పార్కిన్‌సన్స్, మూర్ఛ వ్యాధులకు డిబిఎస్(DBS) సర్జరీతో కొత్త జీవితం
మెదడులో ఏర్పడే కొన్ని మార్పులు చిన్నవైనా,పెద్దవైనా మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని మార్పులు కాళ్లూ చేతుల కదలికలను ప్రభావితం చేస్తాయి. కాళ్లూ, చేతులు బిరుసుగా మారి ఫ్రీజ్ అయిపోతాయి. లేదా అతిగా స్పందించి, కదలికలు వేగం అవుతాయి. మెదడులోని విద్యుత్తులో వచ్చే మార్పులు ఫిట్స్(Fits) రావడానికి కారణమవుతాయి. ఇలాంటి సమస్య లన్నింటికీ ఇంతకుముందు ఉన్న పరిష్కారాల కన్నా మేలైన చికిత్సలు ఇప్పుడు వచ్చాయి. పార్కిన్‌సన్స్(parkinson), మూర్ఛ లాంటి వ్యాధులకు కూడా ఇప్పుడు సర్జరీ అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా మెదడులోని కణుతులకు చేసే బ్రెయిన్ సర్జరీలో కూడా ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్‌ఐ (intraoperative mri) అనే నూతన విధానం వచ్చింది. శరీర కదలికలకు సంబంధించిన కొన్ని వ్యాధులు, ఫిట్స్ లాంటి వాటికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (deep brain stimulation) సర్జరీ మంచి ఫలితాలను ఇస్తున్నది.
పార్కిన్‌సన్స్ డిసీజ్(Parkinson Disease)
మన శరీరం చేసే ప్రతి పనిని నియంత్రించే నరాలు మన మెదడులో ఒక్కో కేంద్రంలో ఉంటాయి. అదేవిధంగా మన కదిలికలను నియంత్రించడానికి కూడా కొన్ని కణాలుంటాయి. ఇవి కదలికలకు అవసరమయ్యే డోపమైన్(dopamine) అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ కణాలు కొందరిలో డీజనరేట్ అవుతాయి. ఇవి నశించడం వల్ల అవి ఉత్పత్తి చేసే డోపమైన్ కూడా తగ్గిపోతుంది. దాంతో కదలికలు ప్రభావితమై సక్రమంగా కాళ్లూ, చేతులు కదల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాళ్లూ చేతుల్లో వణుకు ఉంటుంది. దీన్నే పార్కిన్‌సన్స్ వ్యాధిగా పరిగణిస్తారు. సాధారణంగా పార్కిన్‌సన్స్ వ్యాధి మధ్యవయసువాళ్లలో 40-50 ఏళ్ల వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి జన్యుకారణాలేమీ లేవు. ఇది వంశపారంపర్యంగా రాదు.
ఎలా గుర్తిస్తారు?
పార్కిన్‌సన్స్ వ్యాధి ప్రధాన లక్షణం కాళ్లు, చేతులు వణకడం. కండరాలు శక్తిని కోల్పోవు గానీ రిజిడిటీ ఉంటుంది. కదలిక ఫ్రీగా ఉండదు. అకేనేషియా(akinesia) అంటే కదల్చలేకపోతారు. మూవ్‌మెంట్ చాలా నెమ్మదిగా ఉంటుంది (బ్రాడి కైనేషియా)(bradykinesia). ముందు ఒక వైపు కాలు, చెయ్యి ప్రభావితం అయ్యాక రెండో వైపు భాగం ప్రభావితం అవుతుంది. అంటే ఒకవైపు కాళ్లూ, చేతులు వణకడం, కదల్చలేకపోవడం వంటి సమస్యలుంటాయన్నమాట. నడవడం, చేతులను కదిలించడం చేయలేరు. ముఖంలోని కండరాలను కూడా కదల్చలేము. దాంతో ముఖం భావోద్వేగాలను ఎక్స్‌ప్రెస్ చేయలేనిదిగా అవుతుంది. మాట నిదానం అవుతుంది. మాట శబ్దం తగ్గిపోతుంది. చిన్నగా, మెల్లగా మాట్లాడుతారు. మాట తడబడుతుంది. అయితే కాగ్నిటివ్ సామర్థ్యం మాత్రం బాగానే ఉంటుంది. అంటే ఆలోచనా శక్తి, నిర్ణయాత్మక శక్తి, ఏకాగ్రత, ప్రవర్తన మాత్రం బాగానే ఉంటాయి. కాగ్నిటివ్ సామర్థ్యాలు దెబ్బతినడానికి ఓ పదిహేనేళ్లు పట్టొచ్చు.
