గురక: లక్షణాలు, కారణాలు, నిర్ధారణ పరీక్షలు మరియు నివారణ చర్యలు

గురక: లక్షణాలు, కారణాలు, నిర్ధారణ పరీక్షలు మరియు నివారణ చర్యలు

ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో గురక ఒకటి. జీవనశైలి మార్పులు, ఊబకాయం తదితర సమస్యలతో ఎంతో మంది ప్రస్తుతం ఈ సమస్యతో బాధపడుతున్నారు. నిద్రపోతున్నప్పడు ముక్కు నుంచి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడిన సమయంలో గురక వస్తుంది. గురక వచ్చినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే కలిగినప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై శబ్ధం వస్తుంది. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉండటం వల్ల మెడ, గొంతు భాగంలో అధిక ఒత్తిడి పడి సైతం గురకకు దారితీస్తుంది.

పూర్వం పెద్ద వయస్సు వారిలో గురక సమస్య ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా ఇది చాలా మందికి వస్తోంది. శారీరక శ్రమ చేయకపోవడం, వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండటం, మన చుట్టుపక్కల కాలుష్యం పెరిగిపోవడం ద్వారా చాలా మందిలో ఈ సమస్య ఎదురవుతుంది.  మొదట గురక చిన్నగానే మొదలవుతుంది.. అయితే నిమిషాలు గడిచే కొద్ది శబ్దం భరించలేని స్థాయికీ చేరుకుంటుంది. గురక సమస్యను వైద్య పరిభాషలో ‘’స్లీప్‌ అప్నీయా’’ అని పిలుస్తారు. గురక అనేది సాధారణ సమస్య అయినా దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఈ సమస్య వల్ల గురకపెట్టే వారి నిద్ర పాడవడమే కాదు, వారికి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా కంటి మీద కునుకు లేకుండా పోతుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, ఊబకాయం, కిడ్నీ సమస్యలతోపాటు మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కన్పిస్తోంది.

గురకకు కారణాలు

గురక రావడానికి అనేక రకాల కారనాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి.

• సమయానికి తినకపోవడం మరియు సరైన నిద్ర లేకపోవడం

• వయసు మీద పడటం

• శ్వాసనాళ సమస్యలు

• సైనస్ సమస్యలు

• నాసికా ఎముకలు పెరగడం

• ముక్కులో కండరాల పెరుగుదల

• అధిక బరువు

• ముక్కు చిన్నదిగా ఉండడం

• అలర్జీలు మరియు సైనస్ ఇన్ఫెక్షన్

• ముక్కులోపలి భాగం వాచిపోవడం

• అధికంగా మద్యం సేవించడం మరియు ధూమపానం చేయడం

• మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అయితే కొన్ని సార్లు జన్యుపరమైన అంశాలు కూడా గురక సమస్యకు కారణం అవుతాయి.

గురక యొక్క లక్షణాలు

Snoring Symptoms Telugu

• పెద్దగా గురక రావడం

• నిద్రలో శ్వాసపరమమైన ఇబ్బందులు

• నోరు పోడిబారిపోయి నిద్ర మధ్యలో మేల్కొనడం

• నిద్రలేమి (ఇన్‌స్కోమియా)

• పనిపై ఏక్రాగత లేకపోవడం

• చిరాకు, కోపం

• నిద్ర లేవగానే తలనొప్పి

• రాత్రిపూట ఛాతీలో నొప్పి

• నిద్రలేవగానే గొంతులో నొప్పి

• నిద్రలో శ్వాస ఆగిపోయినట్లు అనిపించి మెలకువ రావడం

గురక నిర్ధారణ పరీక్షలు

మీకు గురక సమస్య ఉందని డాక్టర్‌ ని సంప్రదించినట్లు అయితే, అతను గురక తీవ్రత మరియు ఇతర లక్షణాల ఆధారంగా ఈ క్రింది రోగనిర్ధారణ పరీక్షలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని సిఫార్సు చేయవచ్చు:

శారీరక పరీక్ష: ముక్కు, నోరు మరియు గొంతు భాగంలో ఏమైనా అడ్డంకులు లేదా అసాధారణతలను గుర్తించడానికి ఈ పరీక్ష చేస్తారు.

స్లీప్ స్టడీ (పాలిసోమ్నోగ్రామ్): ఈ పరీక్షలో మీ గురక యొక్క తీవ్రతను గుర్తించడానికి మరియు స్లీప్ అప్నియాను స్థాయిని తెలుసుకోవడం జరుగుతుంది.

ఇమేజింగ్ పరీక్షలు: కొన్నిసార్లు డాక్టర్ వాయుమార్గాల నిర్మాణాన్ని అంచనా వేయడానికి మరియు ఏమైనా అడ్డంకులను గుర్తించడానికి ఇమేజింగ్ పరీక్షలు (X-రేలు లేదా CT & MRI స్కాన్లు) వంటివి కూడా అవసరం కావొచ్చు.

గురక యొక్క నివారణ చర్యలు

గురక నివారణకు మొదటగా వాయుమార్గం తెరిచి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం, వీటితో పాటుగా:

• ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం మరియు మేల్కొవడం

• ముక్కు మూసుకుపోకుండా శుభ్రంగా ఉంచుకోవడం

• వెల్లకిలా పడుకున్నప్పుడు గురక ఎక్కువగా వస్తుంది. అందుకని పక్కకు తిరిగి పడుకోవడం

• పడుకునేటప్పుడు తల భాగం ఎత్తులో ఉండేలా చూసుకోవడం

• దుమ్ము, ధూళి మరియు అలర్జీల నుంచి పడక గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి

• నిద్రపోయే ముందు మద్యం సేవించే అలవాటును పూర్తిగా మానుకోవాలి.

• గొంతు, నాలుకకు సంబంధించిన శ్వాస సంబంధ ప్రాణాప్రాయ వ్యాయామాలు చేయడం

• ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

• పడుకోవడానికి 2 గంటల ముందే తినడం

• మధ్యాహ్నం తరువాత కాఫీలు, టీలు వంటి వాటిని తీసుకోకూడదు.

• శరీరం బరువు పెరగడం వల్ల గడ్డం ప్రాంతంలో కొవ్వు కణజాలం పెరుకుపోయి కూడా గురక వస్తుంది. అందుకని శరీరం బరువు తగ్గించుకోవాలి.

• యోగా, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవడం వల్ల శ్వాసపై నియంత్రణ పెరిగి గురక తగ్గుతుంది.

• శరీరంలో ఎప్పుడూ నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. దీని కోసం తగిన ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారా ముక్కు, గొంతులోని ద్రవాలు చిక్కబడకుండా చూసుకోవచ్చు.

• తరచూ దిండు కవర్లను మారుస్తూ ఉండాలి. అలాగే వీటి ద్వారా ఉత్పన్నమయ్యే అలర్జీలకు దూరంగా ఉండాలి.

• అధికంగా మద్యం సేవించడం మరియు ధూమపానం చేయడం వంటి హానికర అలవాట్లకు దూరంగా ఉండాలి.

గురక సమస్య చికిత్స విధానాలు

కారణం మరియు తీవ్రత ఆధారంగా గురక చికిత్స ఎంపికలను వైద్యులు సిఫారసు చేస్తారు.

జీవనశైలి మార్పులు: జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన భంగిమలను పాటించడం, అలెర్జీలకు చికిత్స తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యతను పెంచుకుని గురక సమస్యను తగ్గించుకోవచ్చు.

మౌఖిక ఉపకరణాలు: గురక సమస్యకు నివారించుకోవడానికి మాండిబ్యులర్ అడ్వాన్స్‌మెంట్ పరికరాలు (MADs) లేదా మాండిబ్యులర్ స్ప్లింట్లు, గురక మరియు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) వంటి నిద్ర రుగ్మతలకు చికిత్స చేయడానికి, దవడను ముందుకు ఉంచి వాయుమార్గం తెరిచేలా చేసే కస్టమ్-మేడ్ దంత ఉపకరణాలు ఉపయోగపడతాయి.

నాసికా పరికరాలు: నాసికా స్ట్రిప్స్, నాసల్ డైలేటర్లు లేదా నాసికా స్ప్రేలు నాసికా మార్గాల ద్వారా గాలి ప్రవాహాన్ని మెరుగుపరచి గురకను తగ్గించడంలో సహాయపడతాయి.

శస్త్రచికిత్స: తీవ్రమైన గురకకు చికిత్స చేయడానికి కొన్ని సార్లు సర్జరీ కూడా అవసరం కావొచ్చు. అవి:

లేజర్- అసిస్టెడ్‌ యువులోపలాటోప్లాస్టీ (LAUP) : లేజర్-అసిస్టెడ్ యువులోపలాటోప్లాస్టీ (LAUP) అనేది గురక మరియు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) చికిత్సకు లేజర్‌ను ఉపయోగించే ఒక శస్త్రచికిత్సా ప్రక్రియ.

అబ్లేషన్ థెరపీ: ఈ పక్రియలో మృదువైన అంగిలి మరియు నాలుకలోని అదనపు కణజాలం లేదా కణితులను నాశనం చేయడానికి లేదా కుదించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తిని ఉపయోగించడం జరుగుతుంది.

టాన్సిలెక్టమీ లేదా అడినోయిడెక్టమీ: ఈ పక్రియలో సర్జన్ గొంతు వెనుక (టాన్సిలెక్టమీ) లేదా మీ ముక్కు వెనుక (అడినోయిడెక్టమీ) నుంచి అదనపు కణజాలాన్ని తొలగిస్తాడు.

గురక సమస్యకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్, హై హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్, గుండె లయ సక్రమంగా లేకపోవడం వంటి తీవ్రమైన గుండె పరిస్థితులు ఎదురవుతాయి. అంతే కాకుండా గురక పెట్టినప్పుడు ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, నిద్ర నాణ్యత దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.

About Author –

Dr. Mallu Gangadhar Reddy is a Senior Consultant & Interventional Pulmonologist at Yashoda Hospitals, Secunderabad, with over 24 years of experience.

About Author

Dr. Mallu Gangadhar Reddy | yashoda hospitals

Dr. Mallu Gangadhar Reddy

MD, DNB (Pulmonology), FCCP (USA)

Senior Consultant & Interventional Pulmonologist