యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI): కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ & నివారణ చర్యలు

ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందులో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. మూత్ర కోశ మార్గాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ లు (UTI) ముఖ్యంగా కిడ్నీలు, మూత్ర నాళాలు, మూత్రాశయం, ప్రసేకం (మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకు తీసుకొని పోయే వాహిక) మొదలైన భాగాలలో రావొచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లు అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి పెద్ద వయసు వారి వరకు ఎవరిలో నైనా రావొచ్చు. అయితే మూత్ర కోశ మార్గాల్లో ఇన్ఫెక్షన్లు అనేవి ఎక్కువగా సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాల ద్వారానే వస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లు పురుషులతో పోలిస్తే స్త్రీలలో (మూత్రనాళం చిన్నగా, మలద్వారానికి దగ్గరగా ఉండడం వల్ల) మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రసేకం (యురేత్రా) ద్వారా బ్యాక్టీరియా మూత్రాశయ నాళంలోకి ప్రవేశించినప్పుడు మూత్ర కోశ మార్గాల్లో ఇన్ఫెక్షన్ లు సంభవిస్తాయి. ఇది మూత్రాశయానికి వ్యాపిస్తే దాన్ని సిస్టిటిస్ అని, ప్రసేకానికి వ్యాపిస్తే దాన్ని యూరేథరిటిస్ అని, కిడ్నీలకు వ్యాపిస్తే పైలోనెఫ్రిటిస్ అని అంటారు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు గల కారణాలు

  • వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం
  • సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం
  • నీళ్లు తక్కువగా తాగడం
  • అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొనడం
  • కెఫిన్, కార్బోనేటేడ్ డ్రింక్స్ మరియు కాఫీ ఎక్కువగా తీసుకోవడం
  • ఎక్కువ సేపు మూత్ర విసర్జనను చేయకుండా ఆపుకోవడం
  • తరచుగా అండర్‌ గార్మెంట్స్ (లో దుస్తులు) మార్చుకోకపోవడం
  • కిడ్నీల నుంచి మూత్రం వచ్చేదారిలో రాళ్ల వంటి అడ్డంకులు ఏర్పడడం
  • టాయిలెట్ కు వెళ్లిన ప్రతి సారి లైంగిక అవయవాలను శుభ్రం చేసుకోకపోవడం
  • కొంత మంది మహిళలలో జన్యు పరమైన లోపాల వల్ల కూడా మూత్రాశయ ఇన్ఫెక్షన్ ల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు

  • తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం
  • మూత్ర విసర్జన సమయంలో మంట లేదా తీవ్రమైన నొప్పి రావడం
  • నురగ మరియు దుర్వాసనతో కూడిన మూత్రం రావడం
  • మూత్రంలో రక్తం పడడం
  • మూత్రాశయం నిండుగా ఉన్న అనుభూతి కలగడం
  • సాధారణ మొత్తంలో మూత్ర విసర్జన చేయలేకపోవడం
  • అసంకల్పితంగా మూత్రం బయటకు పోవడం
  • వెన్నుముక లేదా పొత్తి కడుపు క్రింద భాగంలో నొప్పి లేదా ఒత్తిడి కలగడం

పై లక్షణాలతో పాటు కిడ్నీ సంబంధిత లక్షణాలు, జ్వరం, వికారం, వాంతులు, చలితో వణుకు రావడం వంటి లక్షణాలు కూడా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ లకు సంకేతంగా చెప్పవచ్చు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా నివారణ చర్యలు

మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి బయట పడాలంటే మన జీవన విధానంలో కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి:

  • ఎక్కువ మోతాదులో నీటిని తీసుకోవాలి
  • మూత్ర విసర్జన చేసే సమయంలో మూత్రాన్ని పూర్తిగా విసర్జించే ప్రయత్నం చేయాలి
  • టాయిలెట్ కు వెళ్లిన ప్రతి సారి లైంగిక అవయవాలను శుభ్రం చేసుకోవాలి
  • మూత్ర నాళ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్న వారు ఫాస్ట్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్, టీ మరియు కాఫీ వీలైనంత వరకు తీసుకోకపోవడం మంచిది
  • అతి మూత్ర సమస్యతో బాధపడేవారు మద్యాన్ని తీసుకోకూడదు
  • లైంగిక చర్యలో పాల్గొనే సమయంలో కండోమ్ లు లేదా ఇతరత్రా గర్భ నిరోధక సాధనాలను వినియోగించిన తర్వాత ఖచ్చితంగా లైంగిక అవయవాలను శుభ్రం చేసుకోవాలి
  • ముఖ్యంగా మహిళలు స్వీయ శుభ్రతకు వినియోగించే స్ప్రేలు మరియు బాత్రూం ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