డయాగ్నసిస్
నెమ్మదిగా కదిలించడం, స్టిఫ్‌నెస్, వణకడం.. ఈ మూడు లక్షణాలూ ఒకవైపు మొదలై తరువాత రెండో వైపు రావడం పార్కిన్‌సన్స్ వ్యాధి నిర్దుష్ట లక్షణం. దీని ఆధారంగానే క్లినికల్ పరీక్షల ద్వారానే వ్యాధిని తెలుసుకుంటారు. ఎంఆర్‌ఐ లాంటివి అవసరం లేదు. అయితే ప్రోగ్రెసివ్ సుప్రా న్యూక్లియర్ పాల్సీ, మల్టీ సిస్టమ్ అట్రోపీ లాంటి ఇతర డీజనరేటివ్ వ్యాధులుంటే కూడా వీటిలో మూడింటిలో ఏదో ఒకటి లేదా రెండు లక్షణాలైనా రావొచ్చు. దీన్ని పార్కిన్‌సోనిజమ్ అంటారు. పార్కిన్‌సోనిజమ్ ఉన్నప్పుడు అంటే కేవలం నడవడంలో ఇబ్బంది లేదా వణకడం మాత్రమే ఉండి, కాగ్నిషన్ దెబ్బతినకుండా ఉంటే ఇతర డీజనరేటివ్ వ్యాధులున్నాయేమో పెట్ సిటి స్కాన్, ఎంఆర్‌ఐ లాంటి పరీక్షలు అవసరమవుతాయి.
చికిత్స
మెదడులో కదలికలకు సంబంధించిన నరాలు డీజనరేట్ అయినప్పుడు ఆ డీనజనరేటివ్ కణాలను కంట్రోల్ చేసే ఇతర నాడీకణాలు ఎక్కువ పనిచేస్తాయి. అందువల్ల వణకడం, స్టిఫ్‌నెస్ లాంటి ఇబ్బందులు వస్తాయి. అయితే డీజనరేటివ్ కణాలను కంట్రోల్ చేసే నాడీకణాలను చంపేస్తే తాత్కాలికంగా ఈ సమస్యలు తగ్గుతాయి. అందుకే ఈ పార్కిన్‌సన్స్ జబ్బు ఉన్నప్పుడు ఎక్కువగా పనిచేసే నరాలకు లోపల ఆల్కహాల్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ నరాలను చనిపోయేలా చేసేవాళ్లు. దీన్ని లీషనింగ్ అంటారు. ఇందుకోసం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్(radiofrequency ablation) కూడా చేస్తారు. పుర్రె మీద చిన్న రంధ్రం చేసి, ఇంజెక్షన్ ద్వారా ఈ ట్రీట్‌మెంట్ చేసేవాళ్లు.
సైడ్ ఎఫెక్టులిచ్చే మందులు
ఆ తర్వాత మెడికల్ ట్రీట్‌మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ చికిత్సలో భాగంగా తగ్గిపోయిన డోపమైన్ రసాయనాన్ని టాబ్లెట్ రూపంలో ఇవ్వడం మొదలైంది. కదలికలను కంట్రోల్ చేసే నరాలు పనిచేయడానికి ఈ డోపమైన్ కావాలి. అందువల్ల డోపమైన్ మందులు వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ టాబ్లెట్ల వల్ల అనేక సైడ్ ఎఫెక్టులుంటాయి. లక్షణాలు అప్పుడప్పుడే మొదలైన వాళ్లకు, అంటే కొత్తగా వ్యాధి మొదలైన వాళ్లకు డోపమైన్ ఇస్తే అది బాగానే పనిచేస్తుంది. కాని డీజనరేటివ్ ప్రాసెస్ ఆగదు. కదలికలను కంట్రోల్ చేసే నరాలు ఇంకా డీజనరేట్ అవుతూనే ఉంటాయి. ఎక్కువ కణాలు డీజనరేట్ అవుతున్న కొద్దీ ఎక్కువ డోపమైన్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో అదనపు డోపమైన్ మెదడు కణాలపై ప్రభావం చూపించి, కదలికలను కూడా వేగవంతం చేస్తుంది. అంతే ఈ ప్రభావం వల్ల కాళ్లూ చేతులను ఆపకుండా కదిలిస్తూనే ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటారు. దీన్ని డిస్కైనీసియా(dyskinesia) అంటారు. టాబ్లెట్ వేసుకున్న కొన్ని గంటల వరకు ఇలా ఉంటుంది. మందు ప్రభావం తగ్గిన తరువాత మళ్లీ మామూలైపోతారు. కానీ ఆ తరువాత ఫ్రీజ్ అయిపోతారు. అన్నీ స్టిఫ్ అయిపోతాయి. అందువల్ల చాలామంది ఈ డిస్కైనీసియా స్టేట్‌లో ఉండడమే బెటర్ అనుకుంటారు. కాని ఇది పూర్తి ఉపశమనం కలిగించదు.
మేలైన సర్జరీ డిబిఎస్
మందుల వల్ల సమస్యలు ఎక్కువ కాబట్టి దీనికి ప్రత్యామ్నయంగా పార్కిన్‌సన్స్ వ్యాధికి కూడా సర్జరీ అందుబాటులోకి వచ్చింది. దీన్నే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ -డిబిఎస్ సర్జరీ అంటారు. ఈ విధానంలో ఆల్కహాల్ ఇంజెక్షన్ ఇవ్వడానికి బదులుగా కరెంట్ పంపిస్తారు. ఎక్కువ పని చేసే నరానికి ఈ కరెంట్ పంపిస్తారు. దాంతో లక్షణాలు తగ్గుముఖం పడతాయి. కరెంట్ ఆపితే మళ్లీ పనిచేస్తాయి. గుండెకు పేస్‌మేకర్ లాగానే ఇది బ్రెయిన్ పేస్‌మేకర్. బ్యాటరీని కాలర్
బోన్ కింద చర్మం లోపల అమరుస్తారు. దీని కనెక్టింగ్ వైర్‌ని పుర్రెకు డ్రిల్ చేసి నరానికి స్టీరియోటాక్టిక్ టెక్నాలజీ ద్వారా పంపిస్తారు. రిమోట్ లాగా ఉండే ఒక యూనిట్‌తో కరెంట్‌ని ఆన్, లేదా ఆఫ్ చేయొచ్చు. ఇది పేషెంటు మెలకువతో ఉండగా చేసే అవేక్ ఆపరేషన్. అందువల్ల ఎప్పటికప్పుడు పేషెంట్ కోఆపరేషన్ కావాలి. లోకల్ అనెస్తీషియా ఇచ్చి, తలకు స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ అమరుస్తారు. ఫ్రేమ్ స్కానింగ్ చేస్తారు. తలలోని నరాన్ని స్కాన్ ద్వారా గుర్తించి సరిగ్గా దానికి కరెంట్ పంపిస్తారు. ఆపరేషన్ చేసేటప్పుడే ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఈ సర్జరీ కూడా జబ్బును శాశ్వతంగా నయం