా బలోపేతం చేయవచ్చు, తద్వారా పగిలిపోకుండా నివారించవచ్చు మరియు ప్రాణాలను కాపాడవచ్చు.
- మెరుగైన జీవన నాణ్యత: నొప్పిని తగ్గించడం, చలనశీలతను మెరుగుపరచడం మరియు తీవ్రమైన సమస్యలను నివారించడం ద్వారా, రక్తనాళ శస్త్రచికిత్స అనేది రోగి యొక్క మొత్తం జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. వారు తమకు నచ్చిన కార్యకలాపాలలో పాల్గొనడానికి మరియు సాధారణ జీవితాన్ని గడపడానికి వీలవుతుంది.
- పెరిగిన ఆయుర్దాయం: శస్త్రచికిత్స ద్వారా రక్తనాళ పరిస్థితులను పరిష్కరించడం దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను మెరుగుపరుస్తుంది మరియు ఆయుర్దాయాన్ని పెంచుతుంది, ముఖ్యంగా దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది.
- మందులపై ఆధారపడకుండా విముక్తి: విజయవంతమైన రక్తనాళ శస్త్రచికిత్స తర్వాత, కొంతమంది రోగులు నొప్పి నిర్వహణ లేదా ఇతర సంబంధిత లక్షణాల కోసం మందులపై ఆధారపడటాన్ని తగ్గించగలరు. మందుల వాడకం తగ్గడం వల్ల, వాటి దుష్ప్రభావాల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.
- మెరుగైన ప్రసరణ: రక్తనాళ శస్త్రచికిత్స యొక్క ప్రధాన లక్ష్యం రక్త ప్రవాహం మరియు ప్రసరణను మెరుగుపరచడం. ఈ మెరుగైన ప్రసరణ కణజాలాలు మరియు అవయవాలకు కీలకమైన ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది, తద్వారా శరీరం యొక్క అన్ని భాగాలకు సరైన పోషణ అందుతుంది.
ఈ ప్రయోజనాలన్నీ రక్తనాళ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తాయి. మీకు రక్తనాళ సంబంధిత సమస్యలుంటే, వైద్యుడిని సంప్రదించి, మీకు సరైన చికిత్స గురించి తెలుసుకోవడం ముఖ్యం.
సాంకేతికత మరియు పరిశోధన పాత్ర: రక్తనాళ శస్త్రచికిత్సలో విప్లవాత్మక మార్పులు
రక్తనాళ శస్త్రచికిత్సలో గణనీయమైన వైవిధ్యీకరణకు సాంకేతిక పురోగతులు దోహదించాయి. రక్తనాళ వ్యవస్థను మరింత స్పష్టంగా చూడటానికి అధునాతన కంప్యూటెడ్ టోమోగ్రఫీ ఆంజియోగ్రఫీ (CT ఆంజియోగ్రఫీ) మరియు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఆంజియోగ్రఫీ (MRA) వంటి అత్యాధునిక ఇమేజింగ్ మరియి ఇతర స్కానింగ్ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పద్ధతులు రక్తనాళాల యొక్క వివరణాత్మక చిత్రాలను అందిస్తాయి, ఇది వైద్యులకు వ్యాధిని నిర్ధారించడంలో మరియు చికిత్సా ప్రణాళికను రూపొందించడంలో ఎంతో సహాయపడుతుంది.
కొత్త ఎండోవాస్కులర్ పరికరాల అభివృద్ధి అనేది రక్తనాళ శస్త్రచికిత్సలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. డ్రగ్-ఎల్యూటింగ్ స్టెంట్‌లు మరియు అధునాతన స్టెంట్ గ్రాఫ్ట్‌ల వంటి పరికరాలు అనేక రకాల రక్తనాళ పరిస్థితులకు సమర్థవంతమైన చికిత్సను అందించడానికి వీలు కల్పించాయి. డ్రగ్-ఎల్యూటింగ్ స్టెంట్‌లు రక్తనాళాలు మరలా ఇరుకైనవి కాకుండా నిరోధించడానికి మందులను విడుదల చేస్తాయి, అయితే అధునాతన స్టెంట్ గ్రాఫ్ట్‌లు బలహీనమైన రక్తనాళాలను బలోపేతం చేయడానికి మరియు అన్యూరిజం ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగించబడతాయి.
ప్రస్తుత మరియు కొనసాగుతున్న పరిశోధన ఇప్పటికే ఉన్న పద్ధతులను మెరుగుపరచడానికి మరియు కొత్త విధానాలను అన్వేషించడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఈ పరిశోధనలో కొత్త చికిత్సా పద్ధతుల అభివృద్ధి, కనిష్టంగా కోతతో కూడిన విధానాల యొక్క సామర్థ్యాన్ని పెంచడం మరియు రక్తనాళ వ్యాధి యొక్క అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడం వంటివి ఉన్నాయి. భవిష్యత్తులో మరింత ప్రభావవంతమైన మరియు వ్యక్తిగతీకరించిన చికిత్సలకు ఈ పరిశోధన పునాది వేస్తుంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, సాంకేతికత మరియు పరిశోధన అనేవి రక్తనాళ శస్త్రచికిత్సను పూర్తిగా మార్చివేశాయి. మెరుగైన ఇమేజింగ్, వినూత్న పరికరాలు మరియు నిరంతర పరిశోధన రక్తనాళ వ్యాధి నిర్ధారణ, చికిత్స అదేవిధంగా నివారణలో గణనీయమైన పురోగతికి దోహదించాయి. ఈ పురోగతులు రోగులకు మెరుగైన ఫలితాలను మరియు జీవన నాణ్యతను అందిస్తాయి.