కొంతమంది పురుషులు, స్త్రీలలో ఈ మూత్ర కోశ మార్గాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ల సమస్యలు మళ్లీ మళ్లీ పునరావృత్తం అవుతుంటాయి. కావున మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన కిడ్నీల వైఫల్యానికి కూడా దారితీయవచ్చు. గర్భిణీలు ఈ మూత్ర మార్గ అంటువ్యాధులకు గురైతే తక్కువ బరువు, నెలలు నిండని శిశువులకు జన్మనివ్వడానికి కారణమవుతాయి. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌లు పురుషుల్లో మూత్ర నాళం సంకుచితం (స్ట్రిక్చర్), సెప్సిస్‌కు కూడా కారణమవుతాయి.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) పరీక్షలు, రోగ నిర్ధారణ

సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు యూరాలజిస్ట్‌ను సందర్శించినప్పుడు మూత్ర విసర్జన ఎలా అవుతుంది, మూత్రం ఏ రంగులో వస్తుంది, మూత్రాశయంలో ఇబ్బంది, పొత్తికడుపులో నొప్పికి సంబంధింత ప్రశ్నలు అడగవచ్చు. సాధారణంగా ఎవరైనా మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతుంటే మొదటగా మూత్ర పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో యూరిన్‌ రొటిన్‌ & మైక్రోస్కోపీ, యూరిన్‌ కల్చర్‌ సెన్సిటివిటి వంటి టెస్ట్ లు చేసి నిర్ధారణ చేస్తారు. ఈ పక్రియ ద్వార మూత్ర నాళం, మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరుగుదల గురించి తెలుసుకోవడానికి వీలుంటుంది. అంతే కాకుండా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కు గురైనట్లు నిర్ధారణ అయినప్పుడు USG, CT స్కాన్ మరియు MRI స్కాన్‌ వంటి అధునాతన పరీక్షలు కూడా చేయించుకోమని సలహా ఇవ్వవచ్చు. 

తేలికపాటి నుంచి తీవ్రమైన మూత్రాశయ ఇన్ఫెక్షన్ లకు (UTI) యాంటీ బయాటిక్స్ (సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించే మందులు) వాడవచ్చు. అంతే కాకుండా ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలు తరచూ మూత్ర వ్యాధులతో బాధపడుతుంటే, యోనికి సంబంధించిన ఈస్ట్రోజెన్ థెరపీ ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు. ఎవరైనా ఎక్కువ రోజులు మూత్రాశయ ఇన్ఫెక్షన్ వ్యాధులతో బాధపడుతున్నట్లు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

About Author –

About Author

Dr. Gutta Srinivas

MBBS, MS (Gen Surgery), DNB (Urology)

Sr. Consultant Urologist & Transplant Surgeon, Clinical Director-Department of Urology

Yashoda Hopsitals

Recent Posts

Hyperglycemia: Understanding High Blood Sugar, Its Causes, Symptoms & Management

Hyperglycemia, or elevated blood sugar, is a condition defined by an excess of glucose in…

1 hour ago

ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్- IBS (ప్రకోప ప్రేగు రుగ్మత): కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు సమర్థవంతమైన నిర్వహణ మార్గములు

ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) అనేది పెద్ద ప్రేగును ప్రభావితం చేసే ఒక సాధారణ, దీర్ఘకాలిక రుగ్మత.

23 hours ago

DBS vs. FUS: A Comprehensive Analysis of Deep Brain Stimulation & Focused Ultrasound for Neurological Disorders

Neurological disorders such as Parkinson's disease, essential tremor, and epilepsy are notorious for impairing quality…

2 days ago

అజీర్తి ఎందువలన వస్తుంది? అజీర్తి లక్షణాలు, దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు, చికిత్స

మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకపోవడాన్ని అజీర్తి అంటాం, ఇది చిన్న సమస్యలాగా అనిపించవచ్చు, కానీ అజీర్తి వలన జీవనశైలి…

2 days ago

యూరిక్ యాసిడ్: ఆరోగ్యంపై యూరిక్ యాసిడ్ యొక్క ప్రభావం, అసమతుల్యతలకు కారణాలు, మరియు నియంత్రణ

యూరిక్ యాసిడ్ అనేది మన శరీరం ప్యూరిన్‌లను (కొన్ని ఆహారాలు మరియు శరీర కణజాలాలలో లభించే పదార్థాలను) విభజన చేయడం…

2 days ago

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స

మానవుని జీర్ణవ్యవస్థలో నోటి నుండి తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయం/ కడుపు లోకి చేరుతుంది. అన్నవాహిక చివరిలో ఒక…

5 days ago