చేయలేదు. అయితే లక్షణాలు ఉపశమిస్తాయి. మందుల అవసరం తగ్గుతుంది. వాకింగ్ మెరుగుపడుతుంది. వణకడం, స్లోనెస్ తగ్గుతాయి. డీజనరేటివ్ కణాలను కంట్రోల్ చేసే నరాలు ఇంకా ఎక్కువ పనిచేస్తే కరెంట్ డోస్ పెంచుతారు. దాంతో కాగ్నిటివ్ సామర్థ్యం దెబ్బతినకుండా ఆపవచ్చు. కొన్నేళ్ల తరువాత ఈ జబ్బు వల్ల కాగ్నిటివ్ సామర్థ్యం తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ఈ సర్జరీ ద్వారా దాన్ని పోస్ట్‌పోన్ చేయొచ్చు. ఎంత త్వరగా సర్జరీ చేయించుకుంటే అంత ఎక్కువ కాలం పోస్ట్‌పోన్ చేయొచ్చు. సాధారణంగా ఒకసారి బ్యాటరీ, వైరు అమర్చిన తరువాత కరెంట్ తీసేసే అవసరం ఉండదు. కాని వైర్‌ను సరైన స్థానంలో పెట్టకపోతే దగ్గర్లోని నరాలు స్టిమ్యులేట్ అవుతాయి. దాంతో దుష్ప్రభావం పడుతుంది. ఇలాంటప్పుడు బ్యాటరీని ఆఫ్ చేసి సరైన స్థానంలో పెట్టిన తరువాత ఆన్ చేస్తారు. రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా బ్యాటరీ ఆఫ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ బ్యాటరీ నాలుగైదేళ్లు వస్తుంది. రాత్రి ఆఫ్ చేస్తే మరింత కాలం వస్తుంది. ఇలా ఆన్, ఆఫ్ చేసుకోగలిగేది పర్మనెంట్ బ్యాటరీ. రీచార్జబుల్ బ్యాటరీ కొత్తగా వచ్చింది. దీన్ని వారానికోసారి లేదా రెండు వారాలకోసారి రీచార్జ్ చేసుకోవచ్చు. ఇది పదేళ్లు వస్తుంది. జబ్బు నిర్ధారణ అయిన తరువాత కొన్నాళ్లు మందులు వాడి, దాంతో ఫలితం లేకపోయినా లేదా మందులతో సైడ్ ఎఫెక్టులు ఎక్కువ అవుతున్నా డిబిఎస్ ఆపరేషన్ అవసరం అవుతుంది.
డిస్ట్టోనియా(dystonia)
మూవ్‌మెంట్ డిజార్డర్లలో పార్కిన్‌సన్స్ తరువాత ఎక్కువగా కనిపించే వ్యాధి డిస్ట్రోనియా. ఈ జబ్బు ఉన్నప్పుడు చేతులు, కాళ్లు ఒకే పొజిషన్‌లో ట్విస్ట్ అవుతాయి. మెడ లేదా ఒక చేయి లేదా నడుము భాగాల్లో ఏదో ఒకటి స్టిఫ్ అవుతుంది. లేదా అన్నీ కూడా స్టిఫ్ కావొచ్చు. దీనికి కారణాలు జన్యుపరమైనవి. డివైటి జీన్ – డిస్టోనియా జన్యువు ఉంటే అది వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశం ఉంటుంది. అంతేగాక మెనింజైటిస్, బ్రెయిన్ టిబి లాంటి సమస్యల వల్ల కూడా డిస్టోనియా రావొచ్చు. ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ వ్యాధి చిన్న వయసులోనే 20-30లలో కూడా కనిపించవచ్చు. వంశపారంపర్యంగా
సంక్రమించే జన్యుపరమైన డిస్టోనియాకు ట్రీట్‌మెంట్ ఉంది. అందుకే అది జన్యుపరమైన కారణాల వల్ల వచ్చిం దా, ఇతర కారణాలా అని తెలుసుకోవడానికి పరీక్ష చేస్తారు. ఇందుకోసం రక్తపరీక్ష ద్వారా డివైటి జన్యు పరీక్ష చేస్తారు. జన్యుపరమైన డిస్టోనియా కాకపోతే (టిబి, మెనింజైటిస్, స్ట్రోక్ లాంటి కారణాలైతే) మందులతో ఉపశమనం కలిగించవచ్చు కానీ నయం చేయలేము. జన్యుపరమైనది అయితే మాత్రం ఆపరేషన్ ద్వారా జబ్బు తగ్గించవచ్చు.
చికిత్స
డిస్ట్రోనియా ఉన్నవాళ్లలో బేసల్ గాంగ్లియా కణాలు ఎక్కువ పనిచేస్తాయి. దాంతో కాళ్లూ, చేతులు, మెడ వంటి భాగాలు స్టిఫ్‌గా మారి, బిగుసుకుపోతాయి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీతో డిస్ట్రోనియా సమస్యను తగ్గించవచ్చు. డిస్ట్రోనియా ఉన్నప్పుడు కూడా బ్రెయిన్ పేస్‌మేకర్ అమరుస్తారు. ఏ నరం ఎక్కువ పని చేస్తుందో దానికి వైర్ పెట్టి బ్యాటరీ నుంచి కరెంట్ పంపించవచ్చు. ఈ చికిత్స ద్వారా చాలావరకు నార్మల్ అయిపోతారు.
ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్‌ఐతో సురక్షితంగా బ్రెయిన్ సర్జరీలు
ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్‌ఐ, ఎఎంపి, న్యూరోమానిటరింగ్ శస్త్రచికిత్స విధానాలతో అత్యంత క్లిష్టమైన మెదడు సర్జరీలు కూడా రోగులకు హాని జరుగకుండా సురక్షితంగా నిర్వహించవచ్చు. సాధారణ మెదడు కణజాలం దెబ్బతినకుండా సురక్షితంగా ట్యూమర్లను తొలగించవచ్చు. అత్యాధునిక ఐఓఎన్‌ఎం ప్రక్రియలో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో తాము నాడీ వ్యవస్థను నిరంతరం పరిశీలిస్తూ ఎలాంటి హాని జరుగకుండా పర్యవేక్షిస్తుంటారు. అందువల్ల ముఖ్యమైన మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, వాసన, కదలికలు, స్పర్శ వంటి ప్రధాన విధులు దెబ్బతినకుండా రోగికి సంపూర్ణ చికిత్స అందించవచ్చు. ఈ విధానంలో రోగి ఎలాంటి శాశ్వత వైకల్యానికి గురికాకుండా చూసుకోవచ్చు. ఈ విధానంలో నాడీ కణజాలం సర్క్యూట్లను ప్రేరేపిస్తూ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహిస్తారు. బ్రెయిన్ సర్జరీలలో కొన్ని చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మెదడులో మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ.. వంటి ముఖ్య జ్ఞానేంద్రియ సంబంధ భాగాలను ప్రభావితం చేసే ప్రాంతంలో కొన్ని ట్యూమర్లు తొలగించడం ఎంతో రిస్క్‌తో కూడుకుని ఉంటుంది. ఇంట్రా 3టి ఎంఆర్‌ఐతో కూడిన ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (ఐఓఎన్‌ఓం) విధానం సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా నిర్వహించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అత్యాధునిక పద్ధతులలో క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం సురక్షితంగా నిర్వహించవచ్చు. ఇకపై బ్రెయిన్ సర్జరీలలో మళ్లీ మళ్లీ చేయాల్సిన రీ-డు ఆపరేషన్లు అవసరం లేదు. ఒక్కసారే ట్యూమర్‌ను సమగ్రంగా తొలగించవచ్చు.
ఎపిలెప్సీ(epilepsy) లేదా మూర్ఛ
మూర్ఛ వ్యాధి వస్తే ఒకప్పుడైతే అది ఏ చేతబడో, దుష్టశక్తి ప్రభావమో అని భయపడేవాళ్లు. చాలాకాలం వరకు దీనికి సరైన చికిత్సలే ఉండేవి కావు. కాని మూర్ఛ వ్యాధికి కూడా మంచి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు దీనికి కూడా డిబిఎస్ సర్జరీ అందుబాటులో ఉంది.
ఫిట్స్ అంటే
ఎపిలెప్సీ లేదా మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్లలో మెదడు ఎక్కువగా పనిచేస్తుంది. అంటే నిర్దుష్టమైన చోట నరాలు ఎక్కువగా పనిచేస్తాయి. కరెంట్ ఎక్కువగా రావడం వల్ల ఇలా జరుగుతుంది. నరాల ఓవర్ రియాక్టివ్ వల్ల కాళ్లూ, చేతులు ఫ్రీజ్ అవుతాయి. ఇవే ఫిట్స్ రూపంలో కనిపిస్తాయి. కదలికలు వేగంగా జరుగుతాయి. అంటే కాళ్లూ చేతులు కొట్టుకుంటుంటారు. నోట్లోంచి నురగ వస్తుంది. స్పృహలో ఉండరు. జెర్కీ మూవ్‌మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖయగా ముఖం, చేతులు, కాళ్లు ప్రభావితం అవుతాయి. సెన్సరీ, కాన్షియస్‌నెస్ నరాలపై ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. ఫిట్స్ లోకల్‌గా ఒకే కాలు, చేయికి కూడా రావొచ్చు.
కారణాలు
మూర్ఛ లేదా ఫిట్స్ వ్యాధి ఎప్పుడైనా రావొచ్చు. ఏ వయసువారికైనా రావొచ్చు. దీనికి కారణాలనేకం. కొన్నిసార్లు ఏ కారణమో తెలియకుండా కూడా రావొచ్చు. చిన్నపిల్లలకు జ్వరం వల్ల ఫిట్స్ రావొచ్చు. డెవలప్‌మెంటల్ సమస్య ఉన్నా, తలకు దెబ్బ తగిలినా, పక్షవాతం వల్ల, మెదడులో గడ్డ ఉంటే కూడా ఫిట్స్ లేదా మూర్ఛ రావొచ్చు.
చికిత్స
సాధారణంగా మందులతో ఫిట్స్ కంట్రోల్ అవుతాయి. ఆపరేషన్ ద్వారా ఫిట్స్ రావడానికి కారణమైన దాన్ని తీసేస్తారు. అంటే డిబిఎస్ ద్వారా పనిచేయని నరాలకు కరెంట్ పంపిస్తారు. ఎపిలెప్సీ ఉన్నవాళ్లలో సమస్య ఉన్న చోటి నుంచి వేర్వేరు చోట్ల ఉండే నరాలకు స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న నరాలకు వెళ్లకుండా ఆ దారిని కరెంట్ ఇవ్వడం ద్వారా బ్రేక్ చేస్తారు. రెండుమూడు చోట్ల సమస్య ఉన్నప్పుడు సరిగ్గా లోకలైజ్ చేయలేకపోతే అంటే ఎక్కడ సమస్య ఉందో సరిగ్గా తెలియకపోతే, ఒకచోటి కన్నా ఎక్కువ చోట్ల సమస్య ఉండి, ఆపరేషన్ సూట్‌గాని పేషెంట్లకు ఈ చికిత్స చేస్తారు. మెదడుకు సంబంధించిన ఈ జబ్బులే కాకుండా సైకియాట్రిక్ సమస్యలకు కూడా డిబిఎస్ ద్వారా చికిత్స అందించవచ్చు. ఒసిడి, మేజర్ యాంగ్జయిటీ డిజార్డర్లకు కూడా ఈ చికిత్స చేయవచ్చు. అంతేగాక క్రానిక్ పెయిన్ సిండ్రోమ్‌ను కూడా డిబిఎస్ ద్వారా తగ్గించవచ్చు. క్యాన్సర్ వల్ల వచ్చిన నొప్పి గానీ లేదా నడుము నొప్పి, డీజనరేటివ్ పెయిన్ అయినా డిబిఎస్ ద్వారా తగ్గించవచ్చు.
About Author –
Dr. Anandh Balasubramaniam, Senior consultant and HOD, Neurosurgery, Yashoda Hospital, is a renowned neurosurgeon in Hyderabad. His expertise include neuro-oncology, intraoperative MRI and image guided neurosurgeries, endoscopic surgeries, endoscopic minimally invasive surgeries, deep brain stimulation and functional neurosurgeries.