రక్తనాళ శస్త్రచికిత్స యొక్క భవిష్యత్తు: సాంకేతికత మరియు జీవశాస్త్ర పురోగతితో నూతన దిశగా
రక్తనాళ జీవశాస్త్రంపై పెరుగుతున్న అవగాహన మరియు సాంకేతిక పురోగతులు రక్తనాళ శస్త్రచికిత్సలో గొప్ప సానుకూల మార్పులకు వాగ్దానం చేస్తున్నాయి. భవిష్యత్తులో, కనిష్ట కోతతో కూడిన విధానాలు, ముఖ్యంగా ఎండోవాస్కులర్ మరియు పెర్క్యుటేనియస్ పద్ధతులు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రోబోటిక్స్ మరియు కృత్రిమ మేధస్సు జోక్యాలలో మరింత ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. జన్యు చికిత్స మరియు లక్ష్యిత ఔషధ పంపిణీ వ్యవస్థలు రక్తనాళ వ్యాధుల యొక్క పరమాణు చికిత్సకు సామర్థ్యాన్ని అందిస్తాయి. వ్యక్తిగతీకరించిన వైద్యం మరింత ముఖ్యమైనదిగా మారుతుంది, చికిత్సలు అనేవి వ్యక్తిగత రోగి లక్షణాలు మరియు జన్యు ప్రొఫైల్‌లకు అనుగుణంగా రూపొందించబడతాయి.డేటా మరియు మెషిన్ లెర్నింగ్ ప్రమాద శ్రేణీకరణ మరియు రోగి సంరక్షణను మెరుగుపరుస్తాయి.
భవిష్యత్తులో రక్తనాళ శస్త్రచికిత్స సమగ్ర నివారణ మరియు సంరక్షణ వైపు దృష్టి సారిస్తుంది, రక్తనాళ వ్యాధి యొక్క సంభవం తగ్గించడానికి అదేవిధంగా ముందస్తు గుర్తింపు మరియు ప్రమాద కారకాల సవరణపై ఆధారపడుతుంది. వైద్య ప్రత్యేకతల మధ్య సహకారం సమగ్ర రోగి నిర్వహణ వ్యవస్థ యొక్క బలాన్ని నిర్ధారిస్తుంది. టెలిమెడిసిన్ మరియు రిమోట్ పేషెంట్ మానిటరింగ్ ద్వారా వెనుకబడిన జనాభాకు రక్తనాళ సంరక్షణ విస్తరించబడుతుంది. పరిశోధన ప్రయత్నాలు రక్తనాళ వ్యాధి యొక్క సంక్లిష్ట యంత్రాంగాలను వెలికితీస్తాయి మరియు కొత్త చికిత్సా విధానాలను అభివృద్ధి చేస్తాయి.
ముగింపు
ఒకప్పుడు బహిరంగ శస్త్రచికిత్స జోక్యానికి పరిమితమైన రక్తనాళ శస్త్రచికిత్స, నేడు మరింత సంక్లిష్టమైన మరియు బహుముఖమైన రంగంగా అభివృద్ధి చెందింది. ఇందులో తక్కువ కోతతో కూడిన పద్ధతులు, వైద్య నిర్వహణ మరియు హైబ్రిడ్ విధానాలు ఉన్నాయి. ఈ వైవిధ్యం రక్తనాళ సంరక్షణ యొక్క పరిధిని విస్తరించింది, మెరుగైన రోగి ఫలితాలను నిర్ధారించింది అదేవిధంగా చాలా రక్తనాళ పరిస్థితులకు తక్కువ కోతతో కూడిన అవకాశాలను తెరిచింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి మరియు పరిశోధన విస్తరణతో, రక్తనాళ వ్యాధిపై మన అవగాహన రక్తనాళ శస్త్రచికిత్సలో పురోగతులతో పాటు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, రక్తనాళ సమస్యలతో బాధపడుతున్న రోగులకు గొప్ప ఆశ మరియు జీవన నాణ్యతను అందిస్తుంది.
యశోద హాస్పిటల్స్ అధునాతన రక్తనాళ శస్త్రచికిత్సకు అగ్ర కేంద్రంగా ఉంది, వివిధ రక్తనాళ పరిస్థితులకు సమగ్ర చికిత్సను అందిస్తోంది. మా అనుభవజ్ఞులైన రక్తనాళ మరియు ఎండోవాస్కులర్ సర్జన్లు వారు ఆంజియోప్లాస్టీ, స్టెంటింగ్ మరియు EVAR వంటి కనిష్ట కోతతో కూడిన పద్ధతులను, అలాగే సంక్లిష్టమైన కేసుల కోసం బహిరంగ శస్త్రచికిత్సా విధానాలను ఉపయోగిస్తారు. అత్యాధునిక సౌకర్యాలు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో, మేము పరిధీయ ధమని వ్యాధి, కారోటిడ్ ధమని వ్యాధి, రక్త నాళ వాపులు, సిరల వ్యాధులు మరియు మరిన్ని వంటి పరిస్థితులకు ఖచ్చితమైన రోగ నిర్ధారణ మరియు వ్యక్తిగతీకరించిన చికిత్సా ప్రణాళికలను అందించడం జరుగుతుంది. రోగులకు ఉత్తమమైన సంరక్షణ అందించాలనే లక్ష్యంతో యశోద హాస్పిటల్స్ ఎల్లప్పుడూ ముందుంటుంది.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.
About Author –
Dr. Ranjith Kumar Anandasu, Consultant Vascular and Endovascular Surgeon