%1$s

We are aware and ready to serve patients in this COVID-19 pandemic

మేం అప్రమత్తంగా ఉన్నాం!

కొవిడ్‌ సంక్షోభ సమయంలో కూడా సేవలలో ఎలాంటి లోటూ రాకుండా చూసుకోవడం, అత్యవసర పరిస్థితులలో తలుపు తట్టే రోగుల ప్రాణాలను కాపాడటం.. హైదరాబాద్‌లోని ఆరోగ్య సంస్థలకు ఓ సవాలుగా మారింది. అందులోనూ అత్యాధునిక సదుపాయాలు ఉన్న కార్పొరేట్‌ దవాఖానల మీద అంచనాలు మరీ ఎక్కువ. యశోద  ఈ  విషయంలో సర్వసన్నద్ధంగా ఉందని అంటున్నారు  యశోద హాస్పిటల్స్‌ పల్మనరీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌  డాక్టర్‌ పవన్‌ గోరుకంటి. 

లాక్‌డౌన్‌ తొలిదశలో ప్రభుత్వ దవాఖానల్లో మాత్రమే కొవిడ్‌ చికిత్స జరిగేది. కానీ, వైరస్‌ మరింత ప్రబలుతున్నదనీ, దాన్ని ఎదుర్కోవడానికి కార్పొరేట్‌ ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలనీ మేం ముందుగానే ఊహించాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమకూర్చుకొన్నాం. సికింద్రాబాద్‌, సోమాజిగూడ, మలక్‌పేట ఆసుపత్రులలో యుద్ధ ప్రాతిపదికన ఆ ఏర్పాట్లు మొదలుపెట్టాం. కొవిడ్‌ చికిత్సకు అనుగుణంగా వార్డులలో తగిన మార్పులు చేయడం ఒక ఎత్తయితే.. నర్సులు, ఇతర సిబ్బందిని సన్నద్ధం చేయడం మరో ఎత్తు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మానసికంగా దృఢంగా ఉండేందుకు, ఎప్పటికప్పుడు వారికి శిక్షణ ఇస్తున్నాం. ఈ ప్రయాణంలో నర్సులు మాకు వెన్నెముకగా నిలిచారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మార్గదర్శకాలకు అనుగుణంగా..

ఊపిరితిత్తుల నిపుణుడిగా నేను కొన్నాళ్లు న్యూయార్క్‌లో పనిచేశాను. అక్కడి మిత్రుల ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకొనే అవకాశం చిక్కింది. అమెరికాతో పాటు ఇటలీ, ఇంగ్లండ్‌, చైనా దేశాల వైద్యులతో నిరంతరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మాకెంతో ఉపకరించింది. కొవిడ్‌ చికిత్సకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వ్యాధి బారిన పడిన రోగులకు ప్రత్యక్షంగా చికిత్స చేస్తున్న పాశ్చాత్య వైద్యుల ద్వారా మరికొంత సమాచారాన్ని తెలుసుకోగలిగాం. ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు, కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు, తెలంగాణ ప్రభుత్వ సూచనలు.. వీటన్నింటి ఆధారంగా మేం కొన్ని నిబంధనలూ, ప్రమాణాలూ రూపొందించుకున్నాం.

ఒకటి గుర్తుంచుకోవాలి

మన రాష్ట్రంలో కొవిడ్‌-19 రోగులకు అత్యవసర సేవలు అందించేందుకు (క్రిటికల్‌ కేర్‌) ఏకంగా 350 పడకలను సిద్ధం చేసిన ఏకైక సంస్థ మాదే. సాధారణ రోగ లక్షణాలు మాత్రమే ఉన్నా.. ఇంట్లో చికిత్స తీసుకోలేని కొవిడ్‌ బాధితుల కోసం మరో 800 పడకలు సిద్ధం చేశాం. గుండెపోటు, రోడ్డు ప్రమాదాల లాంటి  అత్యవసర స్థితిలో వచ్చే రోగులకూ చికిత్స అందించేందుకు మరో 150 పడకలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో కొవిడ్‌ బాధితులకు పడకల కొరత చాలా తీవ్రంగా ఉందనే విమర్శలు వచ్చాయి. కానీ, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన దేశంలో మొదటి నుంచీ కూడా ఆరోగ్య రంగం నిధుల కొరతతో ఇబ్బంది పడుతూనే ఉంది. రోగులు, వైద్య సిబ్బంది నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంది. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈ తేడా బయటపడింది. ఉదాహరణకు కొవిడ్‌ సమయంలో న్యూయార్క్‌లో వెంటిలేటర్‌ మీదున్న ప్రతి ఏడుగురు రోగులకు ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తేలింది. ఇక అత్యవసర స్థితిలో ఉన్న 30 మంది రోగులను ఒకే వైద్యుడు చూసుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యను మేం ముందే ఊహించి కార్డియాలజీ, నెఫ్రాలజీ లాంటి విభాగాలను కూడా కొవిడ్‌ రోగుల కోసం సిద్ధం చేశాం. ఇలా చేయడం వల్లే, కొవిడ్‌ బాధితుల కోసం 150 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచగలిగాం.  గుండెపోటు, పక్షవాతం కేసులైతే నిరంతరం వస్తూనే ఉన్నాయి. ఒకవైపు కరోనా మహమ్మారితో పోరాడుతూనే, కాలేయ మార్పిడి లాంటి చికిత్సలను కూడా విజయవంతంగా పూర్తిచేశాం. అయితే గుండెజబ్బులు, కీళ్ల వ్యాధుల లాంటి సమస్యలలో అత్యవసరం కాదని అనుకున్న శస్త్ర

చికిత్సలను మాత్రం తాత్కాలికంగా వాయిదా వేస్తూ వచ్చాం.

నిబంధనలు పాటించండి

కొవిడ్‌ నేపథ్యంలో మనం కొన్ని ముఖ్య విషయాలను గుర్తుంచుకోవాలి. ఏ మాత్రం ఏమరపాటు పనికిరాదు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం.. ఈ మూడు నిబంధనలనూ తప్పకుండా పాటించాలి. హైదరాబాద్‌లో చాలామంది యువకులు కొవిడ్‌ వచ్చినా ఏమీ కాదులే అన్న అర్థంలేని ధీమాతో ఉండటాన్ని నేను గమనించాను. కొవిడ్‌వల్ల ఎంతోమంది యువత ప్రాణాలను కోల్పోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. సామాజికంగా కూడా కొవిడ్‌ పట్ల మన దృక్పథంలో మార్పు రావాలి. కొవిడ్‌ వారియర్స్‌ను గౌరవించాలి. 

కొవిడ్‌తో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి, వివిధ విభాగాలకు చెందిన నిపుణులు నిత్యం అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. మా వైద్య బృందం ఇతర రోగులతోపాటు కొవిడ్‌-19 బాధితులకూ చికిత్స అందిస్తూ వచ్చింది. కొవిడ్‌ కారణంగా రోగులు వీడియో సేవలకు అలవాటు పడాల్సిన అనివార్యత ఏర్పడింది. వీడియో కన్సల్ట్టేషన్‌ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని మొదటి నుంచీ తెలిసినా, రోగులు స్వయంగా ఆసుపత్రికి వచ్చేందుకే ఇష్టపడేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. భవిష్యత్‌లో వీడియో కన్సల్టేషన్‌దే ముఖ్య పాత్ర కానుంది. వైద్యపరమైన కారణాలు ఉన్నప్పుడే ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది

Credits: NT News

News Coverage:

  • https://www.ntnews.com/zindagi/2020-07-27-